విజయం వరిస్తే.. కొందరు దానిని తమ ప్రతిభ, కృషి అన్న ఖాతాలో వేసుకుంటారు. అదే కెరీర్ లో ఎదురు దెబ్బలు తగిలినా, కెరీర్ కాస్త నెమ్మదించినా.. అలాంటి వారు వ్యక్తులను, పనిచేసే సంస్థలను, పరిశ్రమను నిందిస్తుంటారు. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ వచ్చి చేరారు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురిచి చెబుతూ.. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి వుండొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. పవర్ షిఫ్ట్ ఇందుకు ఒక కారణమైతే, మతం కూడా మరో కారణం అని అన్నారు. అలాగే పరిశ్రమ రాజకీయాలు కూడా కారణమన్నారు.
బీబీసీ నెట్ వర్క్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1990 ప్రాంతంలో హిందీ చిత్ర పరిశ్రమలో ఏదైనా పక్షపాతాన్ని ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా.. అయితే అలాంటి పక్షపాతాన్ని బహిరంగంగా అనుభవించలేదని, అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా తన హిందీ సంగీత కెరీర్ కాస్త నెమ్మదించిందని, దీనికి ‘‘పవర్ షిప్ట్’’ కారణమన్నారు.
దక్షిణ భారత తమిళ నేపథ్యం కారణంగానే, ఇతర ఇండస్ట్రీ రాజకీయాల కారణం అయ్యివుండొచ్చని జవాబిస్తారేమో అనుకుంటే.. ఏకంగా మతపరంగానే ఇలా జరిగిందని చెప్పడం కాస్త విడ్డూరం.
‘‘బహుశ: నా వెనుక జరిగినవి తెలియకపోవచ్చు. దేవుడు కూడా ఇవన్నీ దాచిపెట్టి వుండొచ్చు. కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ జరిగి వుండొచ్చు. అసలు సృజనాత్మకత శక్తి లేని వ్యక్తులు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మతపరమైన విషయం కూడా కావొచ్చు. కానీ నాకు నేరుగా మాత్రం వినిపించలేదు. గుసగుసలు మాత్రం వచ్చాయి. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరేవాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలున్నాయి’’ అని అన్నారు.
2020 సంవత్సరంలోనూ ఇదే తంతు...
బాలీవుడ్ లో ఓ ముఠా పనిచేస్తోందని, ఆ ముఠాయే తనపై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేస్తోందని, అపార్థాలను సృష్టిస్తోందని, మంచి ప్రాజెక్టులు తనకు రాకుండా అడ్డుకుంటోందని 2020 లో కూడా రెహ్మాన్ అన్నారు. దీంతో మంచి సినిమాలు, ప్రధాన స్రవంతిలోకి వచ్చే బాలీవుడ్ ప్రాజెక్టులు కాకుండా డార్క్ మూవీస్ చేయాల్సి వస్తోందన్నారు. తను కాస్త వెనుకబడడానికి ఈ కారణాలు చెప్పారు కానీ.. మతతత్వ కోణంలో మాత్రం వాదనలు చేయలేదు.
అసలు బాలీవుడ్ లో ముస్లింల ఆధిపత్యమే....
బాలీవుడ్ చరిత్రను చూసుకుంటే ఇప్పటికీ చాలా మంది ముస్లింలకు ప్రాధాన్యతే కనిపిస్తోంది. మహ్మద్ రఫీ నుంచి దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), సలీం జావేద్ నుంచి ఖాన్ (సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్) వరకూ వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిస్సందేహంగా హిందూ చరిత్రను, సంస్కృతిని హైలేట్ చేసేందుకే హిందీ సినిమాలు వచ్చాయి. అయితే.. దీనర్థం పరిశ్రమ మతతత్వంతోనో, హిందూ అనుకూలత, ముస్లిం వ్యతిరేకత అన్న అర్థం కానేకాదు.
ముస్లిం మతాన్ని అనుసరించే చాలా మంది గాయకులు, సంగీత స్వరకర్తలు బాలీవుడ్ లో అభివృద్ధి చెందుతూనే వున్నారు.రెహమాన్ మాట్లాడిన మతపరమైన కోణం కేవలం ఆయనకు మాత్రమే వర్తిస్తుందన్న విమర్శలూ బాహాటంగానే వస్తున్నాయి. నిజానికి రెహమాన్ కెరీర్ మూడు దశాబ్దాల పాటు అద్భుతంగా సాగింది.తన సంగీతం ద్వారా, రెహమాన్ తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలపై తనదైన ముద్ర వేశారు.
