ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో రామలల్లా ప్రతిష్టితమైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 5.5 కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శించారు. సామాన్య భక్తులు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా అనేకమంది వీఐపీలు రాముడి దర్శానార్థం వచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందుకోసం తగిన ఏర్పాట్లు చేసి, అవన్నీ సజావుగా సాగేలా.. భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండేలా సూచనలు జారీ చేశారు. అద్భుతమైన ఆలయం నిర్మాణం జరగడంతో ఇది ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతంది. చాలామంది అయోధ్యలో రాముడిని చూడాలని వస్తున్నారు. అందుకోసం మరింత సౌకర్యవంతంగా, ప్రజారవాణాను కూడా మెరుగు పరచడానికి యూపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇప్పుడు రాముడు ఆలయంలోని మొదటి అంతస్తులోని రామ్ దర్బార్‌లో ఆసీనుడై ఉన్నాడు కాబట్టి, రాబోయే రోజుల్లో సందర్శకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. కేవలం వీఐపీ, సాధారణ భక్తులు అనే తేడా లేకుండా అందరికీ కూడా సజావుగా దర్శనం అయ్యేలా అయోధ్యలో దర్శనాన్ని రూపొందించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ పాస్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. పెరుగుతున్న VIP సందర్శకుల సంఖ్య , ఉన్నత స్థాయి భద్రత అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, యోగి ప్రభుత్వం అయోధ్యలో అత్యాధునిక VIP అతిథి గృహాన్నికూడా నిర్మిస్తోంది.