-సత్యకాశీ భార్గవ భారవి కొడవంటి
2024 జనవరి 22న అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కేవలం ఒక మతపరమైన కార్యక్రమమో లేక రాజకీయ కార్యక్రమమో కాదు. ఈ చారిత్రాత్మకమైన, అద్భుతమైన కార్యక్రమం గడిచిన వెయ్యి సంవత్సరముల భారతదేశ చరిత్రలోనే అత్యంత ఉత్కృష్టమైనది అని చెప్పవచ్చు.
ఒకవిధంగా చెప్పాలంటే అయోధ్యరామమందిరం ముందు, అయోధ్య రామమందిరం తర్వాత అని భారతదేశ పురోగతిని చూడవచ్చు.ఇంతవరకు భారతదేశమునకు పరిపాలనా రాజధాని న్యూఢిల్లీ అయితే ముంబై భారతదేశ వ్యాపార రాజధానిగా, కాశీ భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరెన్నికగన్నవి.
ఇప్పుడు అయోధ్య భారతదేశపు సాంస్కృతిక, ధార్మిక, వారసత్వ రాజధాని అని అనడం పరమసత్యము.
భారతదేశపు సాంస్కృతిక కేంద్రం అయోధ్య అని అనడానికి కారణం -అనాదిగా భారతదేశమును జాతుల వారీగా, మతాలవారీగా, కులాలవారీగా, వర్గాలవారీగా, భాషలవారీగా, ప్రాంతాలవారీగా, ఇంకా ఆనేకరకాలుగా విభజిస్తూనే వస్తున్నారు, ఇన్ని భేదాలు ఉన్నా కూడా 140 కోట్ల భారతీయులను కలిపి ఉంచే ఒకానొక అదృశ్య శక్తి -సంస్కృతి, అలాంటి సంస్కృతికి మొత్తం భారతదేశంలో ఒకేఒక రూపంగా ఉన్నది శ్రీరాముడు అని చెప్పవచ్చును కేవలం భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకూ శ్రీరాముడు ఒక సాంస్కృతిక వారధి.కనుక అలాంటి శ్రీరాముడు జన్మించిన, సేవించిన, పాలించిన నగరం అయోధ్య.
ముఖ్యంగా 550 సంవత్సరాల తర్వాత భారతీయులకు దక్కిన శ్రీరామజన్మభూమి మందిరం ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యకి మకుటంలా, మొత్తం భారతదేశానికి హృదయంలా భాసిస్తుంది. శ్రీరామజన్మభూమి మందిరం కొలువైవున్న అయోధ్య మొత్తం భారతదేశానికి సాంస్కృతిక వైభవం తీసుకొచ్చింది అని అనడం అతిశయోక్తి కానేకాదు. ఇందుకు, గడిచిన సంవత్సరంలో అయోధ్యను సందర్శించిన 14 కోట్ల మంది రామభక్తులే పెద్ద సాక్ష్యము.అయోధ్యలో బాలరాముడు కొలువుతీరిన తరువాత మొత్తం భారతదేశంలో జరిగిన లక్షల రామకార్యాలు, లక్షల రామ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి.అంతేకాదు అనాదిగా భారతదేశంలో ప్రతీ వాడలో, ప్రతీ గ్రామంలో రాముడి గుడి ఉండి తీరుతుంది.
ఎందుకంటే భారతీయుల ఆరాధ్య దైవం శ్రీ సీతారాములు. సీతారాములు భారతీయుల కుటుంబ సభ్యులు,అన్ని భారతదేశ భాషలలో రామాయణం వ్రాయని కవి, రామాయణం చెప్పని ప్రవచనకర్త, రామాయణం వేయని నాటక సమాజం,రామాయణం చదవని పాఠకుడు, రామాయణం వినని శ్రోత, రామాయణం చూడని ప్రేక్షకుడు, రామాయణం తెలియని పౌరుడు అసలు లేడు అంటే దాని అర్థం శ్రీరాముడు భారతీయుల జీవితాలలో ఒక అంతర్భాగం అని తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే శ్రీరాముడు భారతదేశపు ఆత్మ, శ్రీరాముడు భారతీయుల జీవనాడి. చతుష్షష్టి కళలలో శ్రీరాముడి గురించి ప్రస్తావించని కళ లేదు.మన సంస్కృతిలో కళలు అత్యంత ముఖ్యమైన అంతర్భాగం. కనుక శ్రీరాముడే భారతీయుల సంస్కృతికి కేంద్రం. కనుక శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య భారతదేశపు సాంస్కృతిక రాజధాని అనడం పరమ సత్యం.
ఇక అయోధ్యను భారతదేశపు వారసత్వ రాజధాని అని కూడా అనొచ్చు. ఎందుకంటే శ్రీరాముడు భారతదేశపు చరిత్ర,మనం శ్రీరాముడి వారసులం. శ్రీరాముడు మన భారతీయులకు వారసత్వ సంపద. అలాంటి శ్రీరాముడి జన్మభూమి అయోధ్య భారతీయులకు వారసత్వ రాజధాని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. భారతదేశంలో ఇంకా అనేకానేక దివ్యక్షేత్రాలు,భవ్య ప్రదేశాలు ఉన్నా కూడా అయోధ్య మన వారసత్వ రాజధాని అని అనడం వెనుక ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. శ్రీరాముడు కేవలం మానవజాతికోసం మాత్రమే, మానవాళికి మార్గనిర్దేశనం చేయడం కోసం అవతరించాడు.అలాంటి శ్రీరాముడి వారసులమైన మనకు వారసత్వ హక్కుగా దక్కిన మహోన్నత సంపద అయోధ్య. కనుక అయోధ్య భారతదేశపు వారసత్వ రాజధాని అనడం నూటికి నూరుపాళ్ళు సత్యము.
ఇక అయోధ్య భారతదేశపు ధార్మిక రాజధాని ఎలా అనవచ్చో చూద్దాం. భారతదేశం &సనాతన ధర్మము ఒకటే. సనాతన ధర్మ జీవనాన్ని అనుసరించే వారే భారతీయులు. వారు నివసించే భూమి భారతదేశం. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? మానవుడిగా పుట్టినందుకు మనం చేయాల్సింది ఒక్కటే,మన జీవిత పరమావధి ఒక్కటే- ఆ భగవంతుడిని చేరుకోవడం. మానవులు దైవాన్ని చేరడంకోసం ఎలా జీవించాలో మహర్షులు తపస్సు లో దర్శించి, వాళ్ల చేత ప్రతిపాదించబడిన జీవనవిధానమే ధర్మం.'రామో విగ్రహవాన్ ధర్మః' అంటారు, అంటే శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపం.శ్రీరాముడు ఆచరించినదే ధర్మం,మనకు ధర్మం విషయంలో ఏ సందేహం వచ్చినా సరే ఆ సందర్భంలో రాముడు ఏమిచేసాడో మనం కూడా అలా చెయ్యడమే ధర్మం.కనుక రాముడు మన పాలిట ధర్మ దిక్సూచి అనొచ్చు. అలాంటి ధర్మ స్వరూపుడైన శ్రీరాముడి జన్మభూమి అయోధ్య భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే ధార్మిక రాజధాని అని చెప్పవచ్చు.
చివరగా అయోధ్య మన భారతదేశానికి ధార్మిక, సాంస్కృతిక, వారసత్వ రాజధాని అని ప్రతీ భారతీయుడూ మనసా వాచా కర్మణా భావించవచ్చు.