ఏది సరైంది, ఏది సరైంది కాదో ధర్మం బోధిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మన పురాతన కాలం నుంచి కూడా జ్ఞాన సముపార్జన కోసం, సంస్కారాల కోసం సాధు సంతుల దగ్గరికి వెళ్తూనే వున్నామన్నారు. భారత్ ప్రపంచానికి ఎల్లప్పుడూ సంస్కారాన్ని బోధించడానికి ఆసక్తిగానే వుందన్నారు. నాగౌర్ పట్టణంలోని ఛోటిఖాటూ పట్టణంలో 162 వ మర్యాదా మహోత్సవం జరిగింది. దీనికి మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంసేవకులు సంఘ స్థాన్ కి దండలను తీసుకెళ్తారని, కానీ.. ఎందుకు తీసుకెళ్లాలి? ఎప్పుడు ఉపయోగించాలి, దాని పరిమితులను తెలుసుకోవడానికి కూడా సాధువులను సంప్రదిస్తామన్నారు. సమాజంలో అత్యుత్తమైన వారు సత్యాన్ని మాట్లాడటమే కాకుండా, దానిని తమ జీవితాల్లో కూడా ఆచరిస్తారన్నారు. భారత్ లో వున్న అత్యుత్తమమైన వారిని సమాజం ఎప్పుడూ అనుసరిస్తూనే వుంటుందన్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం సాధుసంతులేనన్నారు. డబ్బు వెనుక పరగెత్తడం మన సంప్రదాయం కాదని, కానీ.. డబ్బు సంపాదించిన వారే దాన ధర్మాలు చేస్తారని తెలిపారు.దానం అనేది మన భారతీయుల జీవన శైలిలో ఓ అంతర్భాగమని, డబ్బే కాకుండా, జీవితాలను కూడా త్యాగం చేసే వ్యక్తులున్నారని గుర్తు చేశారు. అలాగే సంపాదించిన డబ్బును ఎలా పంచాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా వుందని నొక్కి చెప్పారు.
వ్యక్తులను చూస్తుంటే అందరూ భిన్నభిన్నంగా వుంటారని, కానీ.. మూలత: అందరూ ఒకటేనని ప్రకటించారు. అందరూ మనవారే అన్న దానిని ఆచరిస్తూ వుంటే మర్యాద అనేది దానంతట అదే వస్తుందన్నారు.అందరూ మనవారేనని, అందరూ తమ జీవితాన్ని సాగించాలని ఆలోచించాలని, ఇదే మన ధర్మం బోధిస్తుందని వివరించారు. ధర్మం అనేది కట్టుబడి వుండాలన్న భావనను కలిగిస్తుందని, దీని వెనుక సత్య స్ఫూర్తి దాగివుందన్నారు. భారత్ లో మాత్రమే అహింస, బ్రహ్మచర్యం, దొంగతనం చేయకుండా వుండటం, అపరిగ్రహం అనేది ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యమవుతుందని అన్నారు.
మనందరికీ శిబిచక్రవర్తి ఉదాహరణ ఇంకా వుందని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ఆయన ప్రకారం మన ధర్మమే మన కర్తవ్యమని తెలిపారు. ప్రస్తుతం కొన్ని దేశాలు ఏం జరిగినా సరే.. తన పని మాత్రం కావాలి అన్న స్వార్థబుద్ధితో వున్నారన్నారు. కానీ భారత్ మాత్రం ఈ మార్గాన్ని అనుసరించడం లేదని, భారత్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ పట్టించుకునే గుణంతో వుంటుందన్నారు. విపత్తులు మరియు సంక్షోభ సమయాల్లో సేవలను అందించిన, అందిస్తున్న ఏకైక దేశం భారత్ అని కొనియాడారు.
తన కడుపును మాడ్చుకొని మరీ, ఇతర దేశాలకు మద్దతిచ్చిందని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ఇదే ధర్మం అని, ఏది సరైనది, ఏది సరైనది కాదో వివరించేదే ధర్మం అని వివరించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు వ్యవసాయ రంగంలో అనేక రసాయనాలను ఉపయోగించి, తెగుళ్లను పూర్తిగా నాశనం చేస్తున్నారని, అయితే భారత్ దృక్పథం మాత్రం ఇందుకు భిన్నంగా వుంటుందన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో తెగులు నియంత్రణ అనేది ఒక రకమైన సమతుల్యత అని, మతం విషయంలోనూ ఇదే సమతౌల్యతను కాపాడుకోవాలని సూచించారు. సేవ, క్రమశిక్షణ, మర్యాద అనేది భారత్ విధులని, ఇవి ఈశ్వరుడి ద్వారా భారత్ కి వచ్చాయన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా ఆచార్య మహాశ్రమన్ జీ మాట్లాడుతూ మన వాక్కు రత్నమని, కానీ మూర్ఖులు రాళ్లల్లో రత్నాలను చూస్తారన్నారు. సద్గురువు అంటే సమాజానికి కల్యాణం చేసే వాక్కులను ప్రసాదిస్తారని సరైన జ్ఞానాన్ని అందిస్తారని, ఆయన ద్వారా సరైన మార్గదర్శకత్వమే లభిస్తుందన్నారు.