హింసను విడిచిపెట్టి, ప్రధాన స్రవంతిలో కలవండి : నక్సలైట్లకు ABVP పిలుపు

VSK Telangana    09-Jun-2025
Total Views |
 
abvp
 
అర్బన్ నక్సల్స్... మానవ హక్కులు అంటూ నిత్యం వల్లె వేసే నక్సలైట్లకు మరో రూపం. నిత్యం యువకులను, యువతులను రెచ్చగొడుతూ నక్సలిజం వైపు మళ్లిస్తుంటారు. యువకులను, యువతులను అడవుల బాట పట్టించి, తమ సంతానాన్ని మాత్రం హాయిగా, దర్జాగా అమెరికాతో పాటు ఇతర దేశాలకు పంపిస్తుంటారు. సరిగ్గా.. ఇదే విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమాజానికి చెబుతూ... అసలు విషయాన్ని ప్రజలకు చెబుతోంది.
 
‘‘మీరు మీ పిల్లలను విదేశాలకు పంపుతారు. కానీ.. మా పిల్లలను అడవులకు పంపుతారా?’’ అంటూ ఏబీవీపీ సూటిగా నిలదీస్తోంది. ఇప్పుడు ఏబీవీపీ చేస్తున్న ఈ క్యాంపెన్ చారిత్రాత్మకంగా నిలిచిపోతోంది. ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, వరంగల్ ఆర్.ఈ.సీ. వంటివి ఒకప్పుడు నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా కొనసాగేవి. మరో రకంగా చెప్పాలంటే ఈ కేంద్రంగానే నక్సలైట్లు రిక్రూట్ మెంట్ కూడా చేసేవారని చెబుతారు.
 
అంతేకాకుండా మావోయిస్టు ఉద్యమంలో అగ్రభాగం అంతా తెలుగు వారే. పూర్వ ఆంధ్రప్రదేశ్ నుంచే చాలా మంది అడవుల్లోకి వెళ్లారు. వీరిలో చాలా మంది విద్యార్థి నాయకులే. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు కూడా. అయితే.. యువతను కాపాడే క్రమంలో, సైద్ధాంతిక పోరాటంలో, నక్సలైట్లతో జరిగిన ఘర్షణల్లో విద్యార్థి పరిషత్ తన కార్యకర్తలను కూడా కోల్పోయింది. అయినా.. వీరోచిత పోరాటమే తమ మార్గమని ప్రకటించింది.
 
ప్రస్తుతం నక్సలిజం దేశంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఏబీవీపీ తెలంగాణ యూనిట్ ఓ ప్రచారాన్ని చేస్తోంది. నక్సలైట్లు హింసను విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా నక్సలైట్లు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ.. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ సమావేశం లాగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ... ‘‘అధికారం కేవలం తుపాకీ గొట్టం నుండే వస్తుందనే తప్పుడు నమ్మకంతో నక్సలైట్లు అమాయక విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు మరియు వారి కుటుంబాలకు తీవ్ర బాధను మిగులుస్తున్నారు’’ అని అన్నారు.
 
దేశవ్యాప్తంగా దాదాపు 14,000 మంది అమాయకులు నక్సలైట్ హింసకు బలి అయ్యారని నొక్కి చెప్పారు. అలాగే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ.. అర్బన్ నక్సల్స్ విద్యావేత్తల ముసుగు వేసుకుంటున్నారని మండిపడ్డారు.పన్ను చెల్లించే వారి నుంచి నిధులు పొందుతూ... సమాజాన్నే అణగదొక్కుతున్నారన్నారు. అర్బన్ నక్సల్స్ తమ సొంత పిల్లలను విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపుతూ, అమాయకులను మాత్రం అడవుల్లోకి పంపుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
హనుమకొండలో ఏబీవీపీ ర్యాలీ...
 
నక్సలైట్ల హింసను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ హనుమకొండలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా శాంతి ఆవశ్యకతను,నక్సలైట్లు ఆయుధాలను విడిచిపెట్టడాన్ని నొక్కి చెప్పారు. భారత్ నిజమైన స్వాతంత్రాన్ని సాధించలేదని నక్సలైట్లు ప్రచారం చేస్తున్నారని, అలాగే హింస ద్వారానే అధికారాన్ని సంపాదించవచ్చన్న విషయాన్ని కూడా సమర్థిస్తున్నారని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు.నక్సలైట్లు విదేశీ ప్రయోజనాలకు అనుగుణంగా మన దేశ వనరులను దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు ప్రజల ముందు వుంచారు.
 
ఇక.. ఇలాంటి భావాలతోనే నిజామాబాద్, మేడ్చల్ లో కూడా ఏబీవీపీ ర్యాలీలు చేసింది. అర్బన్ నక్సలైట్లు విద్యార్థినీ విద్యార్థులను మోసగించే వైనం, వారి భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేస్తున్నారో సవివరంగా వివరించారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.