
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ఆజన్మాంతం సంపూర్ణ స్వయంసేవకత్వంతో జీవించిన ఆదర్శ స్వయంసేవక్ యెల్లెంకి హన్మంతరావు సోమవారం (09 జూన్ 2025) ఉదయం పరమాత్మలో లీనమైనారు. తుదిశ్వాస వరకు సంఘ కార్యంలోనే జీవితం గడిపిన జ్యేష్ట స్వయంసేవక్ ఆయిన హన్మంతరావు గారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రంగా సింగరేణి కంపెనీలో ఆఫీసర్ ఉద్యోగం చేశారు. సుదీర్ఘకాలం పెద్దపల్లి ఖండ కార్యవాహగా ఎంతోమంది కార్యకర్తలను తీర్చి దిద్దారు.
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా కాంగ్రెస్ సర్కారు దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు తమ ధర్మపత్ని చంకలో చంటి పాప ఉన్న క్లిష్ట సమయంలో హన్మంతరావు జైల్లో ఉన్నారు. భర్త ఆదర్శాలకు ఆ ఇల్లాలు సంపూర్ణ సహకారం అందించింది. భార్య భర్తలిద్దరూ అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. ఆ ఇల్లు ప్రచారకులకు, గృహస్థులైన పర్యటనా కార్యకర్తలందరికీ స్వంత ఇంట్లో ఉన్నట్లు అనిపించేది. ఆ ఇల్లాలు ఒక అన్నపూర్ణ. హన్మంతరావు గారు తదనంతర కాలంలో జిల్లా కార్యవాహగా విభాగ్ సంపర్క ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రాంత సహకార భారతి సంస్థకు ప్రారంభ దశలో ప్రాంత స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఆ సంస్థకు గట్టి పునాదులు వేయడంలో తనవంతు పాత్ర పోషించారు. కరినగర్ మాధవ సేవా సమితి (సంఘ్ కార్యాలయం ట్రస్ట్)కి అధ్యక్షుడిగా సేవలు కొనసాగించారు. గోదావరిఖనిలో శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించి సుదీర్ఘ కాలం కార్యదర్శిగా ఆ ట్రస్ట్ ద్వారా వృత్తి విద్యా జూనియర్ కళాశాల నడిపించి ఎంతోమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
తాను గృహస్తు ఐనందున సంఘ్ ప్రచారక్‌గా పనిచేసే అవకాశం లభించలేదని హనుమంతరావు గారు భావించి ఐదు సంవత్సరాలు ముందుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆనాటి నుండి తుది శ్వాస వరకు సంఘ్ పనిలోనే జీవితం గడిపిన ఆదర్శవంతులు యెల్లెంకి హన్మంతరావు గారు. ఆయన దివంగత ఆత్మకు సంఘ్ కార్యకర్తలు, బంధుమిత్రులు, ఆత్మీయులు హృదయ పూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.