రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ-1 (సామాన్య) సార్వజనికోత్సవం శుక్రవారం జరిగింది. ఘట్ కేసర్ లోని అన్నోజిగూడ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సార్వజనికోత్సవానికి ముఖ్య అతిథిగా రామచంద్ర మిషన్ కన్హాశాంతివనం మేనేజర్ కెప్టెన్ వినీత్ సింగ్ రామావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలాంటి ఆపేక్ష లేకుండా చాలా సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజంలో పని చేస్తోందని అన్నారు అలాగే మర్యాదను కూడా కోరుకోకుండా ముందుకు సాగుతోందన్నారు. మన మూలాలను, సంస్కృతిని మరింత బలోపేతం చేసుకోవాలని, దీని ద్వారా వచ్చే తరానికి అందించిన వారం అవుతామన్నారు. మూలం గట్టిగా వుంటే శాఖలు కూడా విస్తరిస్తాయన్నారు. వీటన్నింటికీ మూలం ఆధ్యాత్మికత అని అన్నారు. తాను పనిచేస్తున్న రామచంద్ర మిషన్ ద్వారా వ్యక్తినిర్మాణం జరుగుతోందన్నారు. హిందుస్థాన్‌లోని ప్రజలపై అనేక అత్యాచారాలు జరిగాయని, ఇది చరిత్రలో కూడా వుందని అన్నారు. అలాగే ధర్మాన్ని ఇబ్బంది పెట్టారన్నారు. దీనికి కారణం భయం, దురాశేనని అన్నారు. వీటితో మన సిద్ధాంతాన్ని, మూలాన్ని మరిచిపోతామన్నారు. మన అఖండతను, మన మూలాలను పదే పదే గుర్తు చేయాల్సి వస్తోందన్నారు.
ఇక..ముఖ్య వక్త, ఆరెస్సెస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ... సాంస్కృతిక పునరుత్థానం కోసం, ఈ దేశ నిర్మాణంలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను డాక్టర్ హెడ్గేవార్ స్థాపించారని అన్నారు. జీవితమంతా బ్రహ్మచారిగా వుంటూ, ఆ కాలంలోనే డాక్టర్ అయినా.. తన వ్యక్తిగత జీవితం కోసం అస్సలు ఆలోచించలేదని, తన సర్వస్వాన్నీ సమాజం కోసమే అర్పణ చేసిన మహా పురుషుడు డాక్టర్జీ అని అన్నారు. అత్యంత శక్తిమంతమైన సమాజం లేకపోతే.. దేశానికి వైభవం చేకూరదని, ఒకవేళ విజయం సాధించినా.. అది మన చేతుల నుంచి వెళ్లిపోతుందని, తిరిగి అనేక బలహీనతలు వచ్చి చేరుతాయని ఆయన గ్రహించారని, అందుకే సమాజం జాగృతంగా వుండాలని, సమాజం సంఘటితంగా వుండాలన్న బృహత్తర ఆలోచనతో ఆరెస్సెస్‌ను ప్రారంభించారని వివరించారు. సమాజ జాగరణ, సమాజ సంఘటితం కోసం, శక్తి నిర్మాణం కోసం వ్యక్తులు అవసరమవుతారని, అందుకే వ్యక్తి నిర్మాణమే ప్రధాన ఉద్దేశంతోనే 90 సంవత్సరాల క్రితం శిక్షా వర్గలను ప్రారంభించారన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యక్తి నిర్మాణం అన్న దాని కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా లక్షలాది యువకులు ఈ శిక్షా వర్గలో పాల్గొంటున్నారని, వారందరూ ప్రశిక్షణ పొందుతున్నారని తెలిపారు.
