దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామ చంద్రుడి ఆలయంలో అపచారం జరిగింది.ఆలయ ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు విక్రయించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. అయితే దుకాణ దారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార నినాదాలు ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతోంది. గుంటూరుకి చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది.
రాములవారి దర్శనానికి వచ్చిన గుంటూరుకు చెందిన భక్తులు రెండు చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారు వీటిని రెండు సంచుల్లో పెట్టి భక్తులకు అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై ఉన్న అన్యమత ప్రచార నినాదం చూసి భక్తులు అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే దుకాణదారు నుంచి సరైన సమాధానం రాలేదని, దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం.
అయితే.. ఈ అన్యమత ప్రచారంపై దుకాణుదారులు స్పందించారు. తమ వద్ద వున్న అన్ని సంచులపై దేవస్థానం చిత్రాలే వుంటాయని, ఆ సంచులపై అన్యమత నినాదాలున్నట్లు తాము చూడలేదని, అవి ఎలా వచ్చాయో కూడా తమకు తెలియదని అంటున్నారు.
అయితే.. భద్రాచలం లాంటి పుణ్య క్షేత్రాల్లో అన్యమత ప్రచారం వెలుగులోకి రావడంతో హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ సంచులపై అన్యమత ప్రచార నినాదాలు ఎలా వచ్చాయన్న దానిపై తేలడానికి ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని హిందువులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి .