బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ ను దారుణంగా కొట్టి, చంపిన కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ యాసిన్ అరాఫత్ ను బంగ్లాదేశ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్థానిక మీడియా ప్రకారం అరాఫత్ ఈ దాడికి ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపింది. దీపుచంద్ర దాస్ హత్య తర్వాత మాజీ ఉపాధ్యాయుడు అరాఫత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే.. అరాఫత్ మూక హింసను బాగా ప్రేరేపించాడని, ఈ ఘటన జరగడానికి ప్రేరేపణగా స్థానిక ప్రజలను కూడా సమీకరించినట్లు పోలీసులు తెలిపారు.
దీనితో పాటు యాసిన్ అరాఫత్ స్థానికులను బాగా రెచ్చగొట్టాడని, దీపుచంద్ర దాస్ ను చౌరస్తాకి లాక్కుంటూ తెచ్చి, అతడ్ని కొట్టి, చెట్టుకు ఉరితీసి, తరువాత నిప్పంటిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరాఫత్ అరెస్టుతో, ఈ కేసుకు సంబంధించి మొత్తం అరెస్టు చేయబడిన వ్యక్తుల సంఖ్య 21 కి పెరిగింది. మరోవైపు దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
‘‘ఈ హత్యలో యాసిన్ ఇతరులతో కలిసి కీలక పాత్ర పోషించాడు. హత్య తర్వాత, అతను అజ్ఞాతంలోకి వెళ్లి 12 రోజులు సరులియాలోని వివిధ మదర్సాలలో వున్నాడు. అతను సుఫ్ఫా అనే మదర్సాలో ఉపాధ్యాయుడిగా కూడా చేరాడు"అని దర్యాప్తు పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో అరాఫత్ షేక్ బారి మసీదులో ఇమామ్ గా పనిచేశాడు.మదీనా తహ్ఫిజుల్ ఖురాన్ మదర్సాలో బోధించాడు.
డిసెంబర్ 18 న దీపుచంద్ర దాస్ పై ముస్లిం ఛాందసులు మూకదాడి చేసి, కొట్టి చంపేశారు. ఈ హత్య ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితుడిని కొట్టి, చెట్టుకు కట్టేసి, నిప్పంటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ ఓ బట్టల దుకాణంలో పనిచేసే దీపుచంద్ర దాస్.. మహ్మద్ ప్రవక్తను అవమానించాడని అభాండాలు మోపి మరీ చంపేసింది ఛాందసుల మూక.