భారత్‌లో ఎర్రి విదేశీ భక్తుల వికృత చేష్టలు

VSK Telangana    09-Jul-2025
Total Views |
 
 
 
Rss
 
కేరళ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో డాక్టర్జీ, గురూజీల చిత్రపటాలను ఉంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం విద్యార్థి విభాగాలు ఇటీవల రాజ్ భవన్ ముందు నిరసనకు దిగింది. వారు దేశభక్తులు కారని, జాతీయనాయకులు కారని లేనిపోని వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తోంది అక్కడి అధికార పార్టీ. ఇటీవల కాలంలో మనం గమనిస్తే కేరళలో తరచూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొన్న భారతమాతపైన ఇప్పుడు డాక్టర్జీ గురూజీలపై వారు లేనిపోని రీతిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ దేశం కోసం డాక్టర్ జీ, గురూజీ ఎంత తపించారో... ఎన్ని త్యాగాలు చేశారో... స్వయంసేవకులుగా దేశం కోసం భావి తరాలను ఎంతగా తీర్చిదిద్దారో ముందుగా తెలుసుకోవాలి.
ఈ దేశ పునర్వైభవ స్థితికోసం అందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను డాక్టర్ హెడ్గేవార్ స్థాపించారు. జీవితమంతా బ్రహ్మచారిగా వుంటూ, ఆ కాలంలోనే డాక్టర్ అయినా.. తన వ్యక్తిగత జీవితం కోసం అస్సలు ఆలోచించకుండా, తన సర్వస్వాన్నీ సమాజం కోసమే అర్పణ చేసిన మహా పురుషుడు డాక్టర్జీ. డాక్టర్జీ పార్థివ శరీరానికి (చనిపోయిన తర్వాత) మాత్రమే పూలమాల వేయగలిగాం’ అన్నారు సంఘ రెండవ సర్‌సంఘచాలక్‌ శ్రీ గురూజీ. అలా డాక్టర్జీ తన జీవితాంతం కీర్తికి, ప్రచారానికి దూరంగా ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన సమాజం లేకపోతే.. దేశానికి వైభవం చేకూరదని, ఒకవేళ విజయం సాధించినా.. అది మన చేతుల నుంచి వెళ్లిపోతుందని, తిరిగి అనేక బలహీనతలు వచ్చి చేరతాయని ఆయన గ్రహించారు. అందుకే సమాజం జాగృతంగా వుండాలని, సమాజం సంఘటితంగా వుండాలన్న బృహత్తర ఆలోచనతో వారు ఆరెస్సెస్‌ను ప్రారంభించారు.
 
