మావోయిస్టులు సుక్మా జిల్లాలో దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట- గొల్లపల్లి రోడ్డులో ఐఈడీతో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. దీంతో ఏఎస్పీ ఆకాశ్ రావు గిరిపుంజే తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
జూన్ 10న మావోయిస్టు సంస్థలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఆకాశ్ రావు తన బృందంతో కలిసి కొంటాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కొంటా ఎస్డీఓపీ, కొంటా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తోపాటు మరో ఇద్దరు సిబ్బందితో నిఘా విధులు నిర్వర్తిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నక్సలైట్లు వ్యూహాత్మకంగా అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు.గాయపడిన పోలీసులందర్నీ కొంటా ఆస్పత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఏఎస్పీ ఆకాశ్ రావు మరణించారు. గాయాలపాలైన కొంటా ఎస్డీఓపీ, ఎస్హెచ్ఓ, మరో జవాన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఖండించారు. ఏఎస్పీ ఆకాశ్ రావు త్యాగం వృధా కాదని అన్నారు. ‘‘ఏఎస్పీ ఆకాశ్ రావు గిరింపుంజే మృతిపై నివాళులు అర్పిస్తున్నా. ఆయన త్యాగం వృధా కాదు. మావోయిస్టులు చివరి శ్వాసలో వున్నారు. నిరాశతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ దాడిని ఖండిస్తున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఈ దాడిలో గాయపడిన పోలీసులకు ఉత్తమ వైద్య చికిత్స నిమిత్తం రాయ్ పూర్ కి తీసుకెళ్తారు’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.