ఆర్మూర్ ప్రాంతంలోని ఏర్గట్లలో హిందువులు తమ పంతం నెగ్గించుకున్నారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. దీంతో అసలు విగ్రహం ప్రతిష్ఠించేందుకు అనుమతులే లేవని, విగ్రహం మధ్యలో వున్న ఇనుప చువ్వల్లో కాంక్రీట్ నింపవద్దని పోలీసులు షరతులు విధించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో తాము శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని యేడాదిలో నాలుగైదు సార్లు పోలీసులకు వినతి పత్రాలు సమర్పించామని, అయినా.. స్పందనే లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసుల అనుమతి వుందనే తాము భావించి, శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు అనుమతులు లేవనడంతో ఉద్రిక్తత నెలకొంది.తాము మాత్రం శివాజీ విగ్రహాన్ని తొలగించమని, గ్రామస్తులు అందరూ కలిసి స్థలం ఏర్పాటు చేసుకున్నామని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు స్థానికులు, యువజన సంఘాల వారితో సంప్రదింపులు జరిపారు.
చర్చలు జరిగిన తర్వాత విగ్రహం మాత్రం అక్కడే వుంచాలని, అయితే బట్ట కట్టాలని పోలీసులు సూచించారు. వారం పది రోజుల్లో ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొంది, విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్థులు అంగీకరించారు.