లోకమాన్య తిలక్‌, గాంధీజీ, సావర్కర్‌, నేతాజీ, రాజగురు లాంటి విప్లవ వీరులతో కలిసి డాక్టర్జీ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలోను, 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమ సమయంలోనూ ‘సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వతంత్ర సముపార్జనకై జరిగే ఉద్యమంలో ఒకే నేత నేతృత్వంలో అందరూ తమ, తమ సభల పేర్లు మరచి, కలసి పోరాడాలని, అదే నిజమైన దేశభక్తి అని ప్రకటించారు. గాంధీజీ నేతృత్వంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే డాక్టర్జీ రెండుసార్లు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీజీ మద్యపాన నిషేధం కోరుతూ 2000 కి.మీ. యాత్ర నిర్వహించారు. డాక్టర్జీ, గణవేషధారులైన స్వయంసేవకులు కలిసి వెళ్ళి, యాత్రలో రెండుచోట్ల గాంధీజీకి గౌరవ వందనం చేశారు. డాక్టర్జీ, స్వయంసేవకులు ఉద్యమంలో పాల్గొన్న కారణాన నాగపూర్‌ చుట్టుపక్కల 50% మద్యపాన విక్రయం తగ్గిపోయిందని బ్రిటిషు గజెట్‌ పబ్లికేషన్‌లో ప్రచురితమైంది.
శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోళ్వల్కర్‌) రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ రెండవ సరసంఘచాలకులు. భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు, జాతీయ భావనలు వ్యతిరేకిస్తూ, స్వైర విహారం చేస్తున్న సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయులు వారు. సరసంఘచాలక్‌గా పూజ్య శ్రీ గురూజీ 33 సంవత్సరాల పాటు పనిచేశారు. 66 సార్లు దేశం నలుమూలలా పర్యటన చేశారు. మాతృభూమి పట్ల భక్తిని, శ్రద్ధను జాగృతం చేస్తూ జాతీయ భావనను, జాతి యావత్తులో నింపారు. ఒకవైపు దేశానికి స్వతంత్రం రావడం, మరోవైపు దేశవిభజన – భారతదేశ చరిత్రలో విచిత్రమైన, సన్నివేశం, అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఆనాటి లాహోర్, నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో ఆఖరి నిమిషం వరకు వీరు పర్యటిస్తూ హిందూ సమాజ మనోబలాన్ని కాపాడిన ధీశాలి శ్రీ గురూజీ. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కాశ్మీరు విలీనం సమస్యగా మారింది. 1947 అక్టోబరు 17న పూజ్యశ్రీ గురూజీ శ్రీనగర్‌ వెళ్ళటం, 18న రాజమహల్‌కి వెళ్ళటం, రాజు, రాణి శ్రీ గురూజీని స్వాగతించటం, ప్రశాంత వాతావరణంలో చర్చ జరగడం, శ్రీగురూజీకి వీడ్కోలు చెబుతూ కశ్మీర్‌ రాజు ‘మీ సలహాలను నేను తప్పకుండా యోగ్యమైన రీతిలో ఆలోచిస్తా’ అనడం చకచకా జరిగిపోయాయి. శ్రీ గురూజీ ఢిల్లీకి తిరిగి వచ్చి, సర్దార్‌పటేల్‌‌ని కలసి కాశ్మీరు రాజా వారి సుముఖతను, చర్చా విశేషాలను తెలిపారు. ఆ తర్వాత సర్దార్‌ పటేల్‌ సమర్థవంతమైన ప్రయత్నం వలన కాశ్మీరు భారతదేశంలో విలీనమైంది.
 
 
Bhagvadwaj
 
సంఘాన్ని స్థాపించిననాటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ సమాజాన్ని ఏకం చేయడం, భిన్న మతాలవారు, వర్గాలవారి మధ్య సమైక్యతతో దేశాన్ని బలోపేతం చేయడమన్న లక్ష్యాలతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూనే ఉంది. ఇప్పటితో పోలిస్తే నాటి రోజుల్లో అది ఎంతో కీలకం అనే చెప్పాలి. సంక్షోభ సమయాల్లో దేశ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ గట్టిగా నిలబడింది. విభజన సమయంలో RSS కార్యకర్తలు హిందూ శరణార్థుల పునరావాసానికి చేదోడువాదోడుగా నిలిచారు. నాడు ఇండియాకు కాబోయే రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్… ఆర్ఎస్ఎస్ గురించి 1949లో కీలక వ్యాఖ్యలు చేశారు. RSS ముస్లింలపై హింస, ద్వేషం కలిగిస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని… ముస్లింలు RSS నుండి పరస్పర ప్రేమ, సహకారం అందిపుచ్చుకోవాలన్నారు.
 