గత 90 సంవత్సరాలుగా వ్యక్తి నిర్మాణం అన్న కార్యం జరుగుతోందని, దీని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఈ 20 రోజుల ప్రశిక్షణలో సమూలంగా వ్యక్తి నిర్మాణంలో వున్న ముఖ్యమైన అంశాలను స్పృశిస్తూ ఈ ప్రశిక్షణ జరిగిందన్నారు. 90 సంవత్సరాల ప్రశిక్షణ కారణంగా దేశవ్యాప్తంగా నిర్మాణమైన కార్యకర్తల జట్టు ఇప్పుడు దేశం ముందు నిల్చొని వుందన్నారు. ఇంత గొప్ప కార్యం సాధించడానికి ప్రేరణ గల వ్యక్తులు వుండాలని, వారు లేకుంటే సమాజ సంఘటన జరగదని డాక్టర్జీ భావించారన్నారు. అందుకే ప్రశిక్షణ ఆధారంగా బయటికి వచ్చే వ్యక్తులు ఆదర్శవంతమైన వ్యక్తులుగా సమాజంలోకి వస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా 1971లో భయ్యాజీ కాణే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి, అక్కడ చేసిన సంఘ విస్తరణ, సామాజిక కార్యక్రమాలను ఎక్కా చంద్రశేఖర్ ఉటంకించారు. 1971లో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి, ఓ పేద కుటుంబం నుంచి ఓ బాలుడ్ని తీసుకొని మణిపూర్ వెళ్లారు. అక్కడ 30 సంవత్సరాలు వున్నారు. ఈ సందర్భంగా ఆ బాలుడ్ని వనవాసీ క్షేత్రంలో విడిచిపెట్టేశారు. నా పిల్లవాడ్ని మీకు ఇచ్చేశాను. మీరు మీ పిల్లల్ని ఇచ్చేయండి విద్య కోసం అని వారిని చైతన్యపరిచారు. మణిపూర్ ప్రజలను చైతన్యపరిచారు. అక్కడి నుంచి 500 మంది వనవాసీ పిల్లల్ని కర్నాటక, మంగళూరుకు విద్య కోసం తీసుకొచ్చారు. దీంతో వారి కోసం హాస్టల్ ప్రారంభించాం. ఇప్పుటికీ 10,000 మంది వనవాసీ విద్యార్థులకు చదివిస్తున్నాం. మార్గదర్శనం చేస్తున్నాం. ఇంత మార్పును అక్కడ చూశాం. పది వేల మందిని ఉత్సాహపరిచిన కార్యకర్త ఇలాగే వుంటాడు.’’ అని తెలిపారు.
ఇలాంటి వేల మంది, లక్షల మంది ఉత్సాహవంతులైన కార్యకర్తలను శిక్షావర్గ అనే మాధ్యమంగా సంఘ్ నిర్మాణం చేసిందన్నారు. దేశ ఇతిహాసాలు, సంస్కృతి, మహా పురుషుల గాథలు విన్నప్పుడు ప్రేరణ కలుగుతుందన్నారు. అలాగే దేశం పట్ల సమగ్రమైన ఆలోచన కూడా ఏర్పడుతుందన్నారు. దేశ గతాన్ని చక్కగా అధ్యయనం చేసినప్పుడు ఈ భూమితో ఓ అనుబంధం ఏర్పడుతుందని, ఈ అనుబంధం కారణంగానే సమాజంలో పనిచేయడానికి వీలవుతుందన్నారు. ఈ అనుబంధాన్ని కలిగించేదే సంఘ శిక్షావర్గ అని వివరించారు. స్వామి వివేకానంద ఆశించినట్లు.. ‘‘ఒకవేళ ఈ దేశం ప్రపంచంలో శక్తిమంతమైన, మార్గదర్శనం చేసే స్థాయికి ఎదగాలంటే సంఘటన అవసరం. ఓ యంత్రాంగాన్ని నిర్మాణం చేయాలని చూశారు. గొప్ప విలువలను సాధారణ వ్యక్తుల దగ్గరికి తీసుకొచ్చి నిర్మాణం చేయాలని చూశారు. ఓ గొప్ప సంస్థ నిర్మాణం జరగాలని చూశారు. అలాగే ఈ దేశ నిర్మాణం కోసం అన్ని రకాల విషయాలపై అధ్యయనం చేసే మనుషులు వుండాలని భావించారు. మూడోది వీరందరూ కలిసి పనిచేసే సామూహిక సంకల్పం వుండాలని భావించారు.’’ అని పేర్కొన్నారు.
స్వామి వివేకానంద చెప్పిన పై మూడు విషయాలనూ గత 90 సంవత్సరాల కార్య పద్ధతి మాధ్యమంగా సంఘ్ సాధించిందన్నారు. మొదటిది వివేకానంద ఆశించినట్లు ఈ దేశంలో ఓ గొప్ప సంఘటనను నిర్మాణం చేశామని వివరించారు. సంఘ మొదటి ప్రశిక్షణలో 17 మంది వుంటే.. ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది కార్యకర్తల ప్రశిక్షణ సంఘ్ ఇవ్వగలిగిందన్నారు. రాబోయే కాలంలో ఇంకా లక్షల మంది కార్యకర్తలు తయారయ్యే అవకాశం వుందన్నారు. ఈ 100 సంవత్సరాలుగా ఏం జరిగిందని ఆలోచిస్తే.. ఈ 100 సంవత్సరాలు చాలా కీలకమైనవని, ఈ కాలంలో సంఘటనా కార్యాన్ని నిర్మాణం చేసిందన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ బలమైన, సంఘటితమైన హిందూ సంస్థ తయారైందన్నారు. ప్రతి చోటా సంఘం వుందని, 910 జిల్లాలున్నాయని, 910 సంఘ శాఖలున్నాయని, 55 వేల మండలాలున్నాయని,అందులో 35 వేల మండలాల్లో శాఖలు ఉన్నాయన్నారు. 10 లక్షల మంది యువకులు నిత్య శాఖకు హాజరవుతున్నారని తెలిపారు. ఇంతటి బలమైన, సంఘటితమైన హిందూ సంస్థను గత వెయ్యి సంవత్సరాల్లో ఎన్నడూ చూడలేదన్నారు.
