దేశవ్యాప్తంగా కన్నువపండువగా పరమహంస యోగానంద జయంతి వేడుకలు
హైదరాబాద్, తిరుపతి: యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మధురానగర్‌లోని సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్ లో వైఎస్ ఎస్ భక్తులు క్రియాయోగ ధ్యానం, భజనలు, పుష్పాంజలి నిర్వహించారు. తిరుపతి నలందా నగర్‌లో నూతన ధ్యాన కేంద్రాన్ని వైఎస్ ఎస్ స్వామి స్మరణానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటిని తొలగించే వాడే గురువని చెప్పారు. భగవంతుడి నిశ్శబ్ద స్వరమే గురువని, సాధన అంటే దయ, క్షమ, సేవా తత్పరత వంటి సుగుణాలను అలవరచుకోవడమేనన్నారు. ధ్యానంతో ఆనందం మన స్వంతమవుతుందని, క్షమాగుణం దైవ లక్షణమని ఉద్బోధించారు.
పరమహంస యోగానంద జీవిత విశేషాలు
పరమహంస యోగానంద ముకుంద లాల్ ఘోష్ గా 1893 జనవరి 5న భారతదేశంలోని గోరఖ్ పూర్ లో, ఆధ్యాత్మిక నిబద్ధత గల తల్లిదండ్రులైన భగవతి చరణ్ ఘోష్, జ్ఞానప్రభా ఘోష్‌లకు జన్మించారు. చిన్న వయస్సు నుంచే ఆయన ప్రార్థన, ధ్యానంపై ఆకర్షితులయ్యారు, నిగూఢమైన ఆంతరిక అవస్థలను అనుభూతి చెందారు, దివ్యకాంతి దర్శనాలతో సహా. వీటిని ఆయన తర్వాత ఒక యోగి ఆత్మకథలో ప్రస్తావిస్తూ, దేవుణ్ణి అన్వేషించాలనేదే అన్నిటికన్నా ముఖ్యమని తనలో శాశ్వత నిశ్చయం రూపొందించిన సందర్భాలుగా వాటిని అభివర్ణించారు. ఆయన పెద్దవారవుతున్న కొద్దీ, ఈ తపన దేవుని కోసం తీవ్రమైన అన్వేషణగా మారింది. యుక్తవయసులో ఉండగానే ముకుందుడు హిమాలయాల్లో గొప్ప సాధువులు నివసిస్తున్నారని, వారు ఆధ్యాత్మిక సాక్షాత్కారం వైపు తనను నడిపించగలరని నమ్ముతూ అక్కడకు చేరుకోవడానికి అనేక దృఢమైన, కానీ విజయవంతం కాని ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయాణాలు బాహ్యంగా విజయవంతం కాకపోయినప్పటికీ, అవి ఆయన విశ్వాసాన్ని, సంకల్పాన్ని దృఢతరం చేశాయి.
పదిహేడేళ్ళ వయసప్పుడు 1910లో ఆయన ప్రార్థనలు ఫలించి, తన దైవనిర్ణీత గురువు అయిన స్వామి శ్రీయుక్తేశ్వర్‌ను కలుసుకున్నారు. కఠినమైనదే అయినప్పటికీ ఆయన ప్రేమపూర్వక మార్గదర్శకత్వంలో ముకుందుడు సంవత్సరాల తరబడి కఠోర ఆధ్యాత్మిక శిక్షణ పొందారు. విధేయత, ధ్యానం శరణాగతి ద్వారా, ఆయన తన జీవిత లక్ష్యం కోసం తయారయ్యారు. ఆ తర్వాత, సన్యాసం స్వీకరించి పరమహంస యోగానంద అనే పేరును పొందారు. భగవంతునితో ఏకత్వం ద్వారా పరమానందస్థితిని పొందడాన్ని ఈ పేరు సూచిస్తుంది.
మానవుని పోరాటం అంతా—లోతుగా చూస్తే—భగవంతుని కోసం అన్వేషణే అని యోగానంద బోధించారు. ఆయన ఇలా అన్నారు:
“మానవజాతి ‘ఇంకేదో’ తమకు ఆనందాన్నిస్తుందని, అది పరిపూర్ణము, అనంతము అయినదని భావిస్తూ ఒకానొక నిత్యాన్వేషణలో నిమగ్నమై ఉంది. భగవంతుణ్ణి వెతికి, కనుగొన్న ఆ వ్యక్తులకు అన్వేషణ పూర్తయింది: ఆ ఇంకేదో భగవంతుడే.”
తిరుపతిలో నూతన ధ్యాన మందిరం ప్రారంభించిన యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద
1917లో, శాస్త్రీయ ధ్యానం సమతుల్య ఆధ్యాత్మిక జీవనాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్)ను స్థాపించారు. 1920లో, ఆయన యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణించి, లాస్ ఏంజిలిస్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్)ను స్థాపించారు. ఈ రెండు సంస్థల ద్వారా, ఆయన ఉపన్యాసాలు, కేంద్రాలు గృహ అధ్యయన పాఠాల ద్వారా శక్తివంతమైన క్రియాయోగం, ధ్యానం గురించిన బోధనలను ప్రపంచమంతటికీ విస్తరింపచేశారు. 30 సంవత్సరాలకు పైగా, పరమహంస యోగానంద పశ్చిమ దేశాలలో, భగవంతునిపై భక్తి, క్రమబద్ధమైన ధ్యానం అన్ని నిజమైన మతాల ఐక్యతను నొక్కిచెబుతూ, అవిశ్రాంతంగా బోధించారు,. కేవలం విశ్వసించడమే కాకుండా, భగవంతుడిని నేరుగా అనుభూతి చెందమని ఆయన సాధకులను ప్రోత్సహించారు.
పరమహంస యోగానంద రచించిన ఆధ్యాత్మిక మహాగ్రంథం "ఒక యోగి ఆత్మకథ" లక్షలాది హృదయాలను స్పృశించి, ఆత్మలను ఈశ్వర సాక్షాత్కార మార్గం వైపునకు నిరంతరం ఆకర్షిస్తూ ఉంది. ఆయన రచనలు ప్రాచ్య, పాశ్చాత్య ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒకేలా ఉన్న సార్వత్రిక సత్యాలను మరింతగా వెల్లడిస్తాయి.
జనవరి 05, 2025న పరమహంస యోగానంద జయంతి సందర్భంగా, దివ్యమైన ఆయన మార్గదర్శనాన్ని కోరుకునే శ్రద్ధగల సాధకులు యోగానంద సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూనే ఉన్నారు. శాశ్వత ఆనందం కోసమైన అన్వేషణ—భక్తి, క్రమశిక్షణ, దైవ కృప ద్వారా—భగవంతుని యందే నెరవేరుతుందని ఆయన మనకు హామీ ఇస్తున్నారు.