డీఎంకే మంత్రులకు హిందూ ధర్మాన్ని, హిందువులను అవమానించడం పరిపాటిగా మారిపోయింది. ఇతర మతాలు, ధర్మాల జోలికి వెళ్లరు కానీ.. సైద్ధాంతిక విమర్శ అంటూ ఓ పదాన్ని జోడించి, కేవలం హిందువులనే అవమానపరుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
తమిళనాడు మంత్రి ఇ.వి. వేలు సంస్కృత భాషను తీవ్రంగా అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాషకి ఆర్థిక సహాయం చేయడాన్ని విమర్శిస్తూ.. సంస్కృత భాషను అపహాస్యం చేశారు.
వెల్లూరు వేదికగా జరిగిన ఓ బహిరంగ సభలో మంత్రి వేలు మట్లాడుతూ.. హిందూ వివాహ ఆచారాలు, సంప్రదాయాల సమయంలో సాధారణంగా సంస్కృత శ్లోకాలను పఠిస్తారని, అవి ఎవరికి అర్థమవుతాయంటూ వ్యంగ్యాంగా అన్నారు. అసలు అందులో వున్న ఔచిత్యం ఎవరికైనా తెలుస్తుందా? అంటూ అపహాస్యం చేశారు.
‘‘జీఎస్టీ ద్వారా మన డబ్బును తీసుకొని, దానిని సంస్కృత భాషాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా సంస్కృతం అర్థమవుతుందా? తమిళంలో ఐ లవ్ యూ అని చెప్పగలం. వివాహ వేడుకల సమయంలో కూడా అర్చకులు మంత్రాలు చదువుతారు. అవి సంస్కృతంలో వుంటాయి. ఎవరికి అర్థమవుతాయి? ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను సంస్కృతంలో ప్రకటించగలరా? కానీ తమిళంలో మాత్రం ఆ పని చేయగలరు.తమిళం విస్తృతంగా మాట్లాడే భాష.శక్తిమంతమైన భాష. సజీవ భాష’’ అంటూ సంస్కృతంపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాషాభివృద్ధికి 2,500 కోట్ల రూపాయలను కేటాయించిందని, అదే తమిళ భాషాభివృద్ధికి 167 కోట్లు మాత్రమేనని విమర్శించారు. ఎవరికీ అర్థం కాని భాషకి 2,500 కోట్లు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
మంత్రి పొన్ముడి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు..
ఏప్రిల్ మాసంలో మంత్రి పొన్ముడి కూడా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో మహిళలు వున్నారన్న స్పృహలో కూడా లేకుండా.. హిందూ ధర్మానని కించపరిచారు. సభలో మాట్లాడుతూ హిందువులు ధరించే తిలకాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. తిలకాన్ని లైంగిక భంగిమలతో పోలుస్తూ.. హిందూ ధర్మాన్ని తీవ్రంగా కించపరిచారు.
''మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్ ఉంటుందని ఆమె వివరించింది’ అని జోక్ వేశారు.
బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం వద్దు : ఏ రాజా
డీఎంకే సీనియర్ నేత ఏ. రాజా కూడా ఏప్రిల్ మాసంలో హిందూ ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీలగిరి జిల్లాకి చెందిన కార్యకర్తల సమావేశంలో రాజా మాట్లాడుతూ..కుంకుమ బొట్టు పెట్టుకోవద్దు అని, చేతికి కంకణం కట్టుకోవద్దు అని పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీ ధోతీ కట్టుకున్న సమయంలో.. బొట్టు, కంకణం ధరించవద్దు అన్నారు. ఒకవేళ అలా గెటప్‌లో ఉంటే, అన్నాడీఎంకే తరహాలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
దేవుడి నమ్మకాలకు తానేమీ వ్యతిరేకం కాదు అని, పేద ప్రజల చిరునవ్వులోనే దేవుడు ఉన్నాడని తమ పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పేర్కొన్న విషయాన్ని మరిచిపోలేమని, కానీ కుంకుమ బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుంటే ఆర్ఎస్ఎస్ సభ్యుల్లా ఉంటామని, సంఘీ కార్యకర్తలతో తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుందని డీఎంకే నేత ఏ రాజా పేర్కొన్నారు. కనీసం స్టూడెంట్ వింగ్‌కు చెందిన కార్యకర్తలు బొట్టు పెట్టుకోవద్దు అని తెలిపారు.
హిందూ ధర్మం ఓ వ్యాధి లాంటిది : ఉదయనిధి
ఇక... సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ ధర్మాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.సనాతన ధర్మం వ్యాధి లాంటిదని, దానిని నిర్మూలించాలన్నారు. అలాగే సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నాడు. కొన్నింటిని మనం కేవలం వ్యతిరేకించి ఊరుకోకూడదు.. వాటిని మనం నిర్మూలించాలి.. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు.. నిర్మూలించాలి.. అలానే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని వ్యాఖ్యానించారు.