వ్యక్తి నుండి జాతీయ శక్తిగా మలిచే... సంఘ నిత్యశాఖ"

VSK Telangana    19-Oct-2026
Total Views |
 
shakha2
 
వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ మార్పు, సమాజ మార్పు ద్వారానే దేశ రక్షణ, దేశ పునర్నిర్మాణం సాధ్యమనే మహత్తరమైన భావనతో 1925లో పరమపూజ్య డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారిచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రారంభించబడింది. సమాజాన్ని సంఘటితం చేయడం సులభంగా కనిపించవచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి క్రమశిక్షణ, సహనం అవసరం. అందుకే సంఘ, తన శాఖల ద్వారా నిరంతరం ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని చూస్తోంది.
 
సంఘ్ కార్యాచరణకు కీలకమైన అంశం శాఖ..ఒకరకంగా చెప్పాలంటే సంఘ్ ఆత్మలాంటిది శాఖ అని చెప్పొచ్చు. ఆరెస్సెస్ రెండో సర్ సంఘచాలక్ గురూజీ శాఖను కల్పవృక్షమని, కల్పతరువు అని వర్ణించేవారు. దీని కింద కూర్చొంటే చాలు దేశపునర్నిర్మాణంలో మనమూ భాగస్వాములమవగలం. ఏ విధమైన హంగూ ఆర్భాటాలు, కులమతాల భేదాలు లేకుండా, కేవలం ఒక గంట పాటు సాగే ఈ నిత్య సాధన ఒక సాధారణ మనిషిని శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా అత్యంత శక్తివంతుడైన దేశభక్తుడిగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన సంస్కార కేంద్రంగా నిలుస్తోంది., సంఘ శక్తి అంతా ఒక గంట శాఖలో నిక్షిప్తమై ఉంది.
 
ఈ నిత్య శాఖ అనేది అత్యంత కచ్చితమైన సమయ పాలనతో, సైనిక క్రమశిక్షణను తలపించేలా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో సాగుతుంది. మొదటగా దక్ష-ఆరామ్ వంటి ఆజ్ఈలతో స్వయంసేవకులంతా వరుసల్లో నిలబడటంతో శాఖ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భగవాధ్వజారోహణ , ధ్వజ ప్రణామం జరుగుతాయి. అనంతరం వ్యాయామం యోగ, సూర్య నమస్కారాలు, సమతా, నియుద్ధ, దండ ప్రయోగం, ఆటలు వంటి శారీరక సాధనలు ఉంటాయి. ఆ వెనువెంటనే దేశభక్తి గీతాలాపన, సంగీత వాయిద్య సాధన (ఘోష్) సుభాషితం, అమృత వచనం, పురాణేతిహాస కథలు . సమకాలీన పరిణామాలపై చర్చల వంటి బౌద్ధిక, మానసిక సాధనలు నిర్వహిస్తారు. చివరగా ధ్వజ అవరోహణ చేసి, దేశమాత ప్రార్థనను ఏకకంఠంతో పఠించి, భారత్ మాతా కీ జై నినాదంతో శాఖను ముగిస్తారు.
 
శారీరక వ్యాయామాలెందుకో తెలుసా?
 
 
ఈ నిత్య శాఖలో భాగమైన వ్యాయామం, యోగా , సూర్య నమస్కారాల వంటి సాధనల వెనుక సంఘ్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. దేశ సేవ చేయాలన్నా, సమాజానికి ఉపయోగపడాలన్నా ముందు స్వయంసేవకుడి శరీరం వజ్రంలా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే రోగగ్రస్తమైన శరీరంతో దేశాన్ని రక్షించలేమని సంఘ్ చెబుతోంది. అందుకే తప్పకుండా సంఘశాఖలో శారీరక వ్యాయామాన్ని చేయిస్తారు. దీనివల్ల స్వయంసేవకులలో శారీరక దృఢత్వం, ఆరోగ్య శక్తి , మానసిక ఏకాగ్రత వంటి శక్తులు లభిస్తాయి. నిత్యం చేసే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజితమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మనస్సుపై సంపూర్ణ నియంత్రణను ఇస్తుంది.
 

