విద్యార్థుల మెడలోంచి బలవంతంగా మాల తీసేయించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు చేసిన పోలీసులు

VSK Telangana    16-Oct-2026
Total Views |
 
tn
 
చెన్నై : తిరుచెందూరులో మాల వేసుకొని పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను మాల తొలగించమను ప్రిన్సిపాల్ తెగ బలవంతం చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో ప్రిన్సిపాల్ రంజిత్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
హిందూ విద్యార్థులు ధరించిన పవిత్ర మాలలను, మణికట్టు దారాలను ఆయన బలవంతంగా తొలగించారనే ఆరోపణలు రావడంతో, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అక్టోబర్ 11న ప్రారంభమైన కులశేఖరపట్టినం దసరా ఉత్సవాల సందర్భంగా, ముత్తురామ్మన్ ఆలయంలో నిర్వహించే 10 రోజుల దీక్ష మరియు వ్రతంలో భాగంగా విద్యార్థులు మాల ధరించి, పవిత్రమైన దారాలను కూడా ధరించారు. వీటన్నింటిని తొలగించాలని ప్రిన్సిపాల్ పదే పదే ఒత్తిడి తెచ్చారు.
 
స్థానిక సంప్రదాయాల ప్రకారం కులశేఖరపట్టినం దసరా ఉత్సవాల సందర్భంగా, ముత్తురామ్మన్ ఆలయంలో నిర్వహించే 10 రోజుల దీక్ష, వ్రతంలో భాగంగా విద్యార్థులు మాల ధరించి, దారాలు కట్టుకుంటారు. ఈ పండుగ సమయంలో, మొక్కులు చెల్లించుకునే భక్తులు దేవతలు, యముడు, హాస్య పాత్రలు మరియు ఇతర మతపరమైన పాత్రల వేషధారణలతో ఊరేగింపుల్లో పాల్గొని, ప్రజల నుండి భిక్షను స్వీకరిస్తారు.
 
అయితే.. విద్యార్థులు ధరించిన దారాలను, మాలను వారే తొలగించాలని, లేదంటే తాను తీసేయాల్సి వస్తుందంటూ ప్రిన్సిపాల్ రంజిత్ సింగ్ బెదిరింపులకు దిగాడు. దీంతో విద్యార్థులు భయం భయంతో వాటిని తీసేశారు. అంతేకాకుండా మోదట్లో తన ఆదేశాలను ధిక్కరించినందుకు విద్యార్థులను ప్రిన్సిపాల్ కొట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.