రాష్ట్ర సేవికా సమితి భాగ్యనగర్ విభాగ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవం సక్కుబాయి మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా భాగ్యనగర్ విభాగ్ కార్యవాహిక శ్రీమతి నాగశ్రీ శారదాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండగ ఉత్సవ విశిష్టతను వివరించారు. సూర్యుడు ప్రతి మాసంలోనూ ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు ఇప్పుడు ప్రత్యేకంగా మకరరాశిలోకి మారుతాడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తర దిశ వైపు తన కిరణాలను ప్రసరింప చేస్తాడని వివరించారు.
సంక్రాంతి పండగ రైతుల పండగ అని, రైతులు ధాన్యాలు కోతలు పూర్తి అయ్యి, ఇంటికి వస్తాయని, ఇన్నాళ్ళూ తమకు ఎంతో సేవ చేసి పశువులకు పూజలు చేసి, మంచి ఆహారం సమర్పించి, కృతజ్ఞతలు తెలుపుకొని సందర్భమని వివరించారు. అలాగే హరిదాసులు గంగిరెద్దులతో ప్రతి ఇంటి ముందు విన్యాసాలు చేయించి ఆ గ్రామంలో ఉన్న అందరి గృహస్తులను భాగస్వాములుగా చేస్తారన్నారు.
పశుపతికి ప్రీతి కలిగించే రోజు అలానే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి నెత్తి పశుపక్ష్యాదులను, మానవాళిని రక్షించిన రోజు భోగి పండుగ. ఈ దినం ఉదయమే ఆవు పేడతో చేసిన పిడకలతో పనికిరాని పాత వస్తువులతో భోగిమంటలు వేసుకొని అగ్ని దేవునికి పూజ చేస్తాం. భోగి నాడు చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసుకొని సంబరాలు చేసుకుంటామని గుర్తు చేశారు. సంక్రాంతి నాడు సూర్యుని పూజ చేస్తాం. జీవనాధారమైన సూర్యునికి పూజ చేసి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నారు.
అలాగే పంచ పరివర్తన ప్రాధాన్యాన్ని కూడా వివరించారు. సామాజిక సమరసత, స్వ ఆధారిత జీవనం, పౌర విధులు, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ గురించి కూలంకషంగా వివరించారు. మనం అనుకున్న పంచ పరివర్తన జరగాలంటే సమాజంలో స్పందన ఉండాలి ఆ స్పందనను మనం కలిగించగలగాలని సూచించారు.
ఆకట్టుకున్న పథ సంచలన్
ఈ సందర్భంగా పురవీధులలో అడుగులో అడుగు కలుపుతూ సేవికలు చేసిన పథ సంచలన్ అందరినీ ఆకట్టుకుంది. పుర ప్రజలు భగవాధ్వజానికి పూలవర్షంతో స్వాగతం పలుకుతూ ధ్వజం పట్ల తమ భక్తిని చాటుకున్నారు.