ప్రవీణ్ నెట్టారు హత్య : కీలక నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్

VSK Telangana    05-Jul-2025
Total Views |
 
nettaruy
 
బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, జాతీయవాది ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో మరో నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. జూలై 4 న ఖతార్ నుంచి కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అబ్దుల్ రెహ్మాన్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
 
ప్రవీణ్ నెట్టారు హత్యకి సంబంధమున్న ఇతర నిందితులను అరెస్ట్ చేసినప్పటి నుంచీ రెహ్మాన్ పరారీలోనే వున్నాడు. విదేశాల్లోనే వుంటున్నాడు. అంతేకాకుండా ఇతడి ఆచూకీ చెబితే నగదు బహుమతి కూడా ఇస్తామని ఎన్ఐఏ గతంలోనే ప్రకటించింది. ఈ హత్యతో సంబంధమున్న అందర్నీ అరెస్ట్ చేయాల్సిందేనని కర్నాటక అంతటా విస్తృతమైన నిరసనలు రేగాయి. దీంతో తప్పించుకొని, రెహ్మాన్ విదేశాలకు పారిపోయాడు.
అయితే.. విదేశాలకి పారిపోయిన రెహ్మాన్ కదలికలను మన ఎన్ఐఏ అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే వుంది. దీంతో ఎయిర్ పోర్టుల్ దిగగానే అదుపులోకి తీసుకునే విషయంలో ఎన్ఐఏ విజయం సాధించింది. అలాగే వివిధ ఏజెన్సీలతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంది.
 
ఈ అరెస్ట్ తో అరెస్టైన వారి సంఖ్య 28 కి చేరింది...
 
తాజాగా అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ తో ఈ కేసుతో సంబంధమున్న నిందితుల అరెస్ట్ సంఖ్య 28 కి చేరింది. దీనిపై ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేసిందనే చెప్పాలి. వీరందరు కూడా ప్రవీణ్ హత్య కేసులో ఏదో ఒకరకంగా లింక్ అయ్యే వున్నారని అధికారులు అంటున్నారు. అయితే.. తాజాగా అరెస్టైన అబ్దుల్ రెహ్మాన్ పీఎఫ్ఐ సూచనల ప్రకారమే హత్య చేసినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్ లో పొందుపరిచింది.
 
2022 లో ప్రవీణ్ నెట్టారు దారుణ హత్య
 
దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రవీణ్‌ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. ప్రవీణ్‌ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు.
 
రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు. మారణాయుధాలు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పుత్తూరు రోడ్డువైపు పారిపోతుండటం తాను చూశానని ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి మధుకుమార్ రయన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం.. రక్తపు మడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్‌ను పుత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రవీణ్‌ మృతిచెందాడు.