ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC) కీలక విషయాన్ని వెల్లడించింది. ఐదో ‘‘శ్రీరామాయణ యాత్ర’’ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జులై 25 నుంచి ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు ఈ రైలు యాత్రలో రాముడితో సంబంధమున్న 30 ప్రదేశాలను చూపిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతామఢి, జానక్ పుర్, బక్సర్, వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్, నాసిక్, హంపితో పాటు మరికొన్ని క్షేత్రాల మీదుగా రామేశ్వరం చేరడంతో ముగుస్తుంది.
యాత్ర ప్యాకేజీ ఒక్కొక్కరికి థర్డ్ ఏసీ 1.17 లక్షలు, సెకండ్ ఏసీ 1,40,120, ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ 1,66,380, ఫస్ట్ ఏసీ కూపె 1,79,515, రూపాయలు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. త్రీ స్టార్ హోటళ్లలో భోజనం, వసతితో పాటు ప్రయాణ బీమా వంటి సదుపాయాలు కూడా వుంటాయి.
గత సంవత్సరం జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఐఆర్‌సీటీసీ రామాయణ రైలు యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది 5వ రామాయణ పర్యటన. మునుపటి అన్ని పర్యటనల్లోనూ యాత్రికుల నుంచి ఈ ప్యాకేజీకి అద్భుతమైన స్పందన లభించింది. రెస్టారెంట్, కిచెన్, షవర్, సెన్సార్ వాష్‌రూమ్‌లు, CCTV భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు ఈ యాత్రను నిర్వహిస్తుంది.
యాత్రలో దర్శించే స్థలాల వివరాలు:
ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య. ఇక్కడ ప్రయాణికులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్)
సందర్శిస్తారు.
దీని తర్వాత నందిగ్రామ్‌లో భారత్ మందిర్.
నేపాల్‌లోని సీతామర్హి, జనక్‌పూర్‌లలో సీతాదేవి జన్మించిన ప్రదేశం, జానకిరాముని ఆలయం.
బక్సర్‌లో రామరేఖ ఘాట్, రామేశ్వరనాథ్ ఆలయం.
వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం, తులసి దేవాలయం, సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం, గంగా ఆరతిని సందర్శిస్తారు.
అనంతరం ప్రయాగ్‌రాజ్, శృంగవేర్‌పూర్, చిత్రకూట్ వంటి ప్రదేశాలను చూసి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఉదయాన్నే నాసిక్ చేరుకుని త్రయంబకేశ్వరాలయం, పంచవటి సందర్శిస్తారు.
హంపిలో ఆంజనేయ కొండ (హనుమంతుడు జన్మించిన ప్రదేశం), విఠల ఆలయం, విరూపాక్ష ఆలయం చూస్తారు.
చివరగా రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, ధనుష్కోడి సందర్శిస్తారు.