ఎవ్వరైనా ఏ కులవృత్తినైనా చేపట్టవచ్చంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ వృత్తులను ఇతర కులస్తులే కాకుండా ఏకంగా ఇతర మతస్తులు సైతం చేపట్టారని, తమ పరిస్థితి ఏం కావాలని, ధర్మం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. సాటి హిందూ సమాజం నుంచి సైతం మద్దతు రాని పరిస్థితి ఉందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణులు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలో వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగే తమ పరిధిలోకి వచ్చే ఏ కార్యక్రమానికి కూడా తాము హజరవ్వమని, తమ సేవలను అందించమని వికారాబాద్ జిల్లా నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. ఏ కులవృత్తినైనా ఎవరైనా చేసుకోవచ్చునని, తాము హైకోర్టు తీర్పుని గౌరవిస్తామని ప్రకటించారు. అయితే.. వారం రోజుల పాటు మాత్రం తమ విధులను బహిష్కరిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ జేఏసీ ప్రకటించింది.
తాము ఎవరి ఇంటికీ వెళ్లి, పురుడు చేయమని, ఎవరి ఇంటికి వెళ్లి పుట్టు వెంట్రుకలు తీయమని, జిల్లాలో ఏ శ్మశాన వాటికకి వెళ్లి, గుండు తీయమని, మైల ప్రోలు వ్రాయమని ప్రకటించారు. అలాగే ఎవరి ఇంట్లోనూ పుష్పవతి అయినా.. గోర్లు తీయమని, పురుడు చేయమని కూడా ప్రకటించారు. వీటితో పాటు సన్నాయి నాదస్వరము కూడా వాయించమని తేల్చి చెప్పారు.
ఏ పనినైనా ఎవ్వరైనా చేయవచ్చని అంటున్నారు కదా.. వీటిని ఇతర మతాల వారితోనూ చేయించుకోవచ్చంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాదని, తమపై ఒత్తిడి తెచ్చి, తమతో మాత్రం చేయించవద్దని తేల్చి చెప్పారు. వారం లోపు తమకు సరైన న్యాయం జరక్కపోతే మాత్రం మిగతా జిల్లాల్లో కూడా ఈ సేవలను నిలిపేస్తామని హెచ్చరించారు.
కల్యాణ కట్టల్లో పనిచేసే తమను పర్మినెంట్ చేస్తామని ఎన్నో ప్రభుత్వాలు ప్రకటించాయని, కానీ.. తమను మోసమే చేస్తున్నాయి కానీ, పర్మినెంట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూడా తమకు న్యాయం చేయకుంటే కల్యాణ కట్టల్లో కూడా తలనీలాలను తీయమని తేల్చి చెప్పారు. తలనీలాలను కూడా హైందవేతరులే దేవాలయాల్లో ఏర్పాటు చేసి, వారితో చేయించుకుంటారా? వారు బొట్టు పెట్టి తీస్తారా? అంటూ నాయీ బ్రాహ్మణులు నిలదీశారు.