అయోధ్య ప్రసాదం పేరిట సైబర్ ఫ్రాడ్

VSK Telangana    09-Jun-2025
Total Views |
 
Ayodhya
 

అయోధ్యలో కొలువుదీరిన బాల రామయ్యని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే భక్తుల విశ్వాసాన్ని అలుసుగా తీసుకుని బాల రామయ్య ప్రసాదం పేరుతో రూ.3.85 కోట్ల మేర మోసం చేశాడు. అవును ఆన్‌లైన్ లో ప్రసాద పంపిణీ అంటూ ప్రసాద కుంభకోణం జరిగింది. నిందితుడు ఆశిష్ వెబ్‌సైట్ , చెల్లింపు గేట్‌వేను సృష్టించి భక్తులను మోసం చేశాడు. అయోధ్య పోలీసులు నిందితులను అరెస్టు చేసి రూ.2.15 కోట్లు స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి ఇచ్చారు.

జనవరి 2024లో రామ జన్మ భూమి అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ శుభ సందర్భంగా అయోధ్య నగరం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. అటువంటి ఈ పవిత్ర వాతావరణంలో.. పవిత్రమైన కార్యక్రమం జరుగుతున్న వేళ ఒక మోసపూరిత మనస్సు భక్తుల విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకుంది. సమాచారం ప్రకారం నిందితుడు ఆన్‌లైన్ ఏజెన్సీ ద్వారా రామాలయ ప్రసాద పంపిణీ పేరుతో 6 లక్షల 30 వేలకు పైగా భక్తులను మోసం చేశాడు. ఈ మోసం కేవలం రూ.51లతో ప్రారంభమై 3 కోట్ల 85 లక్షల రూపాయలతో ముగిసింది.

నిందితుడి పేరు ఆశిష్. అతను సోషల్ మీడియా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా వెబ్‌సైట్, చెల్లింపు గేట్‌వేను సృష్టించి బాల రామయ్య ప్రసాదాన్ని భక్తుల ఇళ్లకు అందజేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో భక్తులు ప్రసాదం కోసం భక్తితో డబ్బు పంపారు. అయితే ఎవరికీ ప్రసాదం అందలేదు. ఈ విషయంపై అయోధ్య సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసు బృందం వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది.

అప్పటి అయోధ్య సైబర్ పోలీస్ స్టేషన్ హెడ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ గౌరవ్ గ్రోవర్ నేతృత్వంలో.. పోలీసుల బృందం సమగ్ర దర్యాప్తు నిర్వహించింది. నిందితుడు ఆశిష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతేకాదు అయోధ్య పోలీసులు రూ.3 కోట్ల 85 లక్షలలో రూ.2 కోట్ల 15 లక్షలను ఆశిష్ ఖాతాలను స్తంభింపజేసి స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఖాతాలకు తిరిగి ఇచ్చారు. మిగిలిన రూ.1 కోటి 70 లక్షల రికవరీ ప్రక్రియ కొనసాగుతోందని.. అది కూడా త్వరలో తిరిగి తెస్తామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులకు గొప్ప విజయం
ఇది అయోధ్య పోలీసులకు పెద్ద విజయం మాత్రమే కాదు.. దేశ సైబర్ మోస చరిత్రలో అతిపెద్ద రికవరీలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సంఘటన ప్రజలకు ఒక గుణ పాఠం కూడా నేర్పుతుంది. దేవుడి మీద విశ్వాసం పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పథకం, అది దేవుని పేరుతో అయినా లేదా మతపరమైన ప్రదేశాలకు సంబంధించినదైనాఅ.. ముందు అది నిజమో కాదో అని తనిఖీ చేసి, నిర్ధారించుకుని ఆపై డబ్బు పంపాలని తెలియజేస్తుంది.

పోలీసులపై ప్రశంసల వర్షం
మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి సైబర్ సమస్యలను ఎదుర్కొంటే.. వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930ని సంప్రదించండి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. బాల రామయ్య పేరుతో ఇది అతిపెద్ద ఆన్‌లైన్ మోసం. అయితే అయోధ్య పోలీసులు చూపిన తెలివి తేటలు, అప్రమత్తత, దైర్యం నిజంగా రామరాజ్యంలోని శాంతిభద్రతలకు ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.