రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హెడ్గేవార్ (డాక్టర్జీ) రెండూ సమానార్థక పదాలేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. రోజు రోజుకీ సంఘ్ పరిణామం చెందుతున్నా కొద్దీ... సంఘ్ మారుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. కానీ సంఘ్ ఏమీ మారిపోవడం లేదని, క్రమంగా వ్యక్తమవుతోందని స్పష్టతనిచ్చారు. అదే విధంగా ఓ విత్తనం చెట్టుగా మారే ప్రక్రియ అని అభివర్ణించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీ ఝండేవాలాలోని కార్యాలయంలో '100 ఇయర్స్ ఆఫ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - శతక్' చిత్రంలోని 'భారత్ మాతా కే బచ్చే' మరియు 'భగవా హై మేరీ పెహచాన్' అనే రెండు పాటలను మోహన్ భాగవత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్జీ జీవితం, సంఘ్ భావజాలం అన్నీ ఒక్కటేనన్నారు. ఆయన జీవితం మనస్తత్వ శాస్త్రం ప్రకారం పరిశోధన చేయాల్సిన అవసరం వుందని, అధ్యయనం చేయాల్సిన జీవితం అని అన్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఒకే రోజులో గంట తేడా వ్యవధిలో ప్రాణాలను కోల్పోయారని, ఆ సమయంలో డాక్టర్జీ వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమేనన్నారు. అంత చిన్న వయస్సులో అంత పెద్ద పెద్ద దెబ్బలు సంభవించినప్పుడు ఓ వ్యక్తి నిరాశకు గురి కావడం సాధారణమని, అయితే ఈ గాయం మాత్రం డాక్టర్జీ మనస్సుపై ప్రతికూల ప్రభావమే చూపించిందన్నారు.
అతను అనుభవించిన దుఃఖం ఊహించలేనిది. కానీ అది అతని స్వభావంపై లేదా వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. డాక్టర్ సాహిబ్ జన్మతః దేశభక్తుడని వివరించారు. అప్పటికే మానసికంగా చాలా బలంగా వుండేవాడని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. చలించక, దృఢంగా వుండటం మొదటి నుంచీ అలవాటేనన్నారు.