కొత్తగూడెంలో గిరిజన యువకుడి అనుమానాస్పద మృతి.. కాంగ్రెస్ నేతపై ఆరోపణలు

VSK Telangana    14-Oct-2026
Total Views |
 
KTDM
 
కొత్తగూడెం జిల్లాలోని కారకగూడెం మండలం కలవల నాగారంలో ఓ గిరిజన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుడిని కాపాడేందుకు ఒక కాంగ్రెస్ నేత ప్రయత్నిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు.
 
మృతుడు బడవత్ రవిచంద్ర (28) సోమవారం గ్రామ శివారులోని ఒక ఖాళీ స్థలంలో విగతజీవుడిగా పడి ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్‌ను ఆయన బంధువులు నిలదీస్తూ, నిందితుడిని రక్షించేందుకు ఆయన యత్నిస్తున్నారని ఆరోపించారు.
 
అతని వాహనంపై దాడి చేయడానికి ప్రయత్నాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు, దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్యకు పాల్పడిన నిందితుడు ఇమ్రాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కారకగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.
 
తనపై వస్తున్న ఆరోపణలపై ఇక్బాల్ హుస్సేన్ స్పందిస్తూ, రవిచంద్ర మృతికి తనకూ, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొద్దిమంది నేతల మాటల ఆధారంగా తనపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.
 
ఇదిలా ఉండగా, రవిచంద్రను బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేశారని కొత్తగూడెం జిల్లా సేవలాల్ సేన అధ్యక్షుడు దారావత్ సురేష్ ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.