ఇరాన్ నుండి సురక్షితంగా భారత్ చేరుకున్న భారతీయులు

VSK Telangana    17-Jan-2026
Total Views |



iran 

ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న పలువురు భారతీయులు శుక్రవారం అర్థరాత్రి న్యూదిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇరాన్లో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన అనంతరం భారతీయులు అక్కడి నుంచి తిరిగివచ్చారు. ఇరాన్లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని, భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్నుంచి తిరిగొచ్చిన ఓ భారతీయులు అక్కడి పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.

అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ ప్రభుత్వం మాకు ఎంతో సహకరించింది. ఎంబసీ ముందుగానే సమాచారమిచ్చి, వీలైనంత త్వరగా దేశం విడిచిపెట్టేలా సహాయం చేసింది. ‘మోదీజీ ఉన్నారు అంటే అన్నీ సాధ్యమే" అంటూ ఓ ప్రయాణికుడు భావోద్వేగంగా చెప్పారు.

మరో భారతీయుడు మాట్లాడుతూ, "మేం నెల రోజులుగా ఇరాన్లో ఉన్నాం. కానీ గత వారం, పది రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటకు వెళ్తే ఆందోళనకారులు కార్లను అడ్డుకునేవారు. కొంత ఇబ్బంది కలిగించేవారు. ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేయడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేక చాలా ఆందోళన చెందాం. ఎంబసీతో కూడా సంప్రదించలేకపోయాం" అని తెలిపారు.

ఇదిలా ఉండగా ఇరాన్నుంచి తిరిగొస్తున్న వారి కోసం అనేక కుటుంబాలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తమ బంధువులు సురక్షితంగా తిరిగొస్తుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.