దేశ విభజన హృదయవిదారకం.. నేటి తరం అర్థం చేసుకోవాలి : సుధామూర్తి

VSK Telangana    18-Jan-2026
Total Views |

sudha 
 
రాజ్యసభ ఎంపీ, రచయిత్రి సుధామూర్తి దేశ విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను, దేశ చరిత్రను నేటితరం పిల్లలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలన్నారు. జైపూర్ వేదికగా జరుగుతున్న జైపూర్ సాహిత్య వేడుకల్లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ విభజనపై వ్యాఖ్యలు చేశారు.
 
దేశ విభజన జరగడం తప్పని, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనపై అవగాహన చేసుకోవడంలో యువతకు సహకరించేందుకు ఆయా సున్నిత అంశాలపై తాను తాజా పుస్తకం ‘ది మ్యాజిక్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఎర్నింగ్స్‌’లో వివరించానని పేర్కొన్నారు.
 
భారత సంప్రదాయాలు, దేశ భాషల గురించి తెలియని ఓ వ్యక్తి ఒక పెన్సిల్‌ తీసుకొని గీత గీసి.. ‘ఇప్పటి నుంచి ఈ భూమి ఇకపై మీకు చెందదు. అది విదేశీ భూభాగం అవుతుంది’ అని చెప్పారని, అది ఎంత హృదయ విదారకరమని సుధామూర్తి అన్నారు. తన అల్లుడు, బ్రిటీష్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ కుటుంబం గురించి చెబుతూ.. నేడు పాకిస్థాన్‌లో ఉండే ప్రాంతానికి చెందిన సునాక్‌ తాత దేశ విభజన సమయంలో అక్కడి నుంచి ఇల్లు, వ్యాపారాలు అన్నీ వదులుకొని, బలవంతంగా వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు.‘‘దేశ విభజన సమయంలో, అతను తన వ్యాపారం, ఇల్లు, డబ్బును వదిలి ఆఫ్రికాకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అతను తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు. తరువాత అతను లండన్‌కు మకాం మార్చాడు.ఆ సమయంలో సునక్ వయసు పదేళ్లు. ఆ కుటుంబం రెండుసార్లు తమ ఇంటిని కోల్పోయింది. అయినా, వారు ధైర్యంతో జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించారు. ఆ పోరాటం మరియు కృషి ఫలితమే వారు నేడు ఉన్నత స్థితిలో వున్నారు. ’’ అని వివరించారు.
 
ఒక సారి తాను పాక్ కి వెళ్లిన సమయంలో అక్కడి మ్యూజియంకి వెళితే.. విదేశీయురాలినని ఎక్కువగా ఛార్జ్ చేశారని, ఒకప్పుడు అద మన అఖండ భారతంలో భాగమే కదా.. అంటూ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు సరిహద్దుల కారణంగా వేరే దేశం అయ్యిందన్న ఆలోచన తనను బాధపెట్టిందన్నారు.
 
 
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రాంతం గానీ, స్వేచ్ఛ గానీ ఊరికే రాలేదన్న విషయాన్ని ప్రస్తుత తరానికి చెప్పాలనుకుంటున్నానని, మన పూర్వీకులు ఎంతో కష్టపడి వాటిని సాధించారన్నారు. ఎంతో మంది ఇళ్లను కోల్పోయినా.. సంకల్పంతో వారి జీవితాలను పునర్నిర్మించుకున్నారన్నారు. ఈ విషయాలన్నీ తెలియజేసేందకు ‘‘ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్ రింగ్స్’’ అన్న పుస్తకం రాశానని వెల్లడించారు. తన మనమరాలు అనౌష్క శర్మను ఆధారంగా చేసుకొనే ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రను తీర్చిదిద్దనట్లు సుధామూర్తి తెలిపారు.