ఈ దేశమంటే ఏమిటో యువతకు అవగాహన వుండాలి : మోహన్ భాగవత్

VSK Telangana    20-Jan-2026
Total Views |
 
rss
 
యువకులు దేశం కోసం వివిధ రంగాలలో పనిచేస్తున్న సమయంలో, వారికి దేశం అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా రాజ్ కోట్ లోని సేవా భారతి భవన్ లో ‘‘యువ మిలన్’’ నిర్వహించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ దేశమంటే ఏమిటో అన్న స్పష్టత గతంలో లేని కారణంగానే, నీరు గారడం వల్లనే దేశం బానిసత్వంలోకి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. ‘‘మన దేశం చైతన్యవంతమైంది, సజీవమైంది, మనం దానిని భారత మాత అని పిలుస్తాం. ఇది కేవలం భూమి ముక్క కాదు. దీనిని విభజన చేయలేం. ఎందుకంటే భావోద్వేగాలతో ముడిపడి వున్న అంశం.’’ అని వివరించారు.
 
ఇక.. హెడ్గేవార్ సంఘ్ ని ఎందుకు స్థాపించారు, అప్పటి పరిస్థితులు, చర్చల గురించి కూడా మోహన్ భాగవత్ ప్రస్తావించారు. యావత్ హిందూ సమాజాన్ని సంఘటిత పరిచేందుకే సంఘ్ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. ‘‘బ్రిటన్ లో బ్రిటీష్ వారు, అమెరికాలో అమెరికన్లు వున్నట్లే హిందూస్థాన్ లో నివసించే వారు హిందువులే. భారత్, హిందుస్థాన్ వేర్వేరు కాదు. భారత్ అంటే ఒక జీవన విధానం, హిందూ అంటే కూడా ఒక జీవన విధానం. కలిసి జీవించడం, ఐక్యతతో, సమష్టిగా ముందుకు సాగడం అన్న నిర్వచనమే హిందూ అనే దానికి నిర్వచనం’’ అని తెలిపారు.
 
భారత్ సంస్కృతి అంటే వసుధైక కుటుంబం అని, సనాతన్, భారతీయ, ఇండిక్, ఆర్య, హిందూ అనేవి ఒకే సారాన్ని తెలిపే వేర్వేరు పేర్లు అని, అయితే.. హిందూ అంటే అత్యంత సరళమైన పని అని, సులభంగా అర్థమవుతుందని అన్నారు. హిందూ సమాజం తన అస్తిత్వాన్ని మరిచిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని, దేశం బలంగా వుండేలా, అభివృద్ధి చెందేలా బాధ్యత యావత్ సమాజంపై వుందని ఉద్బోధించారు. యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి, ప్రపంచ సంక్షేమం కోసం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంఘ్ అహర్నిశలూ కృషి చేస్తోందన్నారు.
 
నిత్య శాఖ ద్వారా క్రమశిక్షణ, సమర్థులైన, నిబద్ధత కలిగిన స్వయంసేవకులను సంఘ్ నిర్మిస్తోందని, వారంతా వివిధ రంగాలలో నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే... ప్రతి ఒక్కరూ శాఖకు రాలేరు కాబట్టి, ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘పంచ పరివర్తన్’’ అనే భావనను ప్రతిపాదించామన్నారు. ఈ పంచపరివర్తన్ లోని రంగాలలో ప్రతి పౌరుడూ చిన్న చిన్న లేదా పెద్ద ప్రయత్నాల ద్వారా జాతీయ ప్రయోజనాలకు తోడ్పడాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.