న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం నిర్ణయంపై విమర్శలు వస్తున్న వేళ ఈసీకి భారీగా మద్దతు లభించింది. 124 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, అనుబంధ సర్వీసుల అధికారులు బహిరంగ లేఖ రాశారు. సర్ ప్రక్రియను కూడా ఈ లేఖలో సమర్థించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలు చేయడాన్ని వారు తప్పుబట్టారు.
సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయటం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా హితవు పలికారు. తాము ఏ పార్టీకి కూడా చెందిన వారం కాదని, ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఎన్నికల వ్యవస్థపై పదే పదే ఆరోపణల దాడి జరుగుతున్నందునే ఈ లేఖ రాయాల్సి వస్తోందని కూడా స్పష్టం చేశారు.ఎలాంటి సాక్ష్యాలు లేకుండా జరుగుతున్న ఈ విమర్శల దాడులు మనమంతా విశ్వసించే ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రిగ్గింగ్ ఎన్నికలు ఎలా వుంటాయో కూడా తమకు బాగా తెలుసని, ఓటర్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు తరిమేసి బ్యాలెట్ బాక్సులను అపహరించిన కాలంలో తాము ఉద్యోగాలు చేశామని కూడా పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలను చాలామంది సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ, మేము విధి నిర్వహణలో చూశాము. పోలింగ్ బూత్‌ల ఆక్రమణను నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు 1989లో చట్టం చేసేవరకు బూత్‌ల ఆక్రమణ సర్వసాధారణంగా ఉండేది. హింస రాజ్యమేలుతుంటే.. ప్రజాస్వామ్యం మౌనంగా ఉండిపోయేది. సమర్థవంతమైనఎన్నికల నిర్వహణకు 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ అంటూ పేర్కొన్నారు.