ప్రతి క్షణం హింసామర్గాన్నే అనుసరించే మావోయిస్టులు, ఆ హింసను అనుక్షణమూ అనునిత్యమూ సమర్థించే అర్బన్ నక్సలైట్లు కేంద్రం చేపట్టిన ‘‘ఆపరేషన్ కగార్’’ తో వ్యూహాత్మకంగా శాంతి చర్చలు అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు. కగార్ తో కంగారు పడిన మావోలు శాంతి చర్చలకు సిద్ధమంటూ ఏకంగా లేఖలు కూడా రాస్తున్నారు. దీంతో దేశంలో మరోసారి నక్సలైట్లతో శాంతి చర్చలు అన్న అంశం చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్ “”తో భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఈ చర్చ మరింత విస్తృతమైంది.
అయితే... ఈ సమయంలోనే మావోయిస్టులు మళ్లీ శాంతి చర్చలను ఎందుకు లేవనెత్తారన్న ప్రశ్న మొదలైంది. నిజానికి మావోయిస్టుల విషయంలో రాష్ట్రాలు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నా సరే... కేంద్రం ఓ రకంగా దీనిని అత్యంత సీరియస్ అంశంగానే తీసుకుంది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తోపాటు అనేక సందర్భాలలో శాంతి చర్చలు అంశం తెరపైకి వచ్చింది.నక్సల్స్ ప్రతిసారి ఊపిరి సలపడానికే ఉపయోగించుకున్నారు. మళ్లీ ఇప్పుడు కూడా మరొకసారి తెరపైకి వచ్చింది ఇదే అంశం.
మావోలకు ఇప్పుడు అత్యంత గడ్డుకాలం. వారి నీడను వారే నమ్మలేని దుస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహంలో చిక్కుకుపోయారు. నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు, మరికొందరు ఎదురు కాల్పుల్లో హతమవుతున్నారు. తాజాగా ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు హతమయ్యాడు. అంతటి పెద్ద స్థాయిలో వున్న నేతలు ఎన్ కౌంటర్‌లో హతం కావడం గతంలో ఎప్పుడు లేదు. భారీ సంఖ్యలో మావోలు కూడా హతమయ్యారు. తాజాగా ఛత్తీస్ గఢ్‌లోని మావోలకు కీలక ప్రాంతమైన సుక్మాలో ఒకేసారి 18 మంది మావోలు లొంగిపోయారు. దేశవ్యాప్తంగా ఎందరో నక్సలైట్లు ఇదే పంథాను అనుసరిస్తున్నారు.
ఈ పరిణామాలతో నక్సలైట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పరిస్థితులను అంచనా వేసుకోవడానికి గానీ, సమీక్షించుకోవడానికి గానీ కేంద్ర ప్రభుత్వం అస్సలు ఛాన్సే ఇవ్వడం లేదు. దీంతో కాస్త వెసులుబాటు కోసం మావోలు శాంతి చర్చలు అన్న దానిని తీసుకొచ్చారు. ఈ శాంతి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వుండొచ్చు. అలాగే శాంతి చర్చలంటే ఫైరింగ్ వుండదు. దీంతో కాస్త వెసులుబాటూ దొరుకుతుంది. తదుపరి వ్యూహాలను రచించుకోవచ్చు. బలహీనపడిన కేడర్‌లో ధైర్యం నింపి, వారిని ఉత్తేజపరుచుకోవచ్చు, అదే సమయంలో రిక్రూట్‌మెంట్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ దళాలతో ఆపరేషన్ సమయంలో పార్టీ వ్యూహ రచన, దాని అమలు, ఆలోచించడం అనేది దాదాపు అసాధ్యం. యుద్ధ వ్యూహాలను రచించడానికే సమయం సరిపోతుంది. అలాంటప్పుడు శాంతి చర్చలు అంటే యుద్ధ వాతావరణం ఆగిపోతుంది. అప్పుడు శాంతంగా తదుపరి వ్యూహాలు రచించుకోవచ్చు. తాము ఓడిపోయామని ఎవరూ చెప్పుకోరు. కాబట్టి, వెసులుబాటు కోసం శాంతి చర్చలను ఎత్తుకున్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన శాంతి చర్చల అనుభవాలు ఈ విధంగానే ఉన్నాయనేది అందరూ గ్రహించారు.
మరోవైపు అర్బన్ నక్సలైట్లు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాధారణ ప్రజానీకంలోనే కలిసి ఉంటూ నక్సలిజానికి విస్తృత వ్యాప్తి కలిగిస్తున్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూంబింగ్, కాల్పులు, నిఘా లేని వాతావరణం మొదట నిర్మాణం కావాలి. అందుకు చర్చల పేరుతో కాలయాపన చేస్తే సరిపోతుందన్నది మావోల వ్యూహం. శాంతి చర్చలనేవి ఓ ఎత్తుగడ.
