కేరళ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసిన వీసీ

VSK Telangana    03-Jul-2025
Total Views |
 
KL
 
కేరళ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అనిల్ కుమార్ ను వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ సస్పెండ్ చేశారు. భారత మాత చిత్రపటాన్ని రాజకీయంగా వివాదంగా మార్చడానికి ప్రయత్నించడంలో దేశ వ్యతిరేక ఎజెండాతో గొంతు కలిపినందుకు ఈ పరిణామం జరిగింది. సీపీఎం దాని అనుబంధ విభాగాలు తమ పంతం నెరవేర్చుకోవడానికి, భారతమాతను అవమానపరచడానికి అనిల్ కుమార్ ను ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలూ వున్నాయి. అనిల్ కుమార్ కూడా కాస్త అదే రీతిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా యూనివర్శిటీ సెనేట్ హాలులో ఓ కార్యక్రమం జరగాల్సి వుంది. దీనికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కానీ.. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే విషయంలో రిజిస్ట్రార్ కొందరి ఒత్తిళ్లకు తీవ్రంగా తలొగ్గి, చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. దీనిపై కొన్ని రోజుల క్రిందటే వీసీ సీరియస్ అయ్యారు. రిజిస్ట్రార్ సస్పెండ్ కావడానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు.
 
రిజిస్ట్రార్ అనిల్ కుమార్ గవర్నర్ ను అగౌరవపరిచారని, ప్రొటోకాల్ ను కూడా ఉల్లంఘించారని అంతర్గతంగా వేసిన దర్యాప్తులో తేటతెల్లమైంది. ఈ రిపోర్టు ఆధారంగానే వీసీ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు.
శ్రీ పద్మనాభ సేవా సమితి ఎమర్జెన్సీపై సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 26 షరతులు విధించి, రిజిస్ట్రార్ నుంచి అనుమతి లభించింది. హాలు లోపల మతపరమైన చిహ్నాలు, ఆచారాలు పాటించవద్దన్నది అందులోని ఓ నిబంధన. అయినా సరే నిర్వాహకులు ఆ హాలులో భారత మాత చిత్రపటంతో పాటు హాలును పూల దండలతో అలంకరించారు. కొందరు జాతీయవాద వ్యతిరేకులు దీనిని పెద్దగా చేసి, రాజకీయ ప్రతీకగా చిత్రీకరించారు.
 
ఇది కాస్తా సీపీఎం, కాంగ్రెస్ నేతల దృష్టికి వెళ్లింది. దీంతో రిజిస్ట్రార్ మాధ్యమంగా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో రిజిస్ట్రార్ కూడా వామపక్ష, కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బెదిరింపులకు దిగారు. భారత మాత చిత్రపటాన్ని తొలగించాలని, లేదంటే కార్యక్రమాన్నే రద్దు చేస్తామని హెచ్చరించారు.అయితే.. వామపక్ష అనుకూల విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే వున్నాయి.
 
 
ఇంతలోనే గవర్నర్ అర్లేకర్ పోలీసుల రక్షణతో వేదిక దగ్గరికి వచ్చారు. కాషాయ ధ్వజం పట్టుకున్న భారత మాత చిత్రపటం ముందు దీపం వెలిగించి, పుష్పాలు సమర్పించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తూనే వున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత వీసీ నుంచి గవర్నర్ కార్యాలయం వివరణ కోరింది. దీంతో వీసీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ను వివరణ కోరారు. ఆయనిచ్చిన వివరణతో వీసీ తృప్తి పడలేదు. చివరికి సస్పెండ్ చేశారు.