shakha4 
 
పథసంచలన్ చేయడం
 
మనం సంఘ కార్యక్రమాలు ఏవైనా అయితే పథసంచలన్ ను చూస్తూనే ఉంటాం. అడుగులో అడుగు కలుపుతూ అందరూ ఒకేతీరుగా నడిచే ఆ తీరు అబ్బురపరుస్తుంది. పథ సంచలన్ అనేది సంఘ్ సుశిక్షిత, క్రమశిక్షణతో కూడిన రూపానికి ప్రతీకగా నిలుస్తుంది. వందలాది మంది ఒకే లయలో, ఒకే అడుగు వేస్తూ నడవడం సమాజానికి భద్రతా భావాన్ని, దేశద్రోహులకు హెచ్చరికను ఇస్తుందని సంఘ్ చెబుతోంది. దీని ద్వారా సమష్టి శక్తి, వ్యవస్థీకృత శక్తి . సామూహిక క్రమశిక్షణ వంటి శక్తులు డెవలప్ అవుతాయి. నాయకుడి ఒక్క ఆజ్ఞకు వేల అడుగులు ఒకేసారి కదలడం వల్ల వ్యక్తిగత అహంకారం పూర్తిగా నశించి, సమష్టి తత్వం అలవడుతుంది. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నియమబద్ధంగా ఎలా మసలుకోవాలో ఇది నేర్పుతుంది.
 
నియద్ద, దండప్రయోగం వంటివి నేర్పించడం
 
మరోవైపు నియుద్ధ మరియు దండ ప్రయోగం వంటి ఆత్మరక్షణ విద్యల ద్వారా హిందూ సమాజం బలహీనమైనది కాదు, తనను తాను రక్షించుకోగల సమర్థవంతమైనది అని చాటడం సంఘ్ ప్రధాన లక్ష్యం. ఆపదలో ఉన్నప్పుడు వేరొకరి సహాయం కోసం ఎదురుచూడకుండా మనల్ని మనం, మన సమాజాన్ని రక్షించుకోవాలని సంఘ్ పిలుపునిస్తుంది. ఐదు అడుగుల వెదురు కర్రతో చేసే దండ ప్రయోగాలు , నియుద్ధ ప్రాక్టీస్ వల్ల శారీరక చురుకుదనం పెరిగి, ఆత్మరక్షణ శక్తితో పాటు పరాక్రమం పెంపొందుతుంది. మనసులోని భయం పూర్తిగా తొలగిపోయి ధైర్యం, ఆత్మవిశ్వాసం నిండుతాయి. సమాజంలో అన్యాయం జరిగితే ధీటుగా ఎదురుతిరిగే శౌర్యం కార్యకర్తలకు అలవడుతుంది.
 
ఆటపాటలతో శాఖ..
సంఘ్ శాఖలో ఆడే ఆటల విషయంలో సంఘ్ ఒక వినూత్న విధానాన్ని పాటిస్తుంది. ఇక్కడ ఆడే ఖేల్ కూద్‌లో ఎటువంటి పరికరాలు ఉండవు, కేవలం నేల , శరీరం ఉంటే చాలు. ఇవి కేవలం వినోదం కోసం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే పరస్పర అనుబంధం కోసం ఆడే ఆటలు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు , క్రీడా స్ఫూర్తి వంటి అద్భుతమైన శక్తులు లభిస్తాయి. ఆటలలో గెలుపోటములను సమానంగా స్వీకరించడం అలవడటంతో పాటు, కింద పడిన తోటి స్వయంసేవకుడిని చేయి పట్టి పైకి లేపడం ద్వారా పరస్పర సహకారం, టీమ్ వర్క్ పెరుగుతాయి. క్లిష్ట సమయాల్లో క్షణాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తి కూడా దీనివల్ల అలవడుతుంది.
 

దేశభక్తి గీతాలాపాలన
ఇక దేశభక్తి గీతాలాపన , ఘోష్ వంటి సంగీత వాయిద్య సాధనల ద్వారా హృదయాలను కదిలించే భావోద్వేగ శక్తి , ఏకతా భావం పెంపొందుతాయి. సంగీతానికి మనుషులను ఏకం చేసే శక్తి ఉందని, దేశభక్తి గీతాలు స్వయంసేవకుడి రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి. . అందరూ కలిసి ఒకే గొంతుతో దేశభక్తి పాటలు పాడినప్పుడు మనసులోని స్వార్థం తొలగిపోయి, సుప్తచేతనావస్థలో ఉన్న దేశభక్తి మనలో జాగ్రుతమై మేల్కొంటుంది. అలాగే డ్రమ్స్, డంబుల్స్ వంటి వాయిద్యాల సాధన వల్ల శ్రవణేంద్రియాల ఏకాగ్రత మరియు లయబద్ధత సిద్ధిస్తాయి.
 

