నిరసనలతో అట్టుడుకుతున్న లాస్‌ ఏంజెలెస్

VSK Telangana    10-Jun-2025
Total Views |
 
Los angeles
 
ఇమ్మిగ్రేషన్‌ దాడులకు వ్యతిరేకంగా లాస్‌ ఏంజెలెస్‌లో ఆందోళనచేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్‌ గార్డును మోహరిస్తూ తీసుకున్న నిర్ణయంతో నాలుగు రోజులుగా నగరంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. మాస్కులు ధరించిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. నిరసనలలో మాస్కులు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
 
శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర గవర్నర్ల పరిధిలో ఉండగా దాన్ని అతిక్రమిస్తూ లాస్‌ ఏంజెలెస్‌లోకి నేషనల్‌ గార్డు బలగాలను ట్రంప్‌ మోహరించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. లాస్‌ఏంజెల్స్‌ కౌంటీవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింస పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. సోమవారం అదే పరిస్థితి నెలకొంది.
లాస్‌ఏంజెల్స్‌ వీధుల్లో చోటు చేసుకున్న దృశ్యాలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి.
2020లో పోలీసులు జార్జి ఫ్లాయిడ్‌ను హత్య చేసినపుడు చెలరేగిన నిరసనల తీరును తలపించేలా ఈ దృశ్యాలు వున్నాయి. ఎక్కడ చూసినా విరిగిపడిన బారికేడ్లు, నీళ్ళ బాటిళ్లు, తగలబడుతున్న కార్లు, తిరగబడిన ట్రాఫిక్‌ కోన్‌లతో ఆ ఏరియా అంతా అస్తవ్యస్థంగా, గందరగోళంగా వుంది. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
 
ఆందోళనకారులు ప్రధాన మార్గాన్ని మూసివేసి కార్లకు నిప్పుపెట్టగా వారిని చెదరగొట్టేందుకు నేషనల్‌ గార్డు బలగాలు బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించాయి. డజన్ల కొద్దీ అక్రమ వలసదారులు, నేరపూరిత ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇమ్మిగ్రేషన్‌ దాడులకు నిరసనగా లాటిన్‌ అమెరికన్‌ పౌరులు అధికంగా నివసించే లాస్‌ ఏంజెలెస్‌లో శుక్రవారం నిరసనలు ప్రజ్వరిల్లాయి.
 
ఆందోళనలు, నిరసనలు చేస్తున్న వారిపై అత్యంత సమీపం నుండి పోలీసులు, కాలిఫోర్నియా నేషనల్‌ గార్డ్‌ సైనికులు కాల్పులు జరపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. నేషనల్‌ గార్డును లాస్‌ ఏంజెలెస్‌లో మోహరించి ట్రంప్‌ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసామ్‌ విమర్శించారు. బలగాలను ఉపసంహరించాలని డిమాండు చేశారు. పరిస్థితులను అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్​కు సహాయంగా, పెంటగాన్​ 700 మంది మెరైన్స్​ను మోహరించింది.
 
మరోవైపు లాస్ ఏంజెలెస్​లో జరుగుతున్న నిరసనలను అడ్డుకోవడానికి అదనంగా మరో 2000 మంది నేషనల్ గార్డ్స్​ను మోహరించడానికి ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారని అధికారులు తెలిపారు. అయితే ఈ అదనపు దళాలను అక్కడకు తరలించడానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టవచ్చని ఓ అధికారి తెలిపారు. తక్షణమే ఫెడరల్‌ ఏజెంట్లు, నేషనల్‌గార్డ్‌ బలగాలు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. మెక్సికో, హోండూరస్‌, ఎల్‌ సాల్వడార్‌ దేశాల పతాకాలను చేబూని పలువురు ప్రదర్శనల్లో పాల్గొనడం కనిపించింది.
 
లాస్‌ ఏంజెలెస్‌లో వలసదారుల నిరసనను అణచివేసేందుకు చట్ట వ్యతిరేకంగా నేషనల్‌ గార్డు బలగాలను పంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసామ్‌ ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించకుండా నేషనల్‌ గార్డును ఆ రాష్ట్రంలో మోహరించడం చట్ట విరుద్ధం, అనైతికమని డెమోక్రాట్‌ పార్టీకి చెందిన గవిన్‌ విమర్శించారు. నావికాదళాలను కూడా మోహరిస్తామన్న ట్రంప్‌ బెదిరింపుల వల్లే లాస్‌ఏంజెల్స్‌లో పరిస్థితి తీవ్రతరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికాలో అత్యంత జనసాంద్రత కలిగిన లాస్‌ఏంజెల్స్‌ కౌంటీలో దాదాపు కోటి మంది జనాభా వుంటారు. వీరిలో దాదాపు సగం మంది లాటిన్‌ అమెరికన్లే. దాదాపు 35శాతం మంది అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో పుట్టినవారే. 2022 నాటి ఒక నివేదిక ప్రకారం దాదాపు 18శాతం మంది ప్రజలు మిక్స్‌డ్‌ స్టేటస్‌ను కలిగివున్న కుటుంబాలే అని తేలింది. అంటే వారు గానీ లేదా వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా జీవిస్తున్నవారే. తన చర్యలను, వైఖరిని సమర్ధించుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వరుసగా పలు సోషల్‌ మీడియా పోస్టులు పెట్టారు. లాస్‌ఏంజెల్స్‌లో పరిస్థితులేమాత్రం బాగాలేవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్‌ ఈ రీతిన పరిస్థితులను ఉద్రిక్తపరుస్తున్నారని కాలిఫోర్నియా నేతలు విమర్శిస్తున్నారు. ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కూడా ట్రంప్‌నే సమర్ధించారు. 1965 తర్వాత ఇలా బలగాలను రంగంలోకి దించడం ఇదే ప్రధమం.