సంఘ కార్యకర్తలు దేశంతో మమేకమై జీవించే వ్యక్తులని, ఎక్కడున్నా.. ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతంలో జన్మించినా.. దేశం యెడల సమానంగా స్పందించే హృదయాన్ని సంఘ్ నిలబెట్టిందన్నారు. ఈ భవ్యమైన దృశ్యం ఇప్పుడు దేశంలో కనిపిస్తోందన్నారు. హిందుత్వం అనేది కేవలం భారత్‌లోనే కాదు.. యావత్ ప్రపంచంలో విస్తరించిందన్నారు. సంఘ కార్యకర్త కేవలం ఈ సంస్కారాలను, సంఘటనా శైలిని భారత్ లోనే కాకుండా ఎక్కడికి వెళ్లినా... వాటిని తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని విస్తరించారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓ గొప్ప సంఘటనా కార్యాన్ని శిక్షావర్గ మాధ్యమంగా సంఘ్ నిలబెట్టిందని పేర్కొన్నారు. సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు కావస్తున్నాయని, శతాబ్దిలో వున్నామని, భాగంగా వున్నామని అన్నారు.
ఈ 90 సంవత్సరాల కాలఖండంలో సంఘ్ సంస్థాగత శక్తికి ఉదాహరణ రామజన్మభూమి నిధి సేకరణ అని వివరించారు. 45 రోజుల్లోనే 6 లక్షల గ్రామాలు, 12 కోట్ల కుటుంబాలు, పదకొండు వందల కోట్ల వరకు నిధి సేకరించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఒక్కోసారి చేరుకోలేదని ,కానీ.. సంఘ కార్యపద్ధతి ద్వారా, సంఘటిత శక్తి కారణంగా, రామునిపై భక్తి కారణంగా టార్గెట్ చేరుకున్నామని, రామునిపై భక్తి కారణంగా 3 వేల మూడు వందల కోట్లతో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేశామన్నారు. ఈ 90 సంవత్సరాల కాలఖండంలో మన శక్తికి నిదర్శనం రామజన్మభూమి నిధి సేకరణ కార్యక్రమం అని తెలిపారు.
రాబోయే రోజుల్లో సంఘ విస్తరణ మరింత విస్తృతంగా జరగాలని, లక్ష గ్రామాల్లో శాఖలు నడవాలని, దీని ద్వారా జాగృతమైన, సంఘటితమైన యువకుల బృందం తయారు కావాలని, దీని ద్వారా జాగృతమైన సమాజం నిర్మాణం అవుతుందని అన్నారు. జాగృతమైన సమాజం నిర్మాణమైతే.. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా.. దాని గురించి ఆలోచించి, పనిచేసే ఓ ప్రక్రియ నిర్మాణం అవుతుందని, అలాంటి సామాజిక చైతన్యంతో కూడిన సమాజాన్ని మరికొన్ని రోజుల్లో చూడబోతున్నామని అన్నారు. లక్ష గ్రామాలకు విస్తరించే కార్యాన్ని సంఘ పెద్దలు ఆదేశించారని, దీని కోసం కార్యకర్తలు కార్యక్షేత్రంలో పనిచేయాలన్నారు. ఏ సిద్ధాంతమైనా ఓ కోణంలో మాత్రమే పనిచేస్తుందని, కానీ సంఘం మాత్రం అన్ని కోణాలనూ స్పృశిస్తుందని, అన్ని కోణాల్లోనూ మనం సంఘ సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించామని ఎక్కా చంద్రశేఖర్ తెలిపారు.
సార్వజనికోత్సవంలో భాగంగా స్వయంసేవకులు తాము నేర్చుకున్న పలు అంశాలను ప్రదర్శించారు ఇందులో భాగంగా వాద్య ఘోష్, దండ యుద్ధ, నియుద్ధ, సాంఘిక గీత్, వ్యాయామ్ యోగ్, క్రీడా పాటవాలను ప్రదర్శించారు.