కుల వివక్ష సమాప్తం కావాలంటే ముందుగా దానిని మనస్సు నుంచి తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రాచీన కాలంలో వృత్తులు, పనుల ఆధారంగా కులాలు సృష్టి అయ్యాయని, అవే సమాజంలో పాతుకుపోయాయని వివరించారు. ఇదే కుల వివక్ష ఆవిర్భావానికి దారితీసిందన్నారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఛత్రపతి శంభాజీ నగర్ లో ప్రముఖుల గోష్టి జరిగింది. ఈ సందర్భంగా కులతత్వం, సాంకేతికతపై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత అనేది అనివార్యమని, స్వదేశీని ఉపయోగించడం అంటే సాంకేతికతను వదిలేయడం కాదని స్పష్టం చేశారు. అయితే, సమాజం దానికి బానిసలుగా మారకుండా మాత్రం చూసుకోవాలని సూచించారు.
‘‘సాంకేతికత అనేది హానికరం కాదు. కానీ దానికి మనం బానిసలుగా మారొద్దు. సమాజం అవసరాలను తీర్చడానికి మనం పనిచేయాలి, అది కూడా జీవనోపాధికి మార్గంగా మారుతుంది. నేటికీ ఓ భారతీయ రైతు వ్యవసాయమే తన ధర్మం అని చెబుతాడు. ఇంత ఉన్నతమైన ఆలోచన మరెక్కడా కనిపించదు. అందుకే మన పని కూడా సమాజ ఆధారితమైందని అర్థం చేసుకోవాలి. దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను స్వీకరించాలి. సాంకేతికత సమాజానికి హాని కలిగించకుండా, ఉపాధి అవకాశాలు తగ్గకుండా చూసుకోవాలి.’’ అని అన్నారు.
దేశాభివృద్ధికి యువత సహకారం చాలా అవసరమని మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. జ్ఞానాన్ని సంపాదించడానికి విదేశాలకు వెళ్లడంలో తప్పు లేదు, కానీ ఆ జ్ఞానాన్ని భారతదేశం కోసం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత యువతపై ఉందని, నేటి యువతలో దేశభక్తి కూడా వుందన్నారు. యువతలో దేశభక్తి ఎంత ఎక్కువగా వుంటే, వారు దేశం కోసం అంత ఎక్కువగా పనిచేస్తారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి చాలా మంది వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి పనిచేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా పలువురు మేధావులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. నేటి కాలంలో కుల తత్వానికి మూల కారణంగా కుల అహంకారమేనని స్పష్టం చేశారు. కుల వివక్షను తొలగించడానికి అసలు కులం చూడొద్దన్న మానసిక అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని చిత్తశుద్ధితో ఆచరిస్తే.. రాబోయే పది నుంచి పన్నెండు సంవత్సరాలలో కుల వివక్షతను నిర్మూలించుకోవచ్చని స్పష్టం చేశారు.
సంఘ్ వ్యక్తి నిర్మాణం అన్న కార్యాన్ని చేస్తోందని, ఈ పని తప్ప ఇంకో పని ఏదీ చేయదని పునరుద్ఘాటించారు. అలాగే సంఘ్ ఎవరికో వ్యతిరేకంగానో, ప్రతిస్పందనగానో ప్రారంభం కాలేదని, సమాజంలోని అన్ని వర్గాల వారూ కలిసి, దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలన్నదే సంఘ్ ఉద్దేశమని వివరించారు. సమాజం ఉన్నత స్థితికి వెళ్లాలన్నదే తమ సంకల్పం అని, అంతేగానీ సంఘ్ వ్యక్తిగతంగా ఎదగాలన్నది తమ ఆకాంక్ష కానేకాదన్నారు.
సమాజంలోని ఏదో ఒక సంస్థను స్థాపించడం సంఘ్ పని కాదని, యావత్ సమాజాన్ని సంఘటితపరచడమే సంఘ్ పని అన్నారు. ఒకానొక సమయం ఎలా రావాలంటే సమాజం మొత్తం సంఘ్ ఆలోచనా పద్ధతిలో పనిచేసే సమయం రావాలని ,అప్పుడు ఒక సంఘ్ గుర్తింపు అంటూ ఏమీ వుండదన్నారు. సంఘ్ ఆశించేది కూడా ఇదేనని, సంఘ్ అర్థం కావాలంటే శాఖకు రావాల్సిందేనన్నారు.