డా. హెడ్గేవార్ 1925 లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. యావత్ హిందూ సమాజ సంఘటన, వ్యక్తిత్వ నిర్మాణం కోసం సంఘ్ ను ప్రారంభించారు. అయితే.. ప్రతి హిందువునూ సంఘటనలో అంతర్భాగం చేయాలన్నదే డాక్టర్జీ ప్రగాఢ సంకల్పం. ఈ విషయంలో డాక్టర్జీ మొదటి నుంచి కూడా ఇలా బోధించేవారు ‘‘మనం పని చేస్తున్నది హిందూ సమాజం అంతటి కోసం. కనుక ఏ ఒక్కరినీ విస్మరించకూడదు. హిందూ బంధువులందరి పట్లా మన ప్రవర్తన ఒకేలా వుండాలి. ప్రేమతో కూడినదై వుండాలి. హిందూ బంధువులలో ఏ ఒక్కరినైనా నీచునిగా భావించి, ఈసడించుకోవడం మహాపాపం. ముఖ్యంగా స్వయంసేవకుల మనస్సులలో ఇలాంటి సంకుచిత భావం వుండనే కూడదు. దేశాన్ని ప్రేమించే ప్రతి హిందువునూ మన సొంత అన్నదమ్మునిలాగానే చూసుకోవాలి. మన ప్రవర్తన ఆదర్శవంతంగా వుంటే మన హిందూ బంధువులందరూ మనవైపు ఆకర్షితులవుతారు. ఈ ఒరవడిలో సంఘం సామాజిక సమరసత వైపు అడుగులు వేస్తుంది’’ అని చెప్పేవారు.
సంఘ్ ఓ సజీవ సంస్థ అని డాక్టర్జీ చెప్పేవారు. సజీవంగా వుండటం అంటే జీవరసాన్ని గ్రహించి,ఎదగడం. సహజంగా వికాసం పొందడం. సంఘ సిద్ధాంతం కమ్యూనిస్టు, ఇస్లాం, క్రైస్తవ మతాల లాగా ఓ చట్రంలో బిగించబడిన ‘‘వాదం ’ కానేకాదు. డాక్టర్జీ గాని, గురూజీ గాని ఏదో ఒక ప్రత్యేక పరిస్థితిలో, ప్రత్యేక సందర్భంలో చెప్పిన మాటలను అనుశాసనంగా భావించి, మారిన పరిస్థితులలో, మారిన సందర్భాలలో కొత్త కొత్త ఆలోచనలు చేయకూడదన్నది సంఘం పద్ధతి కానే కాదు.
డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించిన సమయంలో భారత్ లో విదేశీ పాలన వుండేది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. అలాగే జాగ్రత్తగా నడుచుకునేవారు. ఆనాడు చెప్పడానికి సాధ్యం కాని మాటలు, ఇప్పుడు చెప్పవచ్చు. సంఘాన్ని ప్రారంభించినప్పుడు డాక్టర్జీ తన కళ్ల ఎదుట నిలుపుకున్న జీవన ఆదర్శాల నుంచి, ఆయన చెప్పిన మూల సూత్రాల నుంచీ సంఘం ఆవగింజంతైనా పక్కకు జరగదు. ఎందుకంటే అవి జాతికి మూల సూత్రాలు. సంస్థ ధ్యేయాన్నీ, పటిష్ఠతనూ, ప్రగతిని అడుగడుగునా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఆ ఉద్దేశాలను సాధించడానికి రూపొందించే కార్యక్రమాలలో పట్టువిడుపులు వుండొచ్చు. అది లేకపోతే సజీవ సంస్థ అని అన్న డాక్టర్జీ వర్ణనకు అర్థమే వుండదు.