కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఆరెస్సెస్ ను నిషేధిస్తామన్న కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. గతంలోనూ కాంగ్రెస్ సంఘ్ ను నిషేధించాలని ప్రయత్నించిందని, అది కాంగ్రెస్ నే ఇబ్బందుల్లోకి నెట్టేసిందన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సంఘ్ ను నిషేధించడానికి ప్రయత్నించిందని, కానీ ఆమెనే ఇబ్బందుల్లోకి నెట్టేసిందని, అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఆరెస్సెస్ ప్రపంచంలోని అతిపెద్ద జాతీయవాద సంస్థ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇక.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ఏమాత్రం పాఠాలు నేర్చుకోకుండా అవే వ్యాఖ్యలను పునరావృత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఒకప్పుడు సంఘ్ ను నిషేధించాలని చూశారని, అందరూ ఆమె రాజకీయపతనాన్ని చూశామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితిని చూస్తుందని హెచ్చరించారు. క్లిష్టమైన సమయాల్లో సంఘ్ దేశానికి చాలా సేవచేసిందన్నారు. 1971 యుద్ధంలో, వరదల సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో ముందుండేది స్వయంసేవకులేనని గిరిరాజ్ సింగ్ గుర్తు చేశారు.
బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి కూడా తీవ్రంగా స్పందించారు. ప్రియాంక్ ఖర్గే ఓ మూర్ఖుడు అని మండిపడ్డారు. ఆయన బాధ్యతారహితుడని విమర్శించారు.ఆరెస్సెస్ అత్యంత క్రమశిక్షణ కలిగిన సంస్థ అని, త్యాగానికి ప్రతీక అని అన్నారు.భారత మాతకు సేవ చేయడానికి మరియు మన సంస్కృతిని, నైతికతను కాపాడటానికి ఆరెస్సెస్ కార్యకర్తలు తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తారన్నారు.కాంగ్రెస్ పదే పదే సంఘ్ ను విమర్శించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.