మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు మరో సారి స్పష్టం చేసింది. హిందూ మతంలోని కొన్ని సామాజిక వర్గాల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతుల ముస్లిం రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక, తాజాగా ఈ తీర్పు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హిందూ కుల వ్యవస్థతో ముడిపడి వున్న సామాజిక వెనుకబాటుతనం అనేది మతం మారిన తర్వాత ఇతర మతాల్లోకి లేదా సామాజిక వ్యవస్థల్లోకి దానంతట అదే రాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే హైకోర్టు ఈ తీర్పునిచ్చిందని సుప్రీం తెలిపింది.
2024 లో ఇచ్చిన జీవోతో వివాదం మొదలు..
తమిళనాడు ప్రభుత్వం మార్చి 2024 లో ఓ జీవో ఇచ్చింది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారు వెనుకబడిన తరగతుల ముస్లిం కేటగిరీ కింద కమ్యూనిటీ సర్టిఫికేట్లు పొంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందవచ్చని ఆ జీవోలో పేర్కొంది. అయితే, ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ, మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ తీర్పునివ్వడంతో తమిళనాడు ప్రభుత్వం జూలై 6 న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్ తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
అయితే.. ఇంతకీ సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న ముఖ్య అంశం ఏమిటంటే.. ఓ వ్యక్తి ఇస్లాంలోకి మారినంత మాత్రాన ఆ మతంలో ప్రభుత్వం గుర్తించిన ఏడు వెనుకబడిన వర్గాలలో ఓ సభ్యునిగా మారిపోలేడు. గతంలో కుల స్థితిని మతం మారిన తర్వాత వర్తించే ముస్లిం వెనుకబడిన తరగతి కేటగిరీకి బదిలీ చేయడం చట్టపరంగా చెల్లదు. అలాగే ఏ ప్రైవేట్ మత సంస్థ కూడా ఈహోదాను నిర్ఱయించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్ ప్రయోజనాలను, మునుపటి సామాజిక వెనుకబాటుతనాన్ని కారణంగా చూపి కొత్త మతంలో డిమాండ్ చేయడానికి వీల్లేదని కూడా ధర్మాసనం తీర్పునిచ్చింది.
రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం కేవలం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వ్యక్తులే షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి అర్హులని న్యాయస్థానం గుర్తు చేసింది. కాబట్టి ఆ మతాలు కాకుండా ఇస్లాం, క్రైస్తవం వంటి ఇతర మతాల్లోకి మారిన వెంటనే వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, ఆ హోదా ఆధారంగా లభించే ఎలాంటి ప్రభుత్వ రిజర్వేషన్ ప్రయోజనాలనూ పొందలేరని వెల్లడించింది.
అంతేకాకుండా ఎవరైనా ఇతర మతం నుంచి తిరిగి హిందూ మతంలోకి మారిన సందర్భంలో కూడా రిజర్వేషన్లు వాటంతట అవే పునరుద్ధరించబడవని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి వ్యక్తులకు మునుపటి సామాజిక హోదా వాస్తవంగా పునరుద్ధరించబడిందా లేదా అనేది క్షేత్ర స్థాయి వాస్తవాల ఆధారంగా స్వతంత్రంగా నిర్ధారించాల్సి వుంటుందని కోర్టు పేర్కొంది.