77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్‌పూర్‌లోని మధుకర్ నికేతన్‌లో సంస్కృతి ఉత్థాన్ సమితి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు చేసిన ప్రసంగం యథాతథంగా..
"గణతంత్ర వ్యవస్థ. మన రాజ్యాంగం మనల్ని మనం అర్పించుకున్నామని చెబుతోంది. మనమందరం కలిసి ఈ దేశాన్ని నడపాలి. సరిహద్దులో మరణించిన ప్రతి ధైర్యవంతుడు భారతీయుడే. కానీ నగరంలో ఉన్న మనలో మనం కూడా భారతీయులమే. మన రాష్ట్రపతి ఒకసారి హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆమె ప్రసంగం జరిగింది...చాలా చిన్న ప్రసంగం...ఆ ప్రసంగంలో ఒకటే సందేశం ఇచ్చింది. మనం నగరవాసులం కాదు, పర్వతవాసులం కాదు, గ్రామవాసులంకాదు మనమందరం భారతవాసులం. మనకు ఎన్ని శతాబ్దాల తర్వాత స్వతంత్రం దొరికింది. దానికన్నా ముందు మనల్ని విదేశీయులు పాలించారు. కానీ ఇప్పుడు మనకు మన స్వతంత్ర దేశం ఉంది, మనం మన దేశాన్ని పాలించుకుంటున్నాం. అంటే కొంతమంది వ్యక్తులు అందరినీ పరిపాలిస్తున్నారని కాదు. ప్రజలందరూ కలిసి దేశాన్ని పాలిస్తున్నారు. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాము. వారు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే, దీని గురించి తెలుసుకోవడం, ప్రజలను మేల్కొల్పడం మన కర్తవ్యం. అందుకే గణతంత్ర దినోత్సవం ఆ విషయాన్ని గురించి స్మరించుకునే రోజు.
మనం జెండా ఎగురవేస్తాం. జెండా పైభాగంలో కాషాయానికి, త్యాగానికి, జ్ఞానానికి, భారతదేశ శాశ్వత సంస్కృతికి చిహ్నం అయిన భగవా రంగు అంటే కాషాయ రంగు ఉంటుంది. దాని తర్వాత మన మనస్సు స్వచ్ఛతను, ప్రశాంతవాతావరణాన్ని సూచించే తెలుపురంగు ఉంటుంది. అదేవిధంగా ఈ రెండూ కాకుండా మన మధ్య ఎలాంటి తగాదాలు లేకుండా, ఘర్షణలు ఉండకుండా ప్రతి ఒక్కరి హృదయంలో శాంతి ఉండాలి, పరస్పర సోదరభావం ఉండాలి, మనస్సులో వివక్ష లేదా ఇతర దుర్గుణాలు ఉండకూడదు, స్వచ్ఛమైన మనస్సు ఉండాలి, ప్రజలు శ్రద్ధగా, త్యాగమయంగా ఉండాలి. శ్రేయస్సుతో ఉండాలి. అప్పుడే లక్ష్మీ రూపం ప్రతిబింబిస్తుంది. ఆమె ప్రకాశిస్తుంది. దీనిని సూచించి రంగే ఆకుపచ్చ. ఇవన్నీ జరగాలంటే, ప్రతి ఒకరు ఏమి చేయాలి? దానికోసమే మన జెండా మధ్యలో ధర్మచక్రం ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు ధర్మాన్ని తప్పనిసరి అని భావించారు. మన రాజ్యాంగంలో అనేక రకాలైన చట్టాలన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ధర్మం ఆధారంగా ఉంటాయి. పూజ, ఆహారవ్యవహారాలు.. ఇది ధర్మం కాదు. అందరినీ కలిపే, అందరినీ ఉద్ధరించే, అందరినీ ఒకచోట చేర్చి, అనైక్యతను నిరోధించేది ధర్మం. దాన్ని గురించి చెప్పేదే ధర్మం. ధర్మచక్రం దాన్ని సూచిస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ధర్మం ఆవశ్యకతను గురించి చాలా సార్లు చెప్పారు. అంతేకాదు రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో వారు రెండు ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలలో స్వతంత్ర భారతదేశంలో మనం ఎలా ప్రవర్తించాలో చాలా అందమైన మార్గదర్శత్వంతో చెప్పారు. ఆ రెండు ప్రసంగాలను మనమందరం తప్పనిసరిగా చదవాలి.