 
China war
 
1962లో చైనాపై యుద్ధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చురుగ్గా సహకరించింది. యుద్ధ సమయంలో జాతీయ ఐక్యత దేశభక్తి అవసరాన్ని సంఘ అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. భారత సాయుధ దళాలకు మద్ధతును ప్రోత్సహించడానికి దేశమంతటా ర్యాలీలు చేసింది. ఆ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులను ఈశాన్య సరిహద్దులన్నింటికీ సహాయ సామాగ్రిని ఇచ్చి పంపింది. ఇది నాటి ప్రధాని నెహ్రూని సైతం ఆకట్టుకుంది. అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ పట్ల విమర్శలు చేసిన ఆయన కూడా 1963లో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వయంసేవక్‌లతో కూడిన ఆర్ఎస్ఎస్ బృందాన్ని పరేడ్‌లోకి ఆహ్వానించారు. కానీ ఇప్పుడు సంఘ దేశభక్తిపై విమర్శలు చేస్తున్న సీపీఐ లేదా సీపీఎం పార్టీలు చైనాకు, రష్యాకు తొత్తుల్లా అప్పుడూ ఇప్పుడూ వ్యవహరిస్తున్నాయి. "గర్జించు రష్యా.. గాండ్రించు చైనా" అంటూ మనదేశపు మహనీయులను కాదని, చెగువేరా, హిట్లర్, స్టాలిన్, లెనిన్, మార్క్స్, మావో ఇలా నియంతలను దేశభక్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వారంతా దేశభక్తులా? నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు అంత దేశభక్తి కలిగిన వాళ్లయితే 1962లో భారత్ చైనా యుద్ధంలో చైనాకు మద్దతు ఎలా ఇచ్చాయి? ఆ సమయంలో చాలమంది భారతీయ కమ్యూనిస్టులు ముఖ్యంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రారంభ సంవత్సరాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సైద్ధాంతికంగా పొత్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా పైన చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు భారత ప్రభుత్వ విధానాలను, విమర్శిస్తూ జాతీయ వాదం కన్నా అంతర్జాతీయ వాదానికి ప్రాధాన్యత ఇచ్చాయి. కానీ సంఘ మాత్రం దేశమే ముందు తర్వాతే ఏదైనా అనే స్పూర్తితో అప్పటికీ ఇప్పటికీ నిలబడే ఉంది.
 
 
Lal bahadur shastri
 
ఇక 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి సహాయం చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. శాస్త్రీజీ అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సంఘ రెండవ సరసంఘచాలకులు శ్రీ గురూజీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో సంఘస్వయంసేవకులు రక్తదానం చేసి సైన్యానికి అండగా నిలిచారు. ఆ సమయంలో RSS సేవలను దేశం చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటుందని ఫీల్డ్ మార్షల్ కరియప్ప కీర్తించారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రహస్యంగా పని చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ని తీవ్రంగా విమర్శించిన జయప్రకాష్ నారాయణ్ లాంటి మేధావులు ఆర్‌ఎస్‌ఎస్ ఒక విప్లవాత్మక సంస్థ అని… దేశంలోని మరే ఇతర సంస్థ దాని దగ్గరికి ఎక్కడా రాదని….
 
సమాజాన్ని, ఇక్కడ ఉన్న కులతత్వాన్ని మార్చే సత్తా ఆర్ఎస్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. అలా సంఘం ఇప్పటికీ కూడా డాక్టర్జీ, గురూజీల ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు సాగుతూ దేశాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దేశానికి ఏం కావాలన్న దానిపై నిత్యం శోధన చేస్తూనే ఉంది. సమాజంలోని భిన్నవర్గాలన్నీ కలిసి మెలసి జీవించాలని బలంగా కోరుకుంటోంది. గతంలో ఆర్ఎస్ఎస్‌పై కొందరిలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అవి నేడు పటాపంచలవుతున్నాయ్. అనేకమంది సంఘ్‌తో కలిసి పనించేయడంకోసం ముందుకు వస్తున్నారు. కమ్యూనిస్టులను ఈ దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రోజు రోజుకు కమ్యూనిస్టు సిద్ధాంతంపై విరక్తి చెందుతున్నారు. దీనికి నిదర్శనం దేశంలో ఎన్నికల సమయంలో వాళ్లకు వచ్చిన ఓట్ల శాతం. దీన్ని బట్టి వాళ్ల వెనుక భారతీయ ప్రజలు లేరు అని చెప్పవచ్చు. ఇకనైనా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ విషయాలు తెలుసుకోవాలి. విదేశీ భక్తిని వదిలిపెట్టి స్వదేశంపై భక్తిని పెంచుకోవాలి, వాస్తవ పరిస్థితులను గమనించాలి. లేదంటే కమ్యూనిస్టులు మరింతగా ప్రజాగ్రహానికి గురయ్యే పరిస్థితులు రావచ్చు.
 
