జగన్మాత స్వరూపాలు బాలికలు: శరన్నవరాత్రులలో కన్యాపూజ

VSK Telangana    13-Oct-2026
Total Views |
 
kanya pooja
 
భారతీయ సనాతన ధర్మంలో ఆడపిల్లను సాక్షాత్తు పరాశక్తి అవతారంగా, సకల మంగళాలకు నిలయమైన లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. దేవీ శరన్నవరాత్రులు, దుర్గాష్టమి, మహానవమి వేళల్లో నిర్వహించే కన్యాపూజ లేదా బాలికా పూజ ఈ దివ్య భావనకు ప్రత్యక్ష రూపం. స్త్రీ శక్తే జగత్తుకు మూలమని, చిన్నారులలోని నిష్కల్మషమైన మనస్సులోనే భగవత్ప్రీతి దాగి ఉందని నిరూపించే అత్యున్నత ధార్మిక ప్రక్రియ ఇది.
 
 
 
ఏకవర్షా భవేద్దాసీ ద్వివర్షా తు భవేత్ కుమారీ।
త్రివర్షా త్రిమూర్తిశ్చ చతుర్వర్షా తు కల్యాణీ॥
పంచవర్షా భవేద్రోహిణీ షడ్వర్షా కాళికా స్మృతా।
సప్తవర్షా భవేచ్చండికా అష్టవర్షా తు శాంభవీ॥
నవవర్షా భవేద్దుర్గా దశవర్షా తు సుభద్రా।
అతో ఊర్థ్వం న పూజ్యాః స్యుః సర్వకార్యేషు సర్వదా॥
 
 
దేవీ భాగవతం ప్రకారం రెండు నుండి పది సంవత్సరాల వయస్సు గల బాలికలను వివిధ శక్తులుగా భావించి పూజిస్తారు. రెండు సంవత్సరాల బాలికను 'కుమారి' (దారిద్య్ర నాశిని), మూడు సంవత్సరాల బాలికను 'త్రిమూర్తి' (ధర్మ, అర్థ, కామ ప్రదాత), నాలుగు సంవత్సరాల బాలికను 'కల్యాణి' (సర్వకామ ప్రదాత), ఐదు సంవత్సరాల బాలికను 'రోహిణి' (రోగ నివారిణి), ఆరు సంవత్సరాల బాలికను 'కాళిక' (శత్రు నాశిని), ఏడు సంవత్సరాల బాలికను 'చండిక' (ఐశ్వర్య ప్రదాత), ఎనిమిది సంవత్సరాల బాలికను 'శాంభవి' (జ్ఞాన ప్రదాత), తొమ్మిది సంవత్సరాల బాలికను 'దుర్గ' (ఆపత్నివారిణి), పది సంవత్సరాల బాలికను 'సుభద్ర' (శుభప్రదాత) అని ఆరాధిస్తారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలను పూజకు ఎన్నుకోకూడదు.
 
 
నేపాల్ దేవత 'కుమారి' పూజా సంప్రదాయం
 
భారతదేశంతో పాటు పొరుగున ఉన్న నేపాల్ దేశంలో కన్యాపూజ అత్యంత విశిష్టమైన చరిత్ర కలిగి ఉంది... అక్కడ కన్యాపూజ కేవలం ఒక రోజు జరిగే క్రతువు మాత్రమే కాకుండా, బాలికను సాక్షాత్తు తలేజు భవాని (దుర్గాదేవి) రూపంగా భావించి 'జీవించి ఉన్న దేవత' (Living Goddess) కొలిచే అద్భుతమైన సంప్రదాయం ఉంది. కఠ్మాండు లోయలో మల్లా రాజుల కాలం నుండి ఈ ఆచారం కొనసాగుతోంది. అందుకోసం బాలికలలో దేవత అయ్యే లక్షణాలు, జాతకబలం కలిగిన చిన్నారిని పవిత్రమైన శాక్య లేదా బజ్రాచార్య వంశం నుండి ఎంపిక చేసి, ఆమెను ప్రత్యేక భవనంలో (కుమారి ఘర్) ఉంచి దేశ ప్రజలు రోజూ పూజిస్తారు. ఇంద్ర జాత్ర వంటి పండుగలలో ఈ చిన్నారిని రథంపై ఊరేగిస్తూ, రాజకీయ నాయకులు, సామాన్యులు ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. బాలికకు మొదటిసారి రక్తస్రావం (ఋతుమతి కావడం) అయ్యే వరకు ఈ పూజ కొనసాగుతుంది
 
 
శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ఆచరణ
 
 
ఆధునిక యుగంలో స్త్రీలలోని దైవత్వాన్ని లోకానికి చాటిన మహనీయులు శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. శ్రీరామకృష్ణులు ప్రతి ఆడదానిలోనూ జగజ్జనని రూపాన్ని దర్శించారు. 1872లో వారు తమ ధర్మపత్ని శ్రీ శారదాదేవిని జగన్మాత పీఠంపై ఆసీనురాలిని చేసి షోడశీ పూజ నిర్వహించారు. వారి ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద 1901లో కోల్‌కతాలోని బేలూర్ మఠంలో కుమారీ పూజను అధికారికంగా, అత్యంత వైభవంగా ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా చిన్నారి బాలికలను ఆహ్వానించి, వారి పాదాలు కడిగి సాక్షాత్తు దేవిగా పూజించి నూతన వస్త్రాలు సమర్పించారు. "స్త్రీ శక్తిని గౌరవించని దేశం ఎన్నటికీ పురోగమించలేదు" అని వివేకానందుడు బలంగా నమ్మారు.
 
 
కన్యాపూజ నిర్వహణ, హిందూ ధర్మ విశిష్టత
 
 
కన్యాపూజ నిర్వహణలో భాగంగా నిర్ణీత వయస్సు గల బాలికలను భక్తిశ్రద్ధలతో ఇంటికి ఆహ్వానించి, పీఠంపై కూర్చోబెట్టి వారి పాదాలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజించి, వారికి ఇష్టమైన తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించి, నూతన వస్త్రాలు, కానుకలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అనే సనాతన ధర్మ సూత్రం ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని మన సంస్కృతి చాటుతుంది. ఈ పూజ కేవలం ఒక క్రతువు మాత్రమే కాకుండా, సమాజంలో స్త్రీ మూర్తి పట్ల, ఆడపిల్లల పట్ల పూజ్యభావం, రక్షణ, గౌరవం పెంపొందించే ఒక మహోన్నతమైన సంస్కారం