కలకత్తా : ప్రెసిడెన్సీ విశ్వ విద్యాలయంలో వున్న స్వామి వివేకానంద చిత్ర పటాన్ని దుండగులు పాడు చేశారు. పోస్టర్ ను వికృతం చేయడంతో పాటు స్వామి వివేకానంద పోస్టర్ పై అభ్యంతరకరమైన రాతలు కూడా రాశారు. దీంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కలకత్తా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ స్థలంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలను ఉద్దేశించి, అవమానకరమైన రాతలు కూడా రాసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలకత్తా ఏబీవీపీ నగర కార్యదర్శి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద పోస్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు పాడుచేశారని, అభ్యంతరకరమైన రాతలు కూడా రాశారని మండిపడ్డారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం చారిత్రాత్మక ప్రధాన భవనం మరియు దాని పరిసర ప్రాంతాలలో స్వామి వివేకానంద చిత్రాలపై “రేపిస్ట్”, “చెత్త వేయండి” వంటి అభ్యంతరకర పదాలను ఉపయోగించడాన్ని ఏబీవీపీ బెంగాల్ ఒక సోషల్ మీడియా ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించింది.
స్వామి వివేకానందకు దేశవ్యాప్తంగా విస్తృతమైన గౌరవం ఉందని పేర్కొంటూ, ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది విద్యార్థి సంఘం. ఈ చర్య భారతదేశపు పూజ్య జాతీయ నాయకుల పట్ల తీవ్ర అభ్యంతరకరమైన వైఖరిని ప్రతిబింబిస్తుందని అది పేర్కొంది.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, అలాగే విశ్వవిద్యాలయం శాంతియుత, గౌరవప్రదమైన మరియు సామరస్యపూర్వకమైన విద్యా వాతావరణాన్ని కొనసాగించేలా చూడాలని ఆ ఫిర్యాదులో అధికారులను కోరారు.