సంఘ కార్యం ఇప్పుడు వందేళ్ళకు చేరువైంది. సంఘ కార్యకర్తలైన స్వయంసేవకులు దేశం పట్ల, సమాజం పట్ల కర్తవ్యనిష్టతో ముందుకు సాగుతున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. మన తెలుగు ప్రాంతం విషయానికే వస్తే, 1977 నాటి అతిపెద్ద విపత్తు అయిన దివిసీమ ఉప్పెన సమయంలో డాక్టర్ జీ, గురూజీల ప్రేరణతో స్వయంసేవకులు నాటి బాధితులకు ఎంతో అండగా నిలిచారు. ఆ ఉప్పెన సమయంలో వందలు, వేలుగా వచ్చి పడిన మృతదేహాల మధ్య రోగ భయాన్ని కూడా లెక్కచేయకుండా సేవలందించారు. నాటి ఉపద్రవంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎన్నో విధాల సహాయం అందించి తోడై నిలిచారు. ఆ తర్వాత చెప్పుకుంటే గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం, ఆ రాష్ట్రంలోనే చోటు చేసుకున్న ఎయిరిండియా విమానప్రమాద సమయంలోను, గతేడాది విజయవాడ (బుడమేరు) వరదలప్పుడు, కేరళలో వయనాడ్ కొండ చరియలు విరిగిపడినప్పుడు... 2020-21 సంవత్సరాల్లో కోట్లాదిమందిని కాటేసిన కరోనా పీడిత కాలంలోను... ఇలా ఎక్కడ విపత్తు సంభవించినా బాధితులకు అండగా నిలిచి పునరావాసం కల్పిస్తూ కుటుంబ సభ్యులు, బంధువుల మాదిరిగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, సేవా భారతి వంటి సంఘ్ ప్రేరిత సంస్థల కార్యకర్తలు ముందుంటున్నారు.
ఆపద వేళల్లో సహకారం అందించడంతో పాటుగా మన దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షించి భావితరాలకు ఆ వారసత్వాన్ని అందించడంలోనూ ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు, ఈ సంస్థ ప్రేరణతో ప్రారంభమైన మరెన్నో సంస్థలు ముందున్నాయి. ఇటీవలే మనం ఘనంగా జరుపుకున్న ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్ఫూర్తి ప్రజలందరినీ చైతన్య పరిచింది. మహాకుంభమేళాకు వచ్చే కోట్లాది జనం వల్ల పర్యావరణానికి ముప్పువాటిల్లకుండా ''ఏక్ థాలీ, ఏక్ థైలా''అన్న ఉద్యమాన్ని చేపట్టింది. అంటే ఒక వస్త్ర సంచి, ఒక కంచం (ప్లేట్) అని అర్థం. మహాకుంభమేళాలో భోజనాలు చేయడానికి ఎవరైనా ప్లేట్ అడిగితే... ప్లాస్టిక్ విస్తర్లు కాకుండా.. సమాజం నుంచి సేకరించిన స్టీల్ ప్లేటును ఇచ్చేవారు. అలాగే వస్తువుల కోసం వస్త్రాలతో చేసిన సంచీ ఇచ్చారు. దీంతో ప్లాస్టిక్ వాడకం చాలా తగ్గింది. ఈ ఉద్యమం వల్ల 140 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అలాగే 29,000 టన్నులకు పైగా వ్యర్థాలు తగ్గాయి. ఈ ఉద్యమంలో 14,17,064 స్టీల్ కంచాలు, 13,46,128 బట్ట సంచులు, 2,63,678 స్టీల్ గ్లాసులు అందుబాటులో వుంచారు. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల నుంచి సేకరించారు. ఇదంతా దేశభక్తి, మాతృభూమికి చేస్తున్న సేవ అవునా.. కాదా? అనేది సంఘాన్ని విమర్శించే వారు మనస్సాక్షితో జవాబు చెప్పాలి.
 
మరింత తాజా ఉదాహరణ చెప్పుకోవాలంటే, లక్షలాది భక్తుల నడుమ ఇటీవలే జరిగిన పూరీ జగన్నాథ రథయాత్రలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు విశేషంగా సామాజిక సేవలు, వైద్య సేవలు అందించారు. యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, సాంస్కృతిక సంపదను పరిరక్షించుకోవడం... దేశం కోసం నిలబడాల్సిన ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా ఆర్ఎస్ఎస్ ప్రేరణతో స్వయంసేవకులు ముందుండి నిలబడుతున్నారు... జాతీయ స్ఫూర్తికి నిలువెత్తు దర్పణమై నిలుస్తున్నారు.