సంఘ్ కార్యం దైవకార్యం.. అడుగడుగునా కనిపించేది ఇదే

VSK Telangana    18-Oct-2026
Total Views |
 
DR
 
మన భారత దేశానికి మూలం ఆధ్యాత్మికతే. దీని తర్వాతే భౌతిక జీవనం వైపు ఆలోచిస్తాం. ఆధ్యాత్మిక జీవనం ద్వారానే భౌతిక జీవనం మెరుగుపడింది. దీనికి ఎన్నో ఉదాహరణల ద్వారా ఈ సత్యం ఆర్ఎస్ఎస్ స్థాపకులు డా. హెడ్గేవార్ దృష్టికి కూడా వచ్చింది.బుద్ధుడు ధర్మ జాగరణ చేశాడు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆది శంకరులు వైదిక ధర్మం యొక్క విజయ పతాకను అన్ని వైపులా ఎగరేశారు. ఆ తర్వాత స్వర్ణ యుగం వచ్చింది. మాధవ విద్యారణ్య స్వామి చేసిన ధార్మిక జాగరణ ఆధరంగా విజయ నగర సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగింది. అలాగే మహారాష్ట్రలో కూడా సాధు సంతులు ధార్మిక జాగరణ సాగించారు. శివాజీ మహారాజు నాయకత్వం దేశానికి లభించింది. గురునానక్ పంజాబులో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించారు. ధర్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టాలనే ప్రేరణ చివరి అయిదుగురు గురువులకు ఆయన నుంచి లభించింది. ఆ కారణంగా హిందూ ధర్మ రక్షణ కోసం ముస్లిం దురాక్రమణదారులతో జరిగిన యుద్ధాలలో మహత్తర త్యాగ, బలిదానాలతో నిండిన కొత్త పుట చరిత్రలో తెరుచుకుంది.
 
దయానంద మహర్షి, పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, యోగి అరవిందులు, రమణులు, ఆధునికంగా సద్గురు శివానంద మూర్తి వంటి ఆధ్యాత్మిక విభూతులు జాతిలోని జీవశక్తిని మెల్కొలిపారు. జాతిలో చైతన్యం పొంగిపొర్లింది.
 
డాక్టర్ హెడ్గేవార్ సరిగ్గా ఈ జీవ నాడినే పట్టుకున్నారు. ధర్మ సంస్కృతుల రక్షణకు స్వాతంత్రం, సంఘటన, శక్తి తప్పనిసరిగా వుండాలని చెప్పారు. దీని కోసం మనుషులను కలవడం, వారిని సంఘటనగా తీర్చిదిద్దడం తన జీవన కార్యంగా చేసుకున్నారు. మహా పురుషులు చూపిన ఆదర్శాలను సఫలం చేయడానికి అనుకూల పరిస్థితిని నిర్మించడమే ఈ పని యొక్క అసలు ఉద్దేశం. సంఘ ప్రతిజ్ఞలో, సంఘ ప్రార్థనలో, డాక్టర్జీ ప్రసంగాలలో ఈ లక్షణం అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతిజ్ఞలో ప్రారంభంలోనే సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని స్మరణ వుంది. ప్రార్థనలో పరమేశ్వరుని శుభాశీస్సులు కోరారు. ‘‘త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం’’.. నీ పని కోసమే మేం నడుం బిగించాం’’ అని స్వయంసేవకులు అందరూ ప్రార్థన ద్వారా పరమేశ్వరుని ముందు ఈ నిశ్చయాన్నే మళ్లీ ప్రకటిస్తున్నారు. అభ్యుదయ నిశ్రేయసులు అనగా భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతులు రెండూ అవసరమేనని హిందూ ధర్మం చెబుతోంది.
 
అలాగే ప్రార్థనలో ‘‘పరం వైభవం’’ అనే చోటదీన్ని పేర్కొన్నారు. ‘‘మన పని దైవకార్యం’’, సంస్కృతియే జాతికి ఆత్మ .. ఇలాంటి మాటలు డాక్టర్జీ ప్రసంగాలలో కనిపిచంయాి. సంప్రదాయానికి దూరమైన ఆలోచన దేనినీ డాక్టర్జీ ప్రకటించలేదు. అయితే కొన్ని కొన్ని ఆాచారాలలో, మూల సూత్రాలు మరుగున పడినప్పుడు ఆయన ఆ సూత్రాలను గుర్తు చేశారు.
 
ఉదాహరణకు ‘‘సంభవామి యుగే యుగే’’ అని గీతలో పరమాత్మ చేసిన వాగ్దానాన్ని చూసి అవతారాల కోసం ఎదురు చూసే వారికి ఆయన ఇలా బోధించేవారు ‘‘భగవంతుడు అవతరించేది సాదువులనూ, సజ్జనులనూ రక్షించడానికి. మరి నిజంగా మనం సజ్జనులమేనా? సమాజం గురించీ, ధర్మ సంస్కృతుల గురించీ ఆలోచించని వారూ, స్వార్థం తప్ప మరొకటి తూచని వారూ సాదువులు ఎలా అవుతారు? దుర్మార్గులే అవుతారు. ఈ చెడ్డ గుణాలు మనో ఇలా మిగిలి వున్నంత వరకూ మనం ఎంత వేడుకున్నా ఆయన దయ చూపడు, మన సహాయానికి రాడు. దేశ ధర్మాల కోసం మనకున్నదంతా త్యాగం చేయడానికి మనం సిద్ధపడినప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని సజ్జనులుగా గుర్తించి మనకోసం పరుగున వస్తాడు. మనిషిని కుదిపివేసి అతనిలో కర్తవ్య భావనను మేల్కొలిపే ఆలోచనలు ఈ విధంగా డాక్టర్జీ మాటలలో వ్యక్తమయ్యేవి. సంఘం కొత్త పని ఏదో చేస్తుందనే అహంకారం ఆయన సంఘంలో ఎన్నడూ ఏర్పడనివ్వలేదు. ధర్మ సంస్కృతులను రక్షించడమనే మహత్తర ఆశయం నుంచి స్వయం సేవకుల దృష్టిని ఎన్నడూ తొలగనివ్వలేదు.