వేములవాడ: మరే ఇతర దేవాలయాలలో లేని ఓ ఆనవాయితీ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉంది. కోరిక నెరవేరిన భక్తులు దేవుడి మొక్కు కింద కోడె (ఎద్దు)లను ఆలయానికి సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇలా పొందిన కోడెల సంరక్షణ కోసం ఆలయం రెండు గోశాలలను కూడా నిర్వహిస్తోంది. గతంలో కోడెలను వేలం ద్వారా తిరిగి అమ్మే పద్ధతి ఉండేది కానీ, ఆ కోడెలను విక్రయించడం, కబేళాలకు తరలిస్తున్నారన్న వాదనలు వినిపించాయి. దాంతో వాటి వేలం ప్రక్రియను ఆపి వాటిని సంరక్షించే గోశాలలకు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు ఉచితంగా ఇచ్చే పద్ధతిని ప్రారంభించారు. అయినప్పటికీ దీన్ని కూడా పక్కాగా అమలు చేయలేకపోయారు. గోశాలలు, రైతుల పేరు చెప్పి కొందరు వాటిని చేజిక్కించుకుని అమ్ముకుంటున్నారు.
ఇక ఇటీవల కాలంలో చాలా గోవులు పోషణ సరిగ్గా లేక చనిపోతున్నాయి. తాజాగా 39 గోవులు మరణించాయి. గోశాలలో ప్రస్తుతం 1,150 ఎద్దులున్నాయి. ప్రతినెల దాదాపు కొత్తగా 250 ఎడ్లు వస్తాయి. దాంతో అక్కడున్న వందలాది ఎడ్లకు ఆహారం ఇవ్వడానికి అధికారులు అత్యవసరంగా పచ్చగడ్డిని సహాయంగా కోరుతున్నారు. సహాయం కోసం ఆలయం చేసిన పిలుపుకు స్పందించిన స్థానిక రైతుల బృందం ఇప్పటికే 75,000 కిలోల పచ్చగడ్డిని ఆలయ గోశాలకు సరఫరా చేసింది.
"గోశాలలోని గోవుల కోసం ప్రత్యేకంగా గడ్డిని తెచ్చిన రైతుల బృందం, రవాణా ఖర్చులను కూడా భరించి, తమ సొంత ట్రాక్టర్లను ఉపయోగించి దానిని తీసుకువచ్చారు. వారి దాతృత్వం పెద్ద మార్పును తెచ్చిపెట్టింది" జిల్లా పశుసంవర్ధక అధికారి వి. రవీందర్ రెడ్డి అన్నారు. గోవుల సంరక్షణ దృష్ట్యా అధికారులు, గోశాలకు ద్రవ్య విరాళాలకు బదులుగా తాజా గడ్డిని అందించాలని కోరుతున్నారు.