తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు, విశిష్ట జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని దైవంగా భావించి, రంగురంగుల పూలతో జగన్మాతను పూజించే ఈ మహోత్సవం ఆడపడుచుల ఆనందోత్సాహాల కలబోత. భాద్రపద బహుళ అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగుతాయి. వర్షాకాలం ముగిసి భూమి పచ్చదనంతో నిండిన సమయంలో తంగేడు, గునుగు, చామంతి, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చి, చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ గౌరమ్మను కొలుస్తారు.
ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాల ఆధారంగానే ఆయా రోజులకు ప్రత్యేకమైన పేర్లు వచ్చాయి.
మొదటి రోజైన మహాలయ అమావాస్య రోజున పూలను కోసేసరికి వాటిని అంతకుముందే దేవునికి లేదా పితృలకు సమర్పించి ఉంటారనే భావంతో ఆ పూలను 'ఎంగిలి పూలు' అంటారు. అందువల్ల ఈ రోజును ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు అమ్మవారికి నువ్వులు, పప్పుబెల్లం, నూకలను నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా వండుతారు కాబట్టి దీనిని అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు సప్పిడి అటుకులు, బెల్లం లేదా పప్పులు కలిపిన అటుకులను ప్రసాదంగా పెడతారు.
మూడో రోజైన విదియ తిథి నాడు వంటకాల్లో ముద్దపప్పుకు ప్రాధాన్యతనిచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజు ముద్దపప్పును ప్రధానంగా తయారు చేయడం వల్ల ఈ రోజును ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు ముద్దపప్పుతో పాటు పాలు , బెల్లం నైవేద్యంగా ఉంచుతారు.
నాల్గవ రోజైన తదియ నాడు బియ్యాన్ని ముందుగా నీటిలో నానబెట్టి, ఆ నానబెట్టిన బియ్యాన్ని బెల్లంతో కలిపి ప్రసాదంగా తయారుచేస్తారు. బియ్యాన్ని నానబెట్టి నైవేద్యం పెట్టడం వల్ల దీనికి నానబియ్యం బతుకమ్మ అనే పేరు వచ్చింది.
ఐదో రోజైన చతుర్థి తిథి నాడు అట్లను అనగా దోసెలను నైవేద్యంగా వండుతారు. బియ్యం పిండితో అట్లు పోసి అమ్మవారికి నివేదించడం ఆచారం కావడంతో ఈ రోజును అట్ల బతుకమ్మ అంటారు.
ఆరో రోజైన పంచమి నాడు అమ్మవారు అలిగారు అని నమ్ముతారు. గౌరమ్మ అలకబూనిన రోజు కావడంతో ఈ రోజు ఎలాంటి కొత్త పూల పేర్పు ఉండదు. కేవలం అమ్మవారికి ఇష్టమైన రీతిలో పూజ మాత్రమే చేసి ప్రత్యేక నైవేద్యాలు ఏమీ పెట్టరు. అందుకే దీనిని అలిగిన బతుకమ్మ అంటారు.
ఏడో రోజైన షష్ఠి తిథి నాడు బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చిన్న ఉండలుగా చేసి, వాటిని నూనెలో వేయిస్తారు. వేపకాయల రూపంలో ప్రసాదం తయారు చేయడం వల్ల దీనికి వేపకాయల బతుకమ్మ అని పేరు వచ్చింది.
ఎనిమిదో రోజైన సప్తమి నాడు శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్నను అమ్మవారికి నివేదిస్తారు. స్వచ్ఛమైన వెన్నముద్దలను ప్రసాదంగా సమర్పించడం వల్ల ఈ రోజును వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజు వెన్నముద్దలు, నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదం పెడతారు.
తొమ్మిదో రోజైన ఆశ్వయుజ అష్టమి అనగా దుర్గాష్టమి నాడు ఈ మహోత్సవం ముగుస్తుంది. ఈ రోజు వివిధ రకాల ప్రసాదాలను అనగా పెరుగు అన్నం, పులిహోర, కొబ్బరన్నం వంటి ఐదు రకాల సద్దులను భారీ ఎత్తున తయారుచేస్తారు. రకరకాల సద్దులను సమర్పించడం వల్ల దీనికి సద్ధుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పేరు వచ్చింది.
ప్రకృతి జీవులకు జీవనాధారమని, పూలు, చెట్లు, నీరు మన సంస్కృతిలో భాగమని చాటిచెప్పే గొప్ప పండుగ ఇది. బతుకమ్మకు సమర్పించే ప్రతి నైవేద్యం వర్షాకాలం ముగిసే సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తాయి. ఆడపడుచుల ఆనందానికి, ప్రకృతి సౌందర్యానికి నిలువుటద్దమైన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ,సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది