సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం, శక్తిపీఠంగా, జ్యోతిర్లింగా పేరుగాంచిన శ్రీశైల దేవస్థానం వద్ద బుల్లెట్లు, బాంబులు లభ్యమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన కలిగించింది. ఈ ఘటన రెండు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. ఓ సంచిలో బుల్లెట్లు, బాణసంచా, బాంబులు, ఎర్రటి గుడ్డ ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలంలోని ప్రసిద్ధ వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డుపై, డివైడర్‌లో మొక్కల మధ్య ఓ అనుమానాస్పద సంచి సోమవారం కనిపించింది. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ఈ సంచిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేసి, సంచిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో నుంచి SLR 303, పిస్టల్ రౌండ్లతో పాటు, నాలుగు వంకాయ బాంబుల తరహా బాణసంచా బాంబులు లభించాయి. అలానే ఒక ఎర్రటి వస్త్రం కూడా ఆ సంచిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే వీటిపై ఉన్న పలు అనుమాలన్నీ తీరాయి. అవి పోలీసు శాఖకే చెందినవని.. ఇది అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదమని ఆత్మకూర్ డీఎస్పీ రామాంజినాయక్ స్పష్టం చేశారు.