ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు

VSK Telangana    03-Jul-2025
Total Views |
 
mali
 
మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్న ఉగ్రవాదులే కిడ్నాప్ చేసింది. సిమెంటు ఫ్యాక్టరీపై దుండగులు దాడి చేసిన తర్వాతే... ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ను భారత విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది.
 
మాలిలోని కాయెస్ ప్రాంతంలోని డైమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఈ నెల ఒకటో తేదీన సాయుధ దుండగులు దాడి చేసి, అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. ఇలా బందీలుగా తీసుకెళ్లిన వారిలో ముగ్గురు భారతీయులు కూడా వున్నారు. అయితే భారతీయులను కిడ్నాప్ చేసింది తామేనని అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ (JNIM) ప్రకటించింది.
 
మరోవైపు ఈ కిడ్నాప్ పై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దీనిని ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారుల్ని, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.
 
మరోవైపు బందీలను సురక్షితంగా, త్వరగా విడుదలచేయడానికి మాలీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. అక్కడి భారత పౌరులందరూ అలర్ట్ గా వుండాలని కూడా సూచించింది. ఏదైనా సాయం కావాలంటే స్థానికంగా వుండే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.