ఆస్కార్ నుండి ఫిల్మ్‌ఫేర్ వరకు, రెహమాన్ తన పాటలకు డజన్ల కొద్దీ అవార్డులు మరియు ప్రశంసలను గెలుచుకున్నాడు.అంత మాత్రాన ఎప్పుడూ అలాగే వుంటారన్న సిద్ధాంతమూ లేదు. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించే ధనుష్ నటించిన ఇటీవలి బాలీవుడ్ హిట్ సినిమాలో ఆయన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. నిజానికి, గాయకుడు ఫహీమ్ అబ్దుల్లా పాట 'ఆవారా అంగార' ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందింది.2025లో వచ్చిన మరో బ్లాక్‌బస్టర్‌లో అబ్దుల్లా టైటిల్ ట్రాక్ ‘సైయారా’ నాలుగు నెలల పాటు టాప్ సాంగ్స్‌లో నిలిచింది.
ముస్లిం నటులు, గాయకులు మరియు సంగీత స్వరకర్తలు, ఫహీమ్ అబ్దుల్లా, సలీం-సులైమాన్, అర్మాన్ మరియు అమల్ మల్లిక్, జావేద్ అలీ వంటి వారు బాలీవుడ్‌లో స్థిరంగా వారి వారి కెరీర్ ను కొనసాగిస్తూనే వున్నారు. కానీ.. మతం కారణంగా కేవలం రెహమాన్ కి మాత్రమే ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదు? ఇది కేవలం రెహమాన్ కి మాత్రమే వ్యతిరేకమా?
సృజనాత్మకత లేని వారు నిర్ణయాత్మక స్థాయిలో వున్నారన్న రెహమాన్.. వారెవరో మాత్రం వెల్లడించలేదు. వారి పేర్లు చెప్పేంత వరకూ రెహమాన్ ‘‘మతపరమైన విషయం’’ ఒఠ్ఠి ఊహాజనితమైందే. రెహమాన్ చెప్పిన పక్షపాతాలు నిజమైనవే కావొచ్చు, కానీ కేవలం మతం ఆధారంగానే ఇలా జరిగిందన్నది మాత్రం శుద్ధ అబద్ధమని సినిమా సర్కిల్స్ నుంచే వినిపిస్తున్నాయి.
తమిళ గేయ రచయిత పిరైసూదన్ షాకింగ్ కామెంట్స్
తమిళ కవి, గేయ రచయిత పిరైసూదన్ రెహమాన్ కుటుంబం, హిందూ సంప్రదాయాలపై , ఇతరత్రా విషయాలపై ఎలా అసహనాన్ని వ్యక్తం చేశారో వెల్లడించారు. పిరైసూదన్ ప్రకారం.. ‘‘రెహమాన్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లాను. ఆశ్చర్యకరంగా రెహమాన్ తల్లి విభూతి, కుంకుమ ధరించవద్దని చెప్పింది.కానీ నేను అందుకు నిరాకరించాను’’ అని వెల్లడించారు.
మండిపడుతున్న సినిమా ప్రముఖులు :
రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారమే రేగుతోంది. అవి అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలని రచయిత్రి శోభా డే అన్నారు. రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నానని, జావేద్ అక్తర్ అన్నారు. పని లేకపోవడానికి మతం కారణం కాదని, ముంబైలో చాలా మందికి రెహమాన్ పై గౌరవం వుందన్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా వుంటున్నారని, విదేశాల్లో ఆయన నిర్వహించే కార్యక్రమాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని, అందుకే తమ ప్రాజెక్టులకు ఆయన అందుబాటులో వుండరేమో అని, పైగా తొలి నుంచి రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని, అందుకే చిన్న నిర్మాతలు ఆయన్ను సంప్రదించడానికి
వీలుకావట్లేమో అని అన్నారు.
దునుమాడిన కంగనా రనౌత్
ప్రముఖ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ మీ కంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేను ఇంత వరకూ చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరివ్వలేదు. ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి’’ అంటూ మండిపడ్డారు.