అసలు మావోయిస్టులు ప్రభుత్వంతో ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతారు? మావోలు చేతిలో ఆయుధాలు ధరించి వెళితే, ప్రభుత్వం అంగీకరిస్తుందా? అసలు భారత రాజ్యాంగం మీద నక్సలైట్లకు, వారి ప్రతినిధులకు గౌరవమే లేదు. అలాంటప్పుడు చర్చలు ఎలా జరుగుతాయి? పోనీ.. ఒకవేళ చర్చలు జరిగితే.. తమ తరపున అభివృద్ధికి ఎలా సహకరిస్తామో నక్సలైట్లు ప్రభుత్వాలకు చెబుతారా? అసలు ప్రజల, ఆదివాసీల అభివృద్ధికి వారి సహకారం వుంటుందా? అన్న విషయాలపై ఇంకా స్పష్టతే లేదు. ఎందరో పోలీసులను, ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులను, ఆదివాసీలను, గ్రామ ప్రజలను, ప్రజా ప్రతినిధులను నక్సలైట్లు చంపేశారు. ప్రజలకే ఉపయోగపడే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను ఎన్నో చోట్ల నేలమట్టం చేశారు. ఇలా విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన మావోయిస్టులు శాంతి పేరిట చర్చలు అంటే... అవెలా జరుగుతాయి?
అంతేకాకుండా గతంలో చర్చలు జరిగిన సమయంలో నేరుగా మావోలు పాల్గొన్న సందర్భం లేదు. మొత్తంలో ఒక రోజో, రెండో రోజులో మాత్రమే అగ్రనేత ఆర్కే పాల్గొన్నాడు. మిగతా అంతా మావోల తరపున ప్రతినిధులు, అర్బన్ నక్సలైట్లు మాత్రమే చర్చలు జరిపారు. కానీ.. ఈసారి మాత్రం తామే చర్చల ప్రతిపాదన పెట్టారు. అయితే ఆయుధాలు వదిలేస్తామని గానీ, తామే ప్రత్యక్షంగా చర్చిస్తామని గానీ చెప్పట్లేదు. ఆయుధాలు చేతబూని చర్చలనడం అర్థరహితం.
చర్చలు అన్న నెపాన్ని ముందు పెట్టి, అడవి నుంచి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చు. ప్రస్తుతం చుట్టూ పోలీసులు, కోవర్టుల మధ్యలో నక్సలైట్లు వుండిపోయారు. అడవిలో వుండలేరు, బయటికి వెళ్లనూ లేరు. దీంతో చర్చలు అన్న పేరుతో అడవి నుంచి బయటికి వచ్చి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. విస్తరించవచ్చు. ప్రస్తుతం అడవిలో, అదీనూ కొద్ది ప్రాంతాలకే నక్సలైట్లు పరిమితమయ్యారు.దీంతో భద్రతా బలగాలకు, వారిని స్కాన్ చేయడం ఈజీ అయ్యింది. దీంతో ఈజీగా మావోలు దొరికిపోతున్నారు. ప్రభుత్వంతో చర్చలంటే లొంగుబాట్లు ఆగిపోతాయి. ఇదే అదనుగా దేశమంతా విస్తరించే పనిని మావోయిస్టులు వేగంగా చేపట్టి తమ నెట్‌వర్క్‌ను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. అలాగే అర్బన్ నక్సలైట్ల ద్వారా మావోయిస్టు ఉద్యమానికి ఊపిరి పోయడం, ప్రజల్లో మావోలపై, మావో సానుభూతిపరులపై సానుకూల వాతావరణాన్ని తీసుకురావడం శాంతి చర్చల పేరిట మరో వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు నక్సలైట్లలో ప్రస్తుతం వ్యూహం వేయడానికి మిగిలింది మొదటి తరం నేతలే. అందులో చాలామంది వయస్సు మళ్లినవారే. ప్రస్తుతం అత్యంత బలంగా వున్న కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడం రెండో తరానికి కుదరని పని. మొదటి తరానికి పోరాడే పరిస్థతి లేదు. వీరు ఒక్కొక్కరుగా రాలిపోతుండగా, ఉన్నవారు కూడా అనారోగ్యం, వయస్సు పైబడటం వల్ల వ్యూహం వేయడం, విస్తరించడం కుదరడం లేదు. అందుకే చర్చలంటూ చెప్పి, రెండో తరాన్ని క్రియాశీలం చేసుకోవచ్చు, బయటి ప్రాంతాలకు వెళ్లొచ్చు, నెట్ వర్క్‌ను విస్తరించుకోవచ్చు. కొత్త నాయకత్వాన్ని సృష్టించుకోవచ్చు, పాత తరానికి విశ్రాంతి కూడా ఇవ్వొచ్చు. చచ్చిపోతున్న మావోసిద్ధాంతాన్ని చర్చల పేరుతో తిరిగి నిలబెట్టే ప్రయత్నం బలంగా చేయవచ్చన్నది మావోల శాంతి మంత్రపు వ్యూహంగా స్పష్టమవుతోంది.
నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులని, ప్రజా కోర్టుల్లో విచారణ అంటూ అమాయక గిరిజనులను చంపేస్తున్నారన్న అంశం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. తుపాకీ రాజ్యమంటూ వారు చేస్తున్నవన్నీ అభివృద్ధి నిరోధకమేనని ప్రజలకు తెలిసిపోయింది. దీంతో తిరిగి ప్రజల్లో సానుభూతిని కూడగట్టుకోవడానికి శాంతి పేరిట ఇదొక ప్రయత్నమని అర్థమవుతోంది. నూరు ఎలకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు తాము హింసావాదులం కామని, తాము కూడా శాంతిని కోరుకునే వారమన్న పాజిటివ్ సంకేతాలను చర్చల ద్వారా సమాజానికి పంపాలని మావోయిస్టులు చూస్తున్నారు. అలాగే వారి సైద్ధాంతిక పునాదులు కూడా పూర్తిగా కదలిపోతున్నాయి. చర్చల అంశంతో ప్రజల్లోకి వచ్చి, సైద్ధాంతిక పునాదులను కూడా బలం చేసుకోని ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు.ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం, మావోయిస్టులు పూర్తిగా బలహీనమై పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఒకవేళ కేంద్రం శాంతి చర్చలకు ఓకే చెబితే.. వారికి పెద్దపీట వేసి, గౌరవించినట్లే లెక్క. రాజ్యాంగం మీద నమ్మకం లేని వారితో, ఈ దేశ సారభౌమత్వాన్ని గౌరవించని వారితో కేంద్రం ఎలా చర్చలు జరుపుతుంది? దాదాపుగా నక్సలైట్లపై కేంద్రం పైచేయి సాధించేసింది. మావోల శాంతి చర్చలకు కేంద్ర అస్సలు అంగీకరించనే అంగీకరించదు.
పాకిస్తాన్ విషయంలో కాల్పుల విరమణ పాటిస్తున్నారు కానీ.. తమతో ఎందుకు చేయడం లేదంటూ నక్సలైట్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటి వరకూ సమాజంలో నక్సలైట్ ఉద్యమం, నగ్జలైట్లు చేసిన విచ్ఛిన్నం అంతా ఇంతా కాదు. అనేక మంది ప్రాణాలు పోయి, అభివృద్ధి ఆగిపోయింది. మావోలు తుపాకులు పక్కనెట్టి, చర్చలకు వస్తామని ఎక్కడా చెప్పడం లేదు. దీంతో కేంద్రం కూడా శాంతి చర్చల వైపు అంతగా మళ్లడం లేదు. పాకిస్తాన్ విషయానికి వస్తే కాల్పుల విరమణ మాత్రమే జరిగింది తప్ప మరో రూపంలో ఆ దేశంపై పోరు కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌కి సింధు జలాల నిలిపివేత, ఆ దేశంతో వాణిజ్య స్తంభన, గగనతలంపై ఆంక్షలు ఇదంతా ఇప్పటికీ కొనసాగుతున్న యుద్ధమే... ఈ వాస్తవాన్ని మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు గ్రహించాలి.
ఇదొక్కటే కాదు మావోయిస్టులు హింసను మాని జన జీవన స్రవంతిలో కలవాలని, అలా వచ్చినవారికి అన్ని విధాలుగానూ తోడ్పాటును అందిస్తామని నేటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు పలుమార్లు స్పష్టం చేసి ఎన్నో అవకాశాలిచ్చాయి. హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వీడి సమాజంలోకి వచ్చిన ఎందరో మాజీ నక్సలైట్లు ప్రజా ప్రతినిధులుగా సైతం ఎన్నికై ప్రభుత్వాల్లో కీలకపాత్ర పోషించిన వారున్నారు. ఇంకెందరో మాజీ నక్సలైట్లు ప్రభుత్వాల పిలుపుతో హింసను వీడి సర్కారు సాయంతో ఉపాధి పొంది జీవిస్తున్నారు. కళ్ళముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్న పరిస్థితుల్లో శాంతి చర్చలు కాదు, హింసను వీడుతున్నాం... జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాం... అని నక్సలైట్లు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? ఈ నిర్ణయం దిశగా వీరిని అర్బన్ నక్సలైట్లు ఎందుకు ప్రోత్సహించడం లేదు? జవాబు అనే బంతి నక్సలైట్ల కోర్టులోనే ఉంది.