సంచార జాతుల సంక్షేమ సమితి మార్గదర్శకత్వంలో సీతాఫల్ మండిలోని పర్ధీవవాడ సేవా బస్తీలో కుమారి పూజ నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బాలికలకు కుమారి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది చిన్నారులకు కొత్త దుస్తులను పంపిణీ చేశారు. చిన్నారులంతా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటూ, భజనలను కూడా ఆలాపించారు.
ఈ సందర్భంగా ప్రచారక్ సువీర్ మాట్లాడుతూ మారి పూజ మన హిందూ సంస్కృతిలో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన సంప్రదాయమని వివరించారు. దసరా నవరాత్రుల సమయంలో బాలికలను ఆదిశక్తి స్వరూపాలుగా భావించి, వారికి పసుపు, కుంకుమ సమర్పించి, కొత్త వస్త్రాలను అందించి పూజించడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు. బాలికలలో అమ్మవారిని దర్శించి పూజించడం ద్వారా మహిళల పట్ల మన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తామని, హిందూ సంప్రదాయంలో మహిళలకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ, తల్లిదండ్రులను మించిన దైవం ఈ లోకంలో మరొకరు లేరని ఉద్బోధించారు. తల్లిదండ్రులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వారి మాటలను గౌరవించి, వారి పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలని పిల్లలకు సూచించారు.
చిన్నారుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో, భక్తిపూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హిందూ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు మహిళల పట్ల గౌరవభావాన్ని, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలను పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.