బలూచిస్తాన్ పౌరుల గొంతు నొక్కడానికి కొత్త చట్టాన్ని తెచ్చిన పాక్

VSK Telangana    10-Jun-2025
Total Views |
 
BAloch 1
 
బలూచ్ ప్రజల ప్రత్యేక దేశ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు బీఎల్ ఏ దాడులు, మరోవైపు బలూచ్ ప్రజల ఆందోళనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం బలూచ్ ప్రజల గొంతును అణిచివేయడానికి మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, పాక్ సైన్యం, భద్రతా దళాలు బలూచ్‌లను మరింతగా అణచివేయడానికి స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ఈ చట్టం ప్రకారం బలూచ్ పౌరులు ఎవరిపైనైనా ఏదైనా అనుమానం ఉంటే, ఎటువంటి అభియోగం లేకుండా కోర్టు అనుమతి లేకుండానే సైన్యం, నిఘా సంస్థలు వారిని అరెస్టు చేసి 90 రోజుల పాటు నిర్బంధించవచ్చని ఈ చట్టంలో ఉంది. వాస్తవానికి, ఈ చట్టం పౌర హక్కులను ఉల్లంఘిస్తుందని, మానవ హక్కుల సంస్థలు, బలూచ్ కార్యకర్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది న్యాయపరమైన రక్షణలను దాటవేసి, బలూచ్ పౌరులపై అణచివేత చర్యలను ఇది చట్టబద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ చట్టంలోని ప్రధాన నిబంధనల గురించి మాట్లాడుకుంటే, భద్రతా దళాలు ఏ పురుషుడిని లేదా స్త్రీని అయినా ఎటువంటి ఆరోపణలు లేకుండా కేవలం అనుమానం ఆధారంగా 90 రోజుల పాటు నిర్బంధించవచ్చు. ఈ కాలంలో ఎలాంటి అణచివేత వ్యూహాలను అవలంబిస్తారో చెప్పడం కష్టం. రెండవది, ఉమ్మడి దర్యాప్తు బృందాలు నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అనుమానితుల సైద్ధాంతిక నేపథ్యాన్ని దర్యాప్తు చేయవచ్చు. మూడవది, ఈ చట్టం ప్రకారం, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, సోదా చేయడంతో పాటుగా అరెస్టు చేయడానికి ముందస్తు న్యాయపరమైన అనుమతి అవసరం లేదు. నాల్గవది సైనిక అధికారులు ఎలాంటి అనుమతి లేకుండానే అణిచివేయవచ్చు. ఇది సైనిక నియంత్రణను పెంచుతుందని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ చట్టం గురించి బలూచ్ మానవ హక్కుల సంస్థలతో పాటు, అంతర్జాతీయ సంస్థలలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. వారు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని వారి వాదన. కేవలం ఓ అనుమానం కారణంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ఈ చట్టం ద్వారా, బలూచిస్తాన్ మొత్తాన్ని చట్టబద్ధమైన నిర్బంధ ప్రాంతంగా మార్చే ప్రణాళిక ఉందని బలూచ్ యాక్జెహ్తి కమిటీ (BYC) తెలిపింది. ఈ చట్టం బలూచ్ పౌరులపై రాష్ట్ర-ప్రాయోజిత అణచివేతను అధికారికం చేస్తుందని BYC కార్యకర్తలు అంటున్నారు. వారు దీనిని నాజీ జర్మనీ. ఆధునిక జిన్జియాంగ్‌లో ఉపయోగించే అణచివేత పద్ధతులతో పోల్చారు.
 

BAloch 2 
బలూచిస్తాన్ చాలా కాలంగా బలూచ్ స్వాతంత్ర్యం కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంది, మరోవైపు అది పాక్ అణచివేత చర్యల మధ్య నలిగిపోతోంది. బలూచ్ కార్యకర్తలు, పౌరుల బలవంతపు అదృశ్యాల సంఘటనలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఈ కొత్త చట్టం ఈ సంఘటనలను చట్టబద్ధం చేయవచ్చు, ఇది బలూచ్ సమాజంలో భయంతో పాటుగా అభద్రతా భావాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని BYC తో పాటుగా ఇతర మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చట్టం పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10, పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ సమావేశానికి ఉల్లంఘనగా వారు భావిస్తున్నారు. పాక్ దేశంలోని నిరంకుశ పాలకులు ఈ చట్టాన్ని బలూచిస్తాన్ అసెంబ్లీ ద్వారా ఆమోదించడం ద్వారా బలూచ్ ప్రజల అణిచివేతకు సంబంధించిన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఒక వైపు ఈ చట్టం న్యాయ ప్రక్రియను బలహీనపరుస్తుండగా, మరోవైపు ఆ ప్రాంతంలో సైన్యం పట్టును బిగించబోతోంది. మానవ హక్కుల సంస్థలు, బలూచ్ కార్యకర్తలు ఈ చట్టం బలూచ్ పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేసే కొత్త సాధనంగా మారుతుందని నమ్ముతున్నారు.