ప్రముఖ ట్రావెలర్, యూట్యూబర్ పరమ్ వీర్ కజకిస్తాన్ లో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నాడు.పరమ్ వీర్ తన స్నేహితునితో కలిసి కజకిస్తాన్ లోని సందర్శనా స్థలాలను సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ‘‘నీవు హిందువా’’ అంటూ తనను అడిగి, జాత్యహంకారాన్ని చూపించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు 55 నిమిషాల పాటు ఈ వీడియో వుంది.
కోల్సే, కైండి, చారిన్ కాన్యన్ వంటి ప్రదేశాలను సందర్శించిన వీడియోలు కూడా అందులో పొందుపరిచాడు. ఈ వీడియోలోనే కైండీ సరస్సు సమీపంలో జరిగిన ఘటనను పరమ్ వీర్ వివరించాడు. జాత్యహంకార ఘటన ఈ ప్రాంతంలోనే జరిగిందని తెలిపాడు.
యూట్యూబర్ పరమ్ వీర్ చెప్పిన దాని ప్రకారం ‘‘కైండీ సరస్సుకి నేను, నా స్నేహితుడు వెళ్లాం. ఈ సమయంలో అక్కడే వున్నఓ స్థానిక ఫొటోగ్రాఫర్ ని కలిశాం. అతడు పర్యాటకుల ఫొటోలు తీసి, ప్రింటులు తీసి, అమ్ముతుంటాడు. ఈ సమయంలో కడ, కాలవ ధరించి వున్నాను. దీనిని ఆ ఫొటోగ్రాఫర్ గమనించాడు. మీరు ముస్లిం కదా అని అడిగాడు. అయితే నా స్నేహితుడు శక్తి కాదు... నేను హిందువును అని సమాధానం ఇచ్చాడు. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ అవమానకరమైన హావభావాలు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు.దీంతో మా స్నేహితుడు శక్తికి కోపం వచ్చింది. గొడవ మరింత తీవ్రం కాకూడదని నిర్ణయించుకొని, వెళ్లిపోయాం’’ అని పరమ్ వీర్ వివరించాడు.
మరోవైపు ఈ ఘటనతో పాటు కొన్ని రోజుల క్రితమే జరిగిన మరో సంఘటనను కూడా పరమ్ వీర్ గుర్తు చేసుకున్నాడు.‘‘వారం రోజులుగా కజకిస్తాన్ లోనే పర్యటిస్తున్నా. భారతీయుల పట్ల ముఖ్యంగా హిందువుల పట్ల ఇక్కడ వివక్షత వుందని గ్రహించా. నేను 120 దేశాలు తిరిగాను, ఎక్కడా ఇలాంటి వర్ణ వివక్షను చూడలేదు. కొన్ని రోజుల క్రితం రష్యాలో పర్యటించాం. ట్యాక్సీ ఎలా అని అడిగాం. మాకు రష్యన్ అర్థం కాలేదు. అయినా.. రష్యన్ ప్రయాణికుడు అన్నీ అనువదించి, చక్కగా మాకు సహకరించాడు. కానీ కజకిస్తాన్ లో పరిస్థితి వేరు’’ అని పరమ్ వీర్ వివరించాడు.