బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసపై సాధు సంతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్కడి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను కూడా ఖండించారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ అశోక్ తివారీ తదితరులు ప్రముఖులైన సాధు సంతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే సాధు సంతులు బంగ్లాదేశ్ లోని హిందువుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వహిందూ పరిషత్ స్థాపన నుంచే సాధు సంతులు మార్గదర్శనం చేస్తున్నారని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడటానికి తమ సంస్థ పనిచేస్తోందన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ వేదికలపై హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని తాము ఎత్తి చూపుతూనే వున్నామన్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ తో సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందువులే లక్ష్యంగా ఛాందసులు దాడులకు దిగుతున్నారని, ఈ నేపథ్యంలోనే తమకు మార్గదర్శనం చేయాలని సాధు సంతులను కోరామని తెలిపారు.
సాధు సంతులు ఈ జాతికి, సంస్కృతికి ఆత్మ లాంటివారని, ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడులు బాధాకరమని, ఇది కేవలం హిందువులకు మాత్రమే బాధ కాదని, యావత్ ప్రపంచానికి బాధ అన్నారు. ఈ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రజా అవగాహన, సామాజిక ఐక్యత మరియు ఒత్తిడిని సృష్టించడానికి VHP నిరంతరం కృషి చేస్తుందన్నారు.
సాధువుల మార్గదర్శకత్వంలో సమాజంలోని వివిధ వర్గాలను అనుసంధానించడం ద్వారా అవగాహన ప్రచారాలు, సంభాషణ కార్యక్రమాలు మరియు వ్యవస్థీకృత ప్రయత్నాలను మరింత విస్తరించాలని కూడా నిర్ణయించామని తెలిపారు.