భక్తుల మొక్కులపై ‘‘శ్రద్ధే’’ లేదు... కోడెల మృతితో భక్తుల్లో ఆగ్రహం

VSK Telangana    04-Jun-2025
Total Views |
 
kodeli
 
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలు మృత్యువాత పడుతుండటంపై భక్తుల్లో, హిందువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాతావరణ పరిస్థితులు ఎలా వున్నా.. వాటిని కాపాడాల్సిన బాధ్యత దేవస్థానంపై, అధికారులపై, నాయకులపై ఎక్కువగా వుంది. అయితే.. వేములవాడ రాజన్నకు తాము భక్తితో సమర్పించుకున్న కోడెలు మృత్యువాత పడుతుండటంపై, అధికారుల అలసత్వం, అశ్రద్ధపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు కేవలం వారం వ్యవధిలో 26 కోడెలు మృత్యువాత పడటం గమనార్హం. 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. మే 29న 8 కోడెలు, ఆ తెల్లారే 5 కోడెలు మృత్యువాతపడ్డాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే మరో ఆరు కోడెలు చనిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
 
అయితే.. ఇలా కోడెలు మృత్యువాత పడుతుండటం వెనుక ఓ కారణం వుందన్న విమర్శలు బాగా వస్తున్నాయి. కోడెలను స్తోమతకు, స్థాయికి మించి తిప్పాపూర్ గోశాలలో కుక్కేస్తున్నారన్నది అసలు అంశం. స్థాయికి మించి అందులో కుక్కుతుండటంతో వాటి మధ్య తొక్కిసలాట జరుగుతోందని స్థానికులు బలంగా చెబుతున్నారు. ఆలయ పరిధిలోని తిప్పాపూర్‌ గోశాలలో మొత్తం 13 షెడ్లు ఉన్నాయి. అందులో రెండు షెడ్లను ఇతర పనులకు ఉపయోగిస్తుండగా, 11 షెడ్లలో 60 చొప్పున మొత్తంగా 660 కోడెలను సంరక్షించేందుకు అవకాశం ఉంది. అయితే సామర్థ్యానికి రెండింతలు... 1300 దాకా కోడెలు ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.

kodeli23 
ఇక... లెక్కకు మించి, సామర్థ్యానికి మించి కూడా తిప్పాపూర్ గోశాలలో కోడెలను కుక్కుతున్నారు. మేత కూడా అతి తక్కువ వేస్తున్నారని, సరిపడా ట్రాక్టర్ల పచ్చిగడ్డి వేయడం లేదని కూడా తెలుస్తోంది. అతి తక్కువ మేత పెడుతుండటంతో మేత కోసం కోడెల మధ్య పొట్లాట, తొక్కిసలాట కూడా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. కేవలం ఇవే కారణాలు కాకుండా... వానలు కురుస్తున్న సమయంలో కొన్ని కోడెలు జబ్బుపడుతున్నాయని, షెడ్లు సరిగ్గా లేని కారణంగా కూడా మృత్యువాత పడుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వైద్యుడ్ని అందుబాటులో వుంచి, కోడెల బాగోగులు చూసుకుంటే ఎలాంటి ఇబ్బందీ వుండదని అంటున్నారు.
 
అంతేకాకుండా మరో విమర్శ కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తోందని, స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్సే కావడంతో గోమాతలను సరిగ్గా పట్టించుకోవట్లేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పాలనలో దేవాలయాల పట్ల, హిందూ విశ్వాసాల పట్ల, గోమాతల పట్ల తీవ్ర అలసత్వం, పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, అందుకే వేములవాడలో ఇలా జరుగుతోందన్న విమర్శలు కూడా బలంగా వున్నాయి. అయితే ఈ ఘటన తర్వాత కోడెల మృతిపై సమీక్ష చేశామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. మరోసారి పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తెలిపారు.
 
ఏ తేదీలలో ఎన్ని కోడెలు చనిపోయాయంటే...

25.05.25 - 3 కోడెలు
26.05.25 - 4 కోడెలు
28.05.25 - 6 కోడెలు
29.05.25 - 5 కోడెలు
30.05.25 - 11 కోడెలు
01.05.25 - 3 కోడెలు
 
గత యేడాదిలోనూ రచ్చ లేపిన కోడెల వ్యవహారం...
 
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులిస్తున్న కోడెలు కోతకు పోతున్నాయన్న విమర్శలూ వచ్చాయి. వాటిని రైతులకు సంరక్షణ నిమిత్తం రెండు చొప్పున మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. కానీ... కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కోతకు పోతున్నట్లు తేలింది. ఓ వ్యాపారి ఏకంగా ఆలయం నుంచి 60 కోడెలను తీసుకెళ్లాడన్న విమర్శలూ బయటికి వచ్చాయి. అంతేకాకుండా వాటిని అమ్ముకున్నట్లు కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని వార్తలొచ్చాయి.
 
అలాగే మరో ఘటన కూడా జరిగింది. గత యేడాది డిసెంబర్ మాసంలో వెలుగులోకి వచ్చింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెలను కబేళాలకు అమ్ముకున్న ఘటన కూడా జరిగింది. దీంతో వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు విచారణ కూడా జరిపారు. గీసుకొండ మండలంలో కొందరు కోడెలను కబేళాలకు అమ్ముకున్నారని కూడా తేలింది. దీంతో కేసు కూడా నమోదైంది. మనుగొండలో అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి, కోడెలు వున్నాయా? లేవా? అని విచారించగా... 18 కోడెలను తీసుకొస్తే.. ఒక్కటీ కనిపించలేదని అధికారులు తెలిపారు. సంబంధీకులకు ఫోన్లు చేస్తే.. అవి స్విచ్చాఫ్ అని కూడా వచ్చాయి. ఇలా దాదాపు 38 నుంచి 40 కోడెలను సంరక్షణ పేరిట తేగా... ఒక్కటీ అధికారులకు కనిపించలేదు. ఇదే విషయంపై సంబంధిత రైతులను అడగ్గా.. కొందరు తమ ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు అడిగితే.. ఇచ్చామని, అసలు ఏం జరిగిందో తమకు తెలియదని తెలిపారు.

kodeli2 
 
అసలు కోడెలను సమర్పించే సంప్రదాయం ఎలా వచ్చింది?
 
దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు కోడెలు సమర్పించుకుంటారు. ఈ సంప్రదాయం ఇక్కడ మాత్రమే వుంది. అయితే ఇక్కడ కుటుంబ సమేతంగా భక్తులు,నూతన వధూవరులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు..స్థల పురాణం కూడా చెబుతోంది.కోడెలను రాజన్నకి సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం. భక్తులు కోడెలను తీసుకొచ్చి, గుడిచుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత గుడి ప్రాంగణంలోనే కట్టేస్తారు. ఇలా చేయడం ద్వారా దేవాలయానికి దక్షిణగా సమర్పించినట్లు లెక్క. దీనివల్ల సంతానం కూడా కలుగుతుందని నమ్మకం.