గణతంత్రంలో, మనం కలిసి దేశాన్ని పరిపాలిస్తాము. సరే, మరి మన ధర్మం ఏమిటి? మన రాజ్యాంగం దీనిని బోధిస్తుంది. మనం రాజ్యాంగంలోని నాలుగు ప్రకరణలను ఎప్పుడూ చదవాలి. అవి రాజ్యాంగ ఉపోద్ఘాతం, మార్గదర్శక సూత్రాలు, పౌరవిధులు, పౌరహక్కులు. మన ఇంట్లో పిల్లలకు కూడా వీటి గురించి తెలియజేయాలి. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చింది. కానీ మిగతా వ్యవస్థలన్నీవాటంతట అవి పనిచేయవు. దేశాన్ని నడపడానికి మనం కొంత క్రమశిక్షణను పాటించాల్సి ఉంటుంది. ప్రవర్తనా క్రమశిక్షణ. రాజ్యాంగం నుండి దీనికి దిశానిర్దేశం లభిస్తుంది. అందుకోసమే సంఘ కార్య శతాబ్ది సందర్భంగా పంచ పరివర్తన సూత్రాలను సమాజంలోకి తీసుకురావాలని సంఘ్ నిర్ణయించింది. ముందుగా ఈ 5 సూత్రాలను మనకు మనంగా, మన కుటుంబాలలో ముందుగా ఆచరణలోకి తీసుకుని వచ్చి, తర్వాత సమాజంలోకి ఈ సూత్రాలను తీసుకువెళ్లాలని నిర్ణయించడం జరిగింది.
ఆ ఐదు పరివర్తనలలో ఐదవది.. పౌరనియమాలు - నిబంధనలను పాటించడం. చాలా నియమాలు నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఒక చట్టం సరైనది కాకపోతే, ప్రజలు దానిని మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ అది మారే వరకు, ఉన్న చట్టాన్ని సరిగ్గా పాటించాలి. చట్టాన్ని మార్చడానికి ఏదైనా చేయాల్సి వస్తే, రాజ్యాంగంలోనే దానికి అవకాశం ఉంది. దాన్ని మనం పాటించాలి. చట్టాన్ని ఒకరి చేతుల్లోకి తీసుకోకూడదు. అంతేకాక చట్టంలో లేని, రాయని నియమాలు కూడా ఉన్నాయి. అవి సంప్రదాయం నుండి వచ్చాయి. సంప్రదాయం కొంత ఉపయోగం కలిగి ఉండటం వల్ల దానిని పాటించారు. ఈ నియమాలు, సంప్రదాయంలో ఉన్నవి కూడా మార్చబడతాయి. కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి, సంప్రదాయాన్ని అనుసరించేవారికి, వారి సంస్కృతి వారికి బోధిస్తుంది. వాటిని ఎలా పాటించాలి, ఎక్కడ పాటించాలి.. అనే ఒక సమయం సందర్భం ఉంటుంది. వాటిని అనుసరించడంలో సాధ్యమైనంత స్థిరంగా ఉంటారు. వాటిని రాజ్యాంగంలో రాయలేదు కనుక వాటిని పాటించకపోతే, మీరు చట్టం ద్వారా శిక్షించబడరు. కానీ అది అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన జీవితాలను నిజమైన మనుష్యులులాగా మారే విధంగా మన జీవితాలని రూపొందిస్తుంది. ఉదాహరణకు పెద్దల కాళ్లకు నమస్కరించండి, గౌరవం ఇవ్వండి.. ఈ నియమాన్ని అందరూ పాటిస్తారు, అనుసరిస్తారు.
నేను సంఘ్‌లో జరిగే విషయాల గురించి మాట్లాడట్లేదు. సంఘ్‌లో గొప్ప లేదా చిన్న అని ఎవరూ లేరు. అందరూ సమానమే.. అక్కడ కాళ్లకు దండం పెట్టడం లాంటివి ఏవీ ఉండవు. కానీ అది ఇళ్లలో ఉంటుంది. ఇది పాఠశాలల్లో ఉంది. దీని కారణంగా, మానవులు ఎల్లప్పుడూ తమ అహాన్ని అదుపులో ఉంచుకునే అలవాటును పెంచుకోవాలి. ఇప్పుడు, మీరు దానిని చేయకపోతే, శిక్ష ఉండదు. కానీ మీరు వీటన్నింటినీ అనుసరించడం ద్వారా మానవ జీవితంలోని ఒక మంచి అంశం మీ జీవితానికి జోడించబడుతుంది. వీటన్నింటినీ పాటిస్తూనే మన పూర్వీకులు వేల సంవత్సరాల తర్వాత ఎన్నో త్యాగాలను చేసి ఈ స్వేచ్ఛను తెచ్చారు. మనం దానిని గౌరవించాలి, రక్షించాలి. అంతేకాకుండా మన దేశాన్ని ప్రపంచానికి నాయకుడిగా చేయాలి. ధర్మం, ఆనందం ,శాంతి సందేశాన్ని మొత్తం ప్రపంచానికి వ్యాప్తి చేయాలి. కాబట్టి గణతంత్ర దినోత్సవం అనేది ఆ విధిని గుర్తుంచుకోవడానికి, మన విధి గురించి తెలుసుకునే రోజు ఇది. మనం దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, తగిన విధంగా ప్రవర్తించాలి. ఈ విషయాలన్నింటినీ మీరు గమనిస్తారనీ, ఆచరిస్తారని కోరుకుంటున్నాను.