భారతీయ కళా వైభవం చాలా గొప్పదని, భారతీయ సంస్కృతి సమాజం దిశను మార్చే శక్తిగా మార్గదర్శకంగా నిలవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ విద్యా విధానాల్లో భారతీయ కళలను పొందుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.హబ్సిగూడ లోని సుప్రభాత్ హోటల్లో సంస్కార భారతి జాతీయ సంగీత కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సకల కళా సంగమం’’ అన్న పేరుతో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంలో భారతీయ కళలను పొందుపరచాలని, భారతీయ కలలు వినోదం కోసమే కాదని, సామాజిక అంశాలతో ముడిపడి వుందన్నారు. విద్యార్థి దశ నుంచే సంగీతాన్ని చిన్నారులకు నేర్పించాలని, పాశ్చాత్య సంస్కృతి కారణంగా భారతీయ కలలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.హర్యానాలో కళలకు మంచి స్థానం వుందని, విజువల్ ఆర్ట్స్ పేరుతో అద్భుతంగా నిర్వహిస్తారన్నారు. ఇక్కడ కూడా ఆ స్థాయి రావాలని ఆకాంక్షించారు.
ఇక.. బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ సంస్కార భారతి చేస్తున్న సేవలను కొనియాడారు. కళాకారులను అందరూ గౌరవించాలని, కళలను ఆదరించాలన్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత కళాకారులను ఘనంగా సత్కరించారు.
ఇక.. సంస్కార భారతి జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు చెన్నారావు ఈ సందర్భంగా అతిథులకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. 60 సంవత్సరాలు నిండిన సంగీత కళాకారులకు పెన్షన్ వచ్చేలా చూడాలన్నారు. అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డులను ఇచ్చి, సంగీత కళాకారులను సత్కరించాలని, ఉగాది పురస్కారాలు అందించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అందులో కోరారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేకేవి శర్మ, ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు సుధాకర్ గాందే, భాజపా రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.