ప్రభుత్వ కార్యక్రమాల్లో భారతమాత చిత్రాన్ని అనుమతించబోమంటూ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కింది. అలాంటి చిత్రానికి రాజ్యాంగం ద్వారాగానీ, భారత ప్రభుత్వం ద్వారాగానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది. అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారతమాత చిత్రం వినియోగించడాన్ని అంగీకరించలేదని పేర్కొంది. ఆ చిత్రం పెట్టినందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి.ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అధికారిక కార్యక్రమాలను రాజకీయ సమావేశాలుగా మార్చకూడదని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజ్‌భవన్ కార్యక్రమంలో భారతమాత చేతిలో జాతీయ జెండా బదులు పార్టీ జెండా ఉందని, అందువల్ల అలాంటి చిత్రాలను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగించకూడదంటూ తన పెడ ఆలోచనను సమర్థించుకుంది.