shakha3 
 
 
బౌద్ధిక్ కార్యక్రమం
 
ఏ సమాజం తన చరిత్రను, పూర్వీకుల త్యాగాలను మరుస్తుందో ఆ సమాజం అంతరించిపోతుందని, కాబట్టి మన వైభవపూర్వకమైన మూలాలను నిరంతరం స్మరించుకోవాలని సంఘ్ చెబుతోంది. ఇందుకోసం శాఖలో చెప్పే ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, స్వామి వివేకానంద వంటి దేశభక్తులతో పాటుగా ఆధునిక కాలపు స్పూర్తిమంతుల వ్యక్తుల కథలు, పురాణేతిహాసాల కథల వల్ల నైతిక శక్తి ,స్కిల్ డెవలమ్మెంట్ లాంటివి ప్రతి స్వయంసేవకుడిలోనూ నిక్షిప్తం అవుతాయి. మనదేశ ఔన్నత్యాన్ని గురించి వారు అనర్గలంగా ఇతరులకు చెప్పగలరు. ఇవి స్వయంసేవకులలో ఉదాత్తమైన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడతాయి. . జీవితంలో ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా అధైర్యపడకుండా నిలబడే మనోస్థైర్యాన్ని ఇవి అందిస్తాయి.
 
 
దీనితో పాటు స్వయంసేవకుడు కేవలం శారీరకంగానే కాదు, మేధోపరంగా కూడా చైతన్యవంతుడై ఉండాలని, దేశంలో ఏం జరుగుతుందో, దేశానికి ఏది ముప్పో గ్రహించగలిగే పరిణతి ఉండాలని సంఘ్ ఆకాంక్షిస్తుంది. శాఖలో జరిగే సమకాలీన పరిణామాల చర్చల (బైఠక్) వల్ల బౌద్ధిక శక్తి , విచక్షణా జ్ఞానం లభిస్తాయి. సమాజంలోని సమస్యలపై, దేశ భద్రతపై స్వయంసేవకులకు సరైన అవగాహన ఏర్పడుతుంది. పుకార్లను నమ్మకుండా, ఏది నిజం ఏది అబద్ధం అని విశ్లేషించే సామాజిక పరిణతి లభించడంతో పాటు, సమాజ మార్పు కోసం తానేం చేయాలో స్పష్టత వస్తుంది.
చివరగా పాడే సంఘ ప్రార్థనను శాఖకు ఆత్మగా భావిస్తారు. ఈ ప్రార్థనలో నా కుటుంబం బాగుండాలి అని స్వార్థంకాదు,, నా దేశం వైభవ శిఖరాలకు చేరి జగద్గురువు కావాలి, నన్ను నేను దేశసేవకు సమర్పించుకునే శక్తిని ఇవ్వు అని భరతమాతను కోరతారు. దీనివల్ల ఆధ్యాత్మిక శక్తి , దేశభక్తి, సమర్పణ భావం లభిస్తాయి. ఈ ప్రార్థన వల్ల నేను అనే స్వార్థం పోయి నా దేశం అనే పరమార్ధం నిండుతుంది. కులమతాల పట్టింపులు వీడి హిందువులందరూ ఒకటే అనే భాతృభావం మనస్సులో బలంగా నాటుకుంటుంది.
 

shakha 
ఇలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిత్య శాఖ అనేది కేవలం ఒక గంట గడిపే మైదానం కాదు, అది పవిత్రమైన మనిషిని తయారుచేసే ఒక పవిత్రమైన ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. ఇక్కడ లభించే శారీరక ఆరోగ్యం, బౌద్ధిక వికాసం, మానసిక ధృడత్వం ఆధ్యాత్మిక సమర్పణ శక్తులన్నీ కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, అవి పూర్తిగా సమాజ సేవ కోసం , దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఒక గంట పాటు శాఖలో పొందిన ఈ అద్భుతమైనసంస్కారాలను గుండెల్లో నింపుకుని, ఒక స్వయంసేవకుడు మిగతా 23 గంటలు సమాజంలో ఉంటూ దేశాభివృద్ధికి, పరహితానికి ధారపోస్తాడు. అందుకే సంఘ్ శాఖ ద్వారా తయారైన వ్యక్తులు దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడి నిస్వార్థ సేవలు అందిస్తూ అఖండ భారత నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు.