రామకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం సంస్కార్ 2025 లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మఠం నిర్వాహకులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు ప్రకటించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కూడా అవసరమేనని నొక్కి చెప్పారు. అలాగే పిల్లల్లో సంస్కృతి, సంప్రదాయంపై అవగాహన కల్పించి, నైతికతను ఎలా పెంపొందించుకోవాలని వివరించారు. విద్యార్థులు నిరంతరం తల్లిదండ్రులను ఆప్యాయంగా, ప్రేమగా చూసుకోవాలని సూచించారు. వీటి ద్వారాభారతీయ సంస్కృతిపై అవగాహన పిల్లలకు మరింత పెరుగుతుందని బోధమయానంద సరస్వతీ అన్నారు.
తల్లిదండ్రుల పట్ల పిల్లలకు కావలసినటువంటి భక్తి విశ్వాసము, పిల్లల పట్ల తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ప్రేమ, శ్రద్ధ గురించి చాలా చక్కగా కార్యక్రమం నిర్వాహకులు వివరించినారు. తదుపరి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమము ఇక్కడ మఠంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలన్నీ దూరమై వారు మంచి సంస్కారానికి అలవాటు పడతారని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఇక.. ఈ సంస్కారం శిబిరం ముగింపు కార్యక్రమం ఈ నెల 24 న వుంటుందని, దీనికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ హాజరవుతారని స్వామీజీ తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ జరుగుతుందని